ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం


 
 
ఘాటి సుబ్రహ్మణ్య (ఘటి సుబ్రహ్మణ్య) దేవాలయం బెంగుళూరు నగర శివారులో గల దొడ్డబళ్ళాపూర్ సమీపంలోని ఘాటి అని పిలువబడే గ్రామంలో నెలకొని వున్న సుప్రసిద్ద సుబ్రహ్మణ్య క్షేత్రం. హిందువులు సుబ్రహ్మణ్య స్వామిగా పిలువబడే కార్తికేయుడు పార్వతి పరమేశ్వరుల పుత్రుడు మరియు సర్పాలకు అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని భావిస్తారు. అలాగే భక్తులు తమ జాతకంలో కుజ, కాలసర్ప దోషంచే సకాలంలో పెళ్ళికాని వారు సుబ్రహ్మణ్య స్వామిని పుజిస్తారు. నాగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రాన్ని ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తుంటారు. 
 

 

సుబ్రహ్మణ్య క్షేత్రం:

కర్ణాటక రాష్ట్రం నందు మూడు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది, మధ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధిచెందినవి. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఆది సుబ్రహ్మణ్య క్షేత్రంగా, ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా మరియు పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా భక్తులు కొలుస్తారు. ఈ మూడు క్షేత్రాలను కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుందని, ఈ క్షేత్రాలను దర్శించి పూజించిన వారికి సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడుతుందని భక్తుల నమ్మకము.

పురాణ ప్రాశస్థం:

ఘటం అంటే కుండ అని అర్ధము. తారకాసురుని సంహరించడానికి కావలిసిన శక్తి కోసం సుబ్రహ్మణ్య స్వామి ఒక కుండలో నిలబడి విష్ణు రూపం అయిన నృసింహుని ప్రార్ధించడం వలన ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. ఇంకో కధనం ప్రకారం ఈ ప్రాంతములో ఘటికాసురుడనే రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి సం‌హరించుట వలన ఈ ప్రదేశానికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధిచెందిందని చెపుతారు.

విగ్రహ విశిష్టత:


నృసింహుని అనుగ్రహంతో సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తపస్సు చేసినందువలన సుబ్రహ్మణ్య స్వామి తన సహాజాకృతి అయిన సర్పాకారంలో నరసింహ స్వామితో సమ్మిళతమై భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలోని మూల విగ్రహంలో సుబ్రహ్మణ్య స్వామి మరియు నరసింహ స్వామిలను చెక్కబడి ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి తూర్పు దిశగాను, నరసింహ స్వామి పడమటి దిశగాను ఉంటాయి. భక్తుల సందర్శానార్ధం విగ్రహం వెనుక వైపున అమర్చిన అద్దం ద్వారా నరసింహ స్వామి వారిని దర్శిస్తారు.

ఆలయ చరిత్ర:

ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఎన్నో రాజకుటుంబాలు అభివృద్ధి చేశాయి. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతాన్ని పాలించిన ఘోర్పడే రాజ వంశీకులైన శాంధూర్ రాజ పాలకులు ఈ ఆలయాన్ని సుమారు 6౦౦ సంవత్సరాల క్రితం నిర్మితమైనట్లుగా తెలుస్తుంది. ఘోర్పడే రాజుకు ఈ స్వామి స్వప్నంలో కనిపించి తన ఉనికిని తెలియజేసాడనేది స్థల పురాణగాధ.

ఉత్సవాలు / పూజలు:

  • స్కంద షష్టి మరియు నరసింహ జయంతి ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు. 
  • రాహు కేతు పూజలు, ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కార, కుజ దోష నివారణ పూజలు సంవత్సర పర్యంతం జరుగుతుంటాయి. 
  • ప్రతి మంగళవారం, షష్టి తిధులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
  • అలాగే ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల సమయంలో ఆవు పాలతో జరిగే క్షీరాభిషేకం ఎంతో ప్రసిద్ధి. 
  • ఘాటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ‘తులాభారం’ ద్వారా మొక్కుబడులు చెల్లించుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. స్వామివారికి బెల్లం, అరటిపండ్లు ఇష్టమైన నైవేద్యాలుగా సమర్పిస్తుంటారు. 
  • వివాహ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. 
  • భక్తులకు రోజూ ఉచిత భోజనం అందిస్తారు.


 

నాగ ప్రతిమ:

సుబ్రహ్మణ్య సన్నిధిలో నాగ ప్రతిష్టకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో నాగుల విగ్రహాలు సమాహారంగా కొలువుదీరిన ఈ క్షేత్రంలో సంతానార్హులైన దంపతులు, రోగ పీడితులైన భక్తులు ఈ క్షేత్రంలో నాగ ప్రతిష్టను చేస్తారు. జంట నాగులు, నాగ ప్రతిష్ట చేయటం వలన స్వామి వారి అనుగ్రహంతో సర్పదోషాలు, గ్రహ సంబంధమైన దోషాలు, అనారోగ్యాలు తొలగిపోయి, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. శుభ తిధులైన షష్టి, చవితి, పంచమి తిధిలలో ఈ నాగ విగ్రహాల ప్రతిష్టను చేస్తుంటారు. 
 

 

స్ధానిక ఆకర్షణలు:

ఘాటి సుబ్రమణ్య దేవాలయం దర్శనతో పాటు ‘కుమార ధార పుష్కరణి’ మరియు ఆలయ పరిసరాలతో పాటు ఆహ్లాదకర గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాలను కూడా చూసి ఆనందించవచ్చు. ఇక్కడికి సమీపంలో గల నంది హిల్స్ మరియు మకలిదుర్గా ప్రసిద్ద పర్యాటక ప్రదేశాలు పర్వతారోహకులకు (ట్రెక్కింగ్) ఎంతో ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. 
 

 

ఘాటిని ఎలా చేరుకోవాలి?

ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం బెంగళూరు నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరు నుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

రోడ్డు మార్గం:
బెంగళూరు నుండి డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉన్నా కానీ చాలా తక్కువ. అందువలన దొడ్డబళ్ళాపూర్ మీదుగా ఘాటి చేరుకోవచ్చు. బెంగళూరులో మెజెస్టిక్ (కెంపెగౌడ బస్ స్టేషన్) నుండి బస్ నెం: 285M ద్వారా దొడ్డబళ్ళాపూర్ చేరుకోవచ్చు. ఈ బస్సు 'మీరా సర్కిల్', 'హెబ్బాలా', 'యలహంక' గుండా వెళుతుంది. దొడ్డబళ్ళాపూర్ చేరుకోవడానికి సుమారు ఒకటిన్నర గంటలు పడుతుంది. దొడ్డబళ్ళాపూర్ నుండి ఘాటి సుబ్రహ్మణ్య చేరుకోవడానికి KSRTC బస్సులతో పాటు ఆటో సదుపాయం వుంది.

రైలు మర్గం:
బెంగళూరు - గుంటకల్ మార్గంలో ఉన్న మకాలి దుర్గా (రైల్వే స్టేషన్ కోడ్: MKL) రైలు స్టేషన్ నుండి చేరుకోవచ్చు. మాకలిదుర్గ నుండి 4.5 కి.మీ.ల దూరంలో ఘాటి కలదు.

వాయు మార్గం:
బెంగళూరులో దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం