చావక్కాడ్ బీచ్: గురువాయూర్ తీరం‌లోని సుందర బీచ్


గురువాయూర్ క్షేత్రానికి సమీపం‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలలో చావక్కాడ్ (చవక్కాడ్) బీచ్ ఒకటి. సుందమైన ఈ బీచ్ గురువాయూర్ పట్టణానికి సుమారు 5 కిమీల దూరం‌లో ఉన్న చావక్కాడ్ (Chavakkad) పట్టణానికి 2 కిమీల దూరం‌లో ఉన్నది. ఇక్కడ సమృద్ధిగా పెరిగే చేవల్ చెట్ల వలన ఈ ప్రాంతానికి చావక్కాడ్ అని పేరు వచ్చిందని స్ఠానికులు చెపుతారు.


కూట్టుంగళ్ లేదా కూట్టుంగళంగడిగా పిలువబడే ఈ ప్రాంతం పూర్వ యుగంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆంగ్లేయులు ఈ పట్టణాన్ని ‘చౌఘాట్’ అని పిలిచేవారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం వారు 1970ల ప్రారంభంలో చావక్కాడ్ పేరు మార్చినారు.

చావక్కాడ్ బీచ్ 'అజిమోకం' (Azhimukham) అని పిలువబడే దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. మలయాళంలో అజిమోకం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం అని అర్థం.


అరేబియా సముద్రపు తీరంలో జాతీయ రహదారి ప్రక్కనే గల ఈ బీచ్ కేరళలోని ఇతర బీచ్‌లతో పోలిస్తే రద్దీ తక్కువ. ఆధునీకరణ స్పృశించని ఈ బీచ్ చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరపు అనుభవం కలిగిస్తుంది. బీచ్‌లో మృదువైన ఇసుకతో ఎంతో పరిశుభ్రతగా ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

చవక్కాడ్‌ ప్రాంతంలో నివసించేవారు ఎక్కువమంది మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్నారు. అందువల్ల ఈ ప్రదేశాన్ని మినీ గల్ఫ్ అని కూడా అంటారు.


స్థానిక ఆకర్షణలు:

చావక్కాడ్ మత సామరస్యానికి మరియు ప్రజల మధ్య భిన్నత్వానికి ప్రతీక.చావక్కాడ్‌లో ప్రసిద్ధి చెందిన మనతల జుమా మసీదు కలదు. చావక్కాడ్‌లోని పలయూర్‌ (Palayoor)లో క్రీ.శ. 52 సంవత్సరంలో సెయింట్ థామస్ స్థాపించిన సెయింట్ థామస్ చర్చి (St. Thomas Major archiepiscopal church) ప్రసిద్ధిగాంచినది, ఇది దక్షిణాసియాలో మొదటి చర్చి అని భావిస్తారు. మనతల విశ్వనాథ దేవాలయం చవక్కాడ్‌లోని మరో ముఖ్య ఆకర్షణ.

గురువాయూర్ ఇతర ఆకర్షణల బ్లాగ్ ఆర్టికల్స్ కొరకు వీటిపై క్లిక్ చేయండి.


చావక్కాడ్ బీచ్‌కి ఎలా చేరుకోవాలి?

చావక్కాడ్ పట్టణం జాతీయ రహదారి 66 పై కొచ్చి నగరానికి ఉత్తరాన 75 కిమీ, త్రిసూర్‌కు వాయువ్యంగా 25 కిమీ మరియు పొన్నానికి దక్షిణంగా 24 కిమీ దూరంలో ఉంది.

గురువాయూర్ పట్టణం నుంచి చావక్కాడ్ బీచ్ సందర్శించే పర్యాటకులు ప్రధాన పట్టణం చేరుకోవడానికి ముందుగానే బీచ్ చేరుకోవచ్చు. గురువాయూర్ నుండి ప్రవేట్ వాహనాలు, ఆటోల లేదా KRTC బస్సుల ద్వారా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం:
జాతీయ రహదారి 66 చావక్కాడ్ పట్టణం గుండా వెళుతుంది. కేరళలోని అన్నీ ముఖ్య పట్టణాల నుండి తరచుగా ప్రైవేట్ మరియు KRTC బస్సులు కలవు.

రైలు మర్గం:
చావక్కాడ్‌కు సమీపంలోని రైల్వే స్టేషన్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్. గురువాయూర్ రైల్వే స్టేషన్ త్రిస్సూర్-గురువాయూర్ సెక్షన్‌లో ఉంది. త్రిసూర్ రైల్వే స్టేషన్ చవక్కాడ్‌కు సమీపంలో ఉన్న ప్రధాన రైలు కేంద్రం.

వాయు మార్గం:
80 కి.మీ దూరంలో ఉన్న నెడుంబస్సేరి వద్ద ఉన్న కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. అన్ని అంతర్జాతీయ, దేశీయ మరియు చార్టర్డ్ విమానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కరిపూర్ వద్ద కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం 104 కి.మీ దూరంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం