గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

గురువాయూర్ కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ కృష్ణుడు బాల కృష్ణునిగా కొలువుదీరి గురువాయూరప్పన్‌గా పూజలందుకొంటున్నాడు. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రాన్ని భూలోక శ్రీ వైకుంఠం అని, కలియుగ వైకుంఠం అని భక్తులు భావిస్తూ స్వామి వారిని దర్శించి తరిస్తుంటారు. దేవతల గురువైన బృహస్పతి వాయిదేవుని తోడ్పాటుతో ఈ క్షేత్రం‌‌లో విగ్రహ ప్రతిష్టాపన చేయడం వలన, 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన దేవాలయం గల ఊరు కనుక 'గురువాయూర్' లేదా ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం.

గురువాయూరు ఆలయ చరిత్ర తెలిపే మురళ్ పెయింట్

గురువాయూర్ విగ్రహ ప్రత్యేకత:

గురువాయూర్ ఆలయ గర్బగుడిలోని విగ్రహం అయిదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడే అపూర్వమైన పాలరాతి అంజన శిలతో (పాతాళ శిల) మలచబడినది. ఈ రాయి చూడటానికి నీలపు రంగులో ఉంటుంది. ఇటువంటి విగ్రహం ప్రపంచం‌లో ఇంకొకటి లేదని చెపుతారు. స్వామి వారు శ్రీ మహా విష్ణువు రూపం‌లో చతుర్భుజములతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం (గద) మరియు పద్మము ధరించి బాల గోపాలునిగా దర్శనమిస్తారు.

ఆలయ ప్రవేశద్వారం

గురువాయూర్ స్థల పురాణం:

ఈ విగ్రహము వైకుంఠం నందు శ్రీ మహా విష్ణువుచే పూజింపబడి, బ్రహ్మ దేవునికి అప్పజెప్పెను, పిమ్మట సూత మహర్షి సంతానము కొరకు బ్రహ్మదేవున్ని పూజించగా వారికి ఈ విగ్రహమును అప్పగించెను. అటు పిమ్మట కాస్యప ప్రజాపతి, కాస్యప మహర్షి నుండి వసుదేవునికి లభించెను. వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడు ఈ విగ్రహమును ద్వారకలో ప్రతిష్ఠించి పూజించుచుండెను. శ్రీకృష్ణుని అనంతరం ద్వారకా నగరం సముద్రం‌లో మునిగిపోవు సమయమున ఈ విగ్రహము నీటిపై తేలియాడుచుండగా, దేవతల గురువైన బృహస్పతి వాయు దేవుని సహాయం‌తో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు లోకమం‌తా సంచరించుచూ పరశురామ క్షేత్రమైన కేరళ తీర ప్రాంతానికి వచ్చెను. అక్కడ మహా శివుడు రుద్ర తీర్ధము అనే సరస్సు ఒడ్డున తపస్సు చేయుచుండెను. బృహస్పతి, వాయువులు ఆ ప్రాంతం సమీపించగా వారి ఆగమనోద్దేశ్యం గ్రహించిన మహా శివుడు ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుటకు సమ్మతించి ఆ స్థలం‌ను విడిచి సరస్సు అవతలి ఒడ్డున గల మమ్మీయూర్ అనే ప్రాంతమునకు వెళ్ళి పార్వతి సమేతుడై నివసించెను. ఈ విధంగా గురువు మరియు వాయువులిద్దరూ ప్రధాన కారకులు కనుక ఈ క్షేత్రానికి ‘గురువాయుపుర’ అని, క్రమేణ ‘గగురువాయూర్’ అని పేరు వచ్చింది. అలాగే స్వామి వారి కొరకు ఈ స్ఠలమును వదిలి రుద్ర తీర్ధము ఆవలి వెళ్ళి మమ్మీయూర్ నందు వెలిసిన మహాదేవున్ని దర్శించకపోతే గురువాయూర్ పర్యటన సఫలం కాదని చెబుతారు.

గురువాయూర్ చరిత్ర:

ఉత్సవ దృశ్యం
ఈ ఆలయాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఎవరు నిర్మించారనే విషయమై ఖచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకు వెలుగులోనికి రాలేదు. 400 సంవత్సరాల పూర్వం ‘మేల్‌ప్పత్తూర్ నారాయణ భట్టాతిరి’ అనే భక్తుడు స్వామి వారి సన్నిధిలో కూర్చొని విశ్వవిఖ్యాతి గడించిన ‘నారాయణీయం’ అనే కావ్యాన్ని రచించాడు. ఆ విధంగా చూస్తే 16 వ శతాబ్ధానికే ఈ క్షేత్రం ప్రసిద్ధిచెందినట్లు భావించాలి. 1638 సంవత్సరం‌లో గర్భాలయాన్ని పునర్నిరించినట్లుగా కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది. 1710 సంవత్సరం‌లో డచ్చివారు ఆలయము పై దండెత్తి ఎంతో విలువైన ఆలయ సంపదను దోచుకువెళ్ళినట్లు వ్యక్తమైనది. 18 వ శతాబ్దం‌లో టిప్పు సుల్తాన్ ఆక్రమించినప్పుడు ఉత్సవ విగ్రహాన్ని “అంబలపుజ” అనే నదిలోకి మూల విగ్రహాన్ని ఆలయం‌లోని బావిలోకి మార్చినట్లు పిమ్మట మల్లీశ్శేరి నం‌బూద్రి పాడు వారి నేతృత్వం‌లో పునః ప్రతిష్ఠచేసినట్లుగా చెప్పబడుతుంది.

1930 సంవత్సరం‌లో మద్రాసు హైకోర్టు ఆలయ పరిపాలన కొరకు జమారిన్ రాజా మరియు మల్లీశ్శేరి నం‌బూద్రి పాడు వారిని ట్రస్టీలుగా నియమిస్తూ ఒక వ్యవస్థ చేసియున్నారు. స్వాతంత్ర్యానంతరం జనవరి 1, 1947 తేదీన హిందూ మతం‌లోని అన్నీ వర్ణాల వారికి ఆలయం‌లో ప్రవేశించేటట్లు చట్టం చేసారు. జనవరి 30, 1952 తేదీన ఇప్పుడు వున్న బంగారు ధ్వజ స్ఠంభం ఏర్పాటుచేసారు. నవంబరు 29, 1970 తేదీన జరిగిన అగ్ని ప్రమాదం‌ వలన ఆలయం అగ్నికి అహుతి అవడం వలన ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగినది.

గగురువాయూర్ ప్రవేశ కూడలి

ఆలయ నిర్మాణం:

గురువాయూర్ ఆలయాన్ని సాంప్రదాయ కేరళ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడినది. ఆలయం మొత్తం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయం తూర్పు అభిముఖంగా ఉన్నప్పటికి ఆలయం‌లోనికి ప్రవేశించడానికి తూర్పు మరియు పడమర దిక్కులలో రెండు గోపురాలు కలవు. తూర్పు గోపురాన్ని కిజక్కె నాడా (Kizhakke Nada) అని, పడమర దిక్కున గల గోపురాన్ని పదింజరె నాడా (Padinjare Nada) అని పిలుస్తారు. ఆలయం తూర్పు గోపుర ద్వారం నుండి స్వామి వారిని దర్శించవచ్చును. ఈ గోపురాల మధ్య ఉన్న మొత్తం ప్రాంతం పలకలతో కప్పబడి “అనపంతల్” లేదా “నడప్పురా” అని పిలువబడుతుంది. దీని మధ్యలో “నలంబలం” లేదా “చుట్టంబలం” అని పిలువబడే చదరపు ఆకారపు స్తంభాల మండపం ఉంది. నలంబలం వెలుపల గర్బగుడి ప్రవేశ ద్వారం ముందు ధ్వజస్తంభం లేదా కొడిమారం ఉంటుంది. నలంబలం బయటి గోడ సాయంత్రం వేళ విళక్కుమతం అని పిలువబడే నూనె దీపాలతో అలంకరించుటకు ప్రత్యేక నిర్మాణం ఏర్పాటుచేసివున్నారు. ఆలయ గోడలపై పురాణ గాధలు, శ్రీకృష్ణుని లీలలను వర్ణించే కుడ్య చిత్రాలు (మురళ్ పెయింట్స్) ఎంతో అందంగా చిత్రించి వున్నాయి.

నలంబలం లోపల గర్బగుడిని శ్రీకోవిల్ అని పిలుస్తారు. శ్రీకోవిల్‌లో ప్రధాన విగ్రహంతో పాటు మరో రెండు విగ్రహాలు ఒకటి పురాతనమైన వెండి విగ్రహం మరియు మరొకటి బంగారు విగ్రహం కలదు. వీటిని శీవేళి మరియు ఇతర ఊరేగింపులకు ఉపయోగిస్తారు. క్షేత్రపాలకులకు నైవేధ్యమును వీక్షించుటకై గురువాయూరప్పన్ మూడు సార్లు గర్బాలయం వదిలి వెలుపలకు వచ్చును. ఆ సమయం‌లో ప్రధాన పూజారి పువ్వులతో నైవైధ్యం సమర్పించుచుండగా, చిన్న పూజారి బంగారు ఉత్సవ విగ్రహాన్ని పట్టుకొని ఏనుగుపై నుండి స్వామి వారితో వీక్షింపజేసెను. ఈ పూజనే శీవేళి అని అంటారు.
ఉత్సవ దృశ్యం

ఆలయం‌లో గణపతి, అయ్యప్పన్, ఇడత్తిరికత్తు కావు భగవతి దేవీల ఉప ఆలయాలు మణికినార్ అనే చిన్న ఆలయ బావి మడపల్లి అని పిలువబడే ఆలయ వంటగది ఉన్నాయి. ఆలయానికి వెలుపల ఉత్తరం వైపున రుద్రతీర్థం అనే కోనేరు ఉంది.

గురువాయూర్ ఆలయం సమయాలు:

గురువాయూర్ ఆలయం భక్తుల దర్శనం కోసం తెల్లవారుజాము 3.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరియు సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 9.15 గంటల వరకు తెరిచి ఉంటుంది. సాధారణ దినములలో ఐదు పూజలు, విశేష దినములలో 21 పూజలు జరుగుతాయి. నిత్య పూజా కార్యక్రమములో భాగంగా కొన్ని పూజలకు భక్తులకు ప్రవేశం ఉండదు, ఆ సమయం‌లో భక్తులు క్యూ మార్గం‌లో వేచి ఉండాల్సి వుంటుంది. ముఖ్య పర్వదినాల సందర్భముగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు.

డ్రస్ కోడ్ :

గురువాయూరప్పన్ ఆలయ దర్శనం కొరకు విచ్చేసే భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే దరించాలి. పురుషులు చొక్కా దరించరాదు కాని పంచ, కండువ దరించాలి మరియు స్త్రీలు అయితే చీర లేదా చుడిదార్ దరించాలి.

నిర్మాల్య దర్శనం:

నిర్మాల్య దర్శనము చాలా విశేషమైనదిగా చెప్పబడుచున్నది. తెల్లవారఝామున మూడు గంటలకు గర్బాలయం తెరిచిన తరువాత ఈ దర్శనానికి అనుమతిస్తారు. ముందురోజు నిర్మాల్యమంతా తీసేసిన మూల విరాట్టు స్నానానికి సిద్ధమైన పసిపిల్లవాని రూపంలో నేత్రానందముగా దర్శనమిస్తాడు. ఆ తర్వాత నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి. ఈ నిర్మాల్య దర్శన విశేషమేమిటంటే ఈ దర్శనము కొరకు భక్తులు ముందు రోజు రాత్రి నుండి గురువాయూర్ టెంపుల్ క్యూలలో వేచియుంటారు.

అన్నప్రాసన:

గురువాయురప్పన్ సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్న పిల్లలకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం.


వివాహం:

స్వామి వారి సమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ఎంతో మంది ఇక్కడ వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు.

తులాభారం:

తులాభారం
భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరిన తరువాత తమ బరువుకి సమానంగా అరటి పండ్లు, బెల్లం, పంచదార, చిల్లర నాణేలు, పనస కాయలు మొదలైన వాటితో తులాభారం తూగి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటారు.

ప్రసాదాలు:

స్వామి వారి ప్రసాదాలను దేవస్థానం వారు ఏర్పాటుచేసిన కౌంటర్ నందు టికెట్ కొనుగోలు చేసి తరువాత ప్రసాదం కౌంటర్ నందు నైవేధ్యం తీసుకొనవచ్చును. ఇక్కడ లభించే పాల్‌పాయసం (తెలుగులో పాల పాయసం‌) ఎంతో ప్రసిద్ధి. పాల్‌పాయసం ఉదయం మాత్రమే లభిస్తుంది.

ఏనుగులు:

ఏనుగులను స్వామి వారికి కానుకగా సమర్పించుకొంటారు. ఆలయానికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలో దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు.

క్రిష్ణ నాట్టం (లేదా కృష్ణ నాట్యం):

1654 వ సంవత్సరం‌లో కాలికట్ జామరిన్ అయిన ‘రాజా మనవేద’ ముఖాభినయముచే, భావము తెలుపు ఒక ప్రదర్శన వ్రాసెను. దాని పేరే క్రిష్ణ నాట్టం (తెలుగులో కృష్ణ నాట్యం). శ్రీకృష్ణుని చరిత్ర ఇతివృతమైన భాగవతం ముఖ్యంగా రచించిన ఈ ప్రత్యేక కళ గురువాయూరప్పన్‌కు ఆరాధనగా, భక్తులచే నైవేద్యంగా ప్రదర్శించబడుతుంది. గురువాయూర్ ఆలయం వెలుపల ఉన్న ఆడిటోరియం‌లో ఈ కృష్ణ నాట్యం ప్రదర్శిస్తుంటారు.
ఉత్సవ దృశ్యం

క్రిష్ణ నాట్టం చూడటానికి కధాకళి వలె ఉండును. కధాకళిలో ఉపయోగించే దుస్తులు వచ్చ, కధి, మినక్కు, తడి, కరి, మొదలైన దుస్తులు ఉపయోగించెదరు. కధాకళి వలె క్రిష్ణ నాట్టంలో కధ నడవదు. ఇక్కడ చలనమునకు, నాట్యమునకు హెచ్చు విలువనిచ్చెదరు.

క్రిష్ణ నాట్టం‌లో ఎనిమిది భాగాలు ఉంటాయి. ఈ ఎనిమిది భాగాలు ఎనిమిది రోజులు ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలు భక్తులచే నైవేద్యంగా జరుగుతాయి. క్రిష్ణ నాట్టం‌ ప్రదర్శనకు గురువాయూరు దేవస్వోమ్ (దేవస్థానం) తరుపున 70 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఒక కధకు ₹ 3000/- చెల్లించవలెను. కేవలం దేవస్వం ద్వారానే బుకింగ్‌లు చేయాల్సి ఉంటుంది. క్రిష్ణ నాట్టం‌లో ఎనిమిది భాగాలు వాటి వలన ప్రయోజనాలు...
  1. అవతారం: సంతాన ప్రాప్తికి 
  2. కాళీయమర్ధనం: విష ప్రభావాన్ని తొలగించడానికి 
  3. రాసక్రీడ: పెళ్లికాని అమ్మాయిల శ్రేయస్సు, జంటల మధ్య వివాదాలకు ముగింపు పలకడానికి 
  4. కంస వధ: శత్రు నాశనం కొరకు 
  5. స్వయంవరం: సంతోషకరమైన దాంపత్యం మరియు వివాహం కొరకు 
  6. బాణాయుద్దం: అభిష్ట ప్రాప్తి కొరకు 
  7. వివిదావధం: పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు వ్యవసాయ దిగుబడిని పెంచడానికి 
  8. స్వర్గారోహణం: మోక్షప్రాప్తికి ఈ కధలను ప్రదర్శించబడుతాయి.

వసతి:

గురువాయూర్ దేవస్ఠానం ఆధ్వర్యం‌లో కౌస్తుభం, పాంచజన్యం అనే కాటేజీలు కలవు. ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం లేదు. ఇవే కాకుండా ఇక్కడ ఉండడానికి స్థానిక ప్రవేట్ హోటల్స్ కలవు.

అహారం:

గురువాయూర్ ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతిరోజు అన్నదానం చేయబడుతుంది. స్థానిక హోటల్స్‌‌‌లలో కూడా ఆహారం లభిస్తుంది.

గురువాయూర్‌లో దర్శించవలసిన ఇతర ప్రాంతాలు:

మమ్మీయూర్ మహా దేవుని ఆలయం, పున్నత్తూర్‌కోటలోని దేవస్థానానికి చెందిన ఏనుగులశాల, మ్యూజియం, తిరు వెంకటాచలపతి ఆలయం, పార్ధసారధి ఆలయం, నెన్ మెని బలరామ ఆలయం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మురళ్ పెయింట్స్, చవకాడ్ బీచ్, పాలయూర్ చర్చి మొదలైనవి ఉన్నాయి.

ఉత్సవ దృశ్యం

గురువాయూర్‌కి ఎలా చేరుకోవాలి?

గురువాయూర్ కేరళలోని త్రిసూర్ నగరానికి సుమారు 30 కి.మీ.ల దూరం‌లో వున్నది. తెలుగు రాష్ట్రాల యాత్రికులు త్రిసూర్ చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా రైలు మార్గం‌లో గురువాయూర్ చేరుకోవడం సులభం.

రోడ్డు మార్గం:
గురువాయూర్ కేరళలోని అన్నీ ప్రధాన ప్రాంతాల నుండి చేరుకోవడానికి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు మర్గం:
గురువాయూర్‌లో రైల్వే స్టేషన్ కలదు. గురువాయూర్‌కి సమీప రైల్వే జంక్షన్ త్రిసూర్‌‌లో కలదు. ఇక్కడి నుండి గురువాయూర్ చేరుకోవడానికి రైలు సదుపాయం కలదు. కాని త్రిసూర్ నుండి ప్రయివేట్ వాహనాల ద్వారా కాని, లోకల్ బస్సుల ద్వారా గురువాయూర్ చేరుకోవడం ఉత్తమమైన మార్గం.

వాయు మార్గం:
కొచ్చిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువాయూరుకు సుమారు 87 కి.మీ.ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. అలాగే గురువాయూర్ నుండి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉన్న కాలికట్ నందు మరొక అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయాల నుండి టాక్సీలు, బస్సుల ద్వారా గురువాయూరుకు చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం