ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)


అరుణాచలేశ్వరుడు నెలకొనివున్న అరుణాచలం ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రము. దీనినే తమిళులు ‘అణ్ణామలై’ లేదా ‘తిరువణ్ణామలై’ అంటారు. తిరువణ్ణామలై తమిళనాడు రాష్టంలో ఉన్న తిరువణ్ణామలై జిల్లాలో వెలసి ఉంది. ఇది శైవులకు ఎంతో ముఖ్యమైన క్షేత్రము.

తిరువణ్ణామలై పంచ భూత లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం పంచలింగ క్షేత్రములలో అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు తమిళనాడులోని చిదంబరం క్షేత్రం ఆకాశమును, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి క్షేత్రం వాయువును, తమిళనాడులోని తిరువనైకోవిల్ క్షేత్రం నీటిని మరియు తమిళనాడులోని కంచి క్షేత్రం భూమిని సూచిస్తాయి.



స్థల పురాణం:

పూర్వం బ్రహ్మ విష్ణువుల మద్య జరిగిన తగువును తీర్చడానికి మహా శివుడు వారిద్దరి మద్య అగ్ని లింగంగా ఆవిర్భవించాడు. అప్పుడు ఉద్బవించిన ప్రకాశవంతమైన కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు సకల దేవతలు ప్రార్ధించగా మహా శివుడు ఎర్రని శిల (కొండ) రూపం‌లో సాక్షాత్కరించాడు అదే అరుణాచలముగా పిలవబడుతుంది. అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని అర్ధము. ఎర్రని అరుణ రూపం‌లో వెలసిన పర్వతం కనుక అరుణాచలంగా ప్రసిద్ధిచెందింది. అలాగే 'అణ్ణాల్‌' అనే తమిళ పదానికి 'అగ్ని' లేదా 'కాంతి' అని అర్థం. అగ్నిరూపంలో వెలసిన పర్వతం కనుక 'అణ్ణామలై' అనే పేరు ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము చేయటమని భక్తుల విశ్వాసం.



అరుణాచలేశ్వర ఆలయం:

అరుణ గిరి పాద ప్రాంతంలో కొండకు తూర్పు దిక్కున ఉన్న అరుణాచలేశ్వర ఆలయం‌లో పరమశివున్ని అగ్ని లింగంగా, పార్వతీ దేవిని అపిత కుచలాంబాదేవి రూపంలో పుజిస్తారు. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మితమైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయాన్ని చోళ రాజులు 9వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. అనంతరం పల్లవులు, విజయనగర రాజులు అభివృద్ధి పరిచారు. ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో అలరాలే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచీ భక్తులు వస్తూ ఉంటారు అద్భుత శిల్పకళతో ఈ ఆలయం బారతదేశ దేవాలయాలలోగల పెద్ద దేవాలయములలో ఒకటి. ఆలయము నాలుగు వైపులా నాలుగు ద్వారాలు కలిగి, వాటిపై గోపురాలు ఆకాశాన్ని తాకేంత పెద్దవిగా ఉండి ఆలయ ఘనతను చాటుతాయి. ఇందులోని తూర్పు రాజ గోపురం 11 అంతస్థులతో 217 అడుగుల (66 మీటర్లు) ఎత్తులో నాలుగు గోపురాలలో ఎతైనదిగా ఉంది. దీనిని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించాడు. ఈయనే అలయం‌లో వెయ్యి స్తంబాల శాలను, కోనేటిని నిర్మించారు.. వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివగంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. ఆలయం‌లో గజానన, షడాననులకు విడివిడిగా ఉపాలయాలున్నాయి ఇక్కడ స్వామి వారి గర్భాలయంకు ఎడమవైపున అమ్మవారు అపిత కుచలాంబాదేవి కొలువై ఉంటుంది. ఆలయం‌లో ఇక్కడ నుంచి మనకు అరుణగిరి కనిపిస్తుంది.


అరుణాచల గిరి ప్రదిక్షణ:

ఇక్కడున్న అరుణాచల పర్వతమే శివుని ప్రతి రూపం అందుకే భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ పరమేశ్వరున్ని ప్రదక్షిణ చేసినట్లేనని భావిస్తారు. అందువలన ఇక్కడి అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడుతున్నది.. దాదాపు 800 మీటర్ల ఎత్తైన ఈ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్ల నడక మార్గం ఉంది. భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. వీలు కాని భక్తులు ప్రయివేట్ వాహనాలు లేదా ఆటోలలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, కానీ పౌర్ణమి రోజు మరియు ఇతర పర్వదినాలప్పుడు అనుమతించరు. ఈ కొండ పై అనేక ఔషద మొక్కలు ఉన్నాయి కనుకనే కాలినడకన చేసే ప్రదక్షిణాల వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా పౌర్ణమి వెన్నెలలో ఈ ఔషద మొక్కల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఆ రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో గిరి ప్రదిక్షణలో పాల్గొంటారు.

గిరి ప్రదక్షణం అరుణాచలేశ్వరాలయం నుండి ప్రారంభించి అరణాచల పర్వతం చుట్టూ తిరిగి ఆలయం వద్దకు చేరుకుని ప్రదక్షణం పూర్తి చేస్తారు. గిరి ప్రదిక్షణ దారిలో చాలా ఆలయాలు, మహర్షుల ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి

నంది దర్శనం:

మహా శివుడే కొండగా బావిస్తే, మరి శివుని వాహనం నంది ఎలా ఉండాలి. కొండ పక్కనే మరో కొండయై ఉండాలి కదా? అవును. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. కేవలం ఈ ప్రదేశం నుండి మాత్రమే నందిని కొండగా చూసే భాగ్యం కలుగుతుంది. ఎంత విచిత్రమో కదా!

పర్వ దినాలు:


అరుణాచలేశ్వరునికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షిక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. పున్నమి రోజుల్లో, ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజున ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. వీటిలో అత్యంత ప్రసిద్ధ కార్తీకంలో (నవంబరు / డిసెంబరు) ఒకటి జరుపుకుంటారు.

ఈ కార్తిక మాసంలో 'కార్తిక దీపోత్సవం' పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అగ్ని నక్షత్రమైన కృత్తిక, పున్నమి కలిసిన మాసాన్ని 'కార్తిక మాసం' అంటారు. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే కార్తీక దీపంతో ముగుస్తాయి. పౌర్ణమికి ముందురోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం వెలిగిస్తారు. పౌర్ణమి నాటి ప్రదోష సమయంలో, వృషభారూఢుడైన అరుణాచలేశ్వరుణ్ణి అపిత కుచలాంబాదేవి, గణపతి, షణ్ముఖులతో ఊరేగింపుగా బయలుదేరి, అరుణ గిరిపై ఏర్పాటు చేసిన మూడు టన్నుల నెయ్యితో జ్యోతి వెలిగిస్తారు. దీనినే భక్తులు కార్తిక మహా దీపోత్సవము అని అంటారు. తమిళులు 'కార్తిగై దీపం'గా వ్యవహరిస్తారు ఈ దీపోత్సవాన్ని దర్శించడానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు బారీ సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేస్తారు.

తిరువణ్ణామలై అష్టలింగాలు:

గిరిప్రదిక్షణలో అరుణాచలం పర్వతం చుట్టూ ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్పాలకుల లింగాలు దర్శనం ఇస్తాయి. అవి వరుణ లింగం , వాయులింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం, ఇంద్ర లింగం, నైరుతి లింగం, అగ్ని లింగం, వాయులింగం.


రమణ ఆశ్రమం:

అద్వైత వేదాంత గురువు రమణ మహర్షికి అరుణాచలం‌కి ఎంతో అవినాభావ సంబందం ఉంది. అరుణాచలేశ్వరుని ఆలయం‌లో కల శివగంగ తీర్థం నందు రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. రమణ మహర్షి నివాస స్థలంలో ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రం నిర్మితమైవుంది. 16 ఏళ్ళ వయస్సులోనే మౌన ముని ప్రసిద్దిగాంచిన రమణ మహర్షి 1950 లో తన మరణం వరకు యాభై మూడు సంవత్సరాలు నివసించారు. ఈ ఆశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి 2 కి.మీ.ల దూరంలో గిరి ప్రదక్షిణ దారిలో ఉన్నది. ఈ ఆశ్రమంలో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ కోతులు, నెమళ్లు మొదలగు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. సాయంత్రం పూట రమణ మహర్షి సమాధి వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు.

అలాగే శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం రమణ ఆశ్రమానికి కూత వేటు దూరంలో శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం ఉంది. ఇక్కడ శేషాద్రి స్వామి సమాధి ఉన్నది.



అరుణాచల గిరి చేసే భక్తులు తీసుకోవల్సిన జాగ్రత్తలు:

గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదిక్షణ చేసే భక్తులు పగటి పూట ఎండ ప్రతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున ప్రారంభించి ఉదయం 9 గంటలలోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. ఆ రోజున ప్రయివేట్ వాహనాలను అనుమతించరు.

అరుణాచలంలో వసతి:

అరుణాచలంలో మీరు వసతి చేయాలనుకుంటే స్థానిక హోటల్స్ కలవు. పౌర్ణమి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయం‌లో గిరిప్రదిక్షణం వెళ్ళాలనుకునే భక్తులు ఒక నెల రోజులు లేదా 15 రోజులు ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవడం మంచిది.

రమణాశ్రమంలో మీకు రూమ్స్ ఫ్రీ గా ఇస్తారు, కాకపోతే మీరు నెల రోజుల ముందుగా వారికి మెయిల్ చెయ్యాలి, రూమ్స్ ఖాళీగా ఉంటే ఇస్తారు. రమణాశ్రమం బస్సు స్టాండ్ నుంచి లేదా అరుణాచలేశ్వరాలయం నుంచి 2 కిమీ దూరం లో ఉంటుంది. వారి మెయిల్ ఐడి tostay@gururamana.org

అలానే రమణాశ్రమం ప్రక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ కూడా వసతికి 15 రోజులు మందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉండటానికి వసతి సదుపాయం నామమాత్రపు ధరలతో ఉంటుంది. అది కూడా కట్టలేనివారికి మినహాయింపు ఉంటుంది. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 914175 - 236999 / 238599 / 236740.

ఇవే కాకుండా వివిధ ఆశ్రమాలు వసతిని కల్పిస్తాయి.

అరుణాచలం ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం:
తిరుపతి, బెంగళూరు, చెన్నై నగరాలు తిరువణ్ణామలై క్షేత్రముతో అనుసంధానించబడియున్నది.

రైలు మార్గం:
అరుణాచల క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువణ్ణామలై రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ఆటోల ద్వారా ఆలయానికి కేవలం 5 - 10 నిమిషాలలో చేరుకోవచ్చు.

వాయు మార్గం:
అరుణాచలంకి దగ్గరలో చెన్నై, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలవు. అలాగే తిరుపతి (రేణుగుంట) నందు జాతీయ విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం