కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు.


మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా భక్తులు కొలుస్తారు. ఈ మూడు క్షేత్రాలు సర్పాకార రూపంలో నెలకొని వున్నాయని భక్తుల నమ్మకము.

సుబ్రహ్మణ్య క్షేత్రం:

కుక్కి అంటే గుహ అని అర్థం. ఈ ప్రాంతం‌లో స్వామి వారు బిలద్వార గుహలో ఒక పుట్టలో వెలిశారు కాబట్టి ఈ క్షేత్రాన్ని కుక్కి లింగంగా, కుక్కి పురంగా అటు పై క్రమంగా కుక్కే సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది.

పురాణ ప్రాశస్త్యం:

సర్ప రాజైన వాసుకి శ్రీ మహా విష్ణువుని వాహనమైన గరుత్మం‌తుని దాడి నుంచి తప్పించుకోవటానికి కుక్కే సుబ్రమణ్య క్షేత్రములోని బిలద్వార గుహలో మహా శివున్ని ప్రార్ధించాడు. అంతట మహా దేవుడు వాసుకిని కాపాడి, తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని సర్పరాజుకికి అండగా మరియు తోడుగా ఉండేటట్లుగా వరమిచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి‌ తారకాసురుడుని సంహరించిన తరువాత ఈ పర్వత శ్రేణులలో విశ్రాంతి తీసుకొన్న సమయం‌లో ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమార స్వామికి ఇచ్చి వివాహం చేసెను. వివాహానంతరం తన తండ్రి ఆజ్ఞ మేరకు సుబ్రహ్మణ్య స్వామి సర్పాలకు అధిపతిగా ఇక్కడే కొలువై ఉన్నాడని ప్రతీతి.

కుమారధార నది మహత్యం:

కుమార పర్వత శ్రేణి నుండి ఉద్బవించిన కుమారధార నది ఒడ్డున కుక్కే క్షేత్రం కొలువై ఉంది. తారకాసురుని సంహరించిన తర్వాత కుమార స్వామి తన శక్తి ఆయుధాన్ని ఇక్కడ గల కుమారధారలో శుభ్రపరచడం వల్ల ఈ నీటికి విశేషమైన మహిమలు వచ్చాయని చెపుతారు. మరో కథనం ప్రకారం దేవసేన సుబ్రహ్మణ్య స్వామిల విహహ సమయంలో ఆ దంపతులకు త్రిమూర్తులతో పాటు దేవగణాలు లోకంలోని నలుమూలల నుంచి తీసుకు వచ్చిన పుణ్య నదీ జలాలలతో అభిషేకించడం జరిగినది. భిషేకన్ని నిర్వహించారు. అలా ఆ పుణ్య నదుల కలయిక నుంచి ప్రవహించిన ధార నేడు కుమారధారగా ఏర్పడినట్లుగా భక్తుల నమ్మకము.

అంతటి మహిమ కలిగిన కుమారధార నదిలో స్నానం చేయడం వలన చర్మ రోగాలతో బాధపడే వారి చర్మ రోగాలు నయమవుతాయని నమ్మకము. అందువల్ల ఈ క్షేత్రం‌లో స్వామి వారి దర్శనానికి ముందు భక్తులు కుమారధార నదిలో మునిగి రావటం ఆనవాయితీ.

దేవస్థానం:

ఇక్కడ ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉన్నప్పటికి, భక్తులు వెనుక తలుపు నుండి గుడిలోనికి ప్రవేశించి గర్బగుడి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. గర్భ గుడికి ఎదురుగా వెండితో చేయబడిన ధ్వజస్థంభాన్ని గరుడ స్థంభం అని పిలుస్తారు. ఈ గరుడ స్తంభం గుడి లోపల ఉన్న మహా సర్పాలు వాసుకి, ఆది శేషువుల ఊపిరి నుండి వెలువడే విషకీలల నుండి భక్తులను కాపాడటానికి ప్రతిష్ఠించబడిందని ప్రతీతి. గర్భగుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనంతో కూడి ఉండగా, మద్య భాగం‌లో వాసుకి, క్రింద భాగంలో ఆది శేషువు ఉంటారు.

ఇదే ఆలయ ప్రాంగణములో ఉమామహేశ్వరులు ఆలయం, ప్రధాన గర్భాలయము ప్రక్కగా నరసింహస్వామి ఆలయం, తూర్పుద్వారానికి పక్కగా నాగప్రతిష్ట చేసే నాగేంద్ర స్వామి వారి సన్నిధి, దక్షిణద్వారం దగ్గర కుక్కే సుబ్రహ్మణ్య గ్రామ దేవత "హోసలిగమ్మ" వారి ఆలయాలు కనిపిస్తాయి.

ఆది సుబ్రహ్మణ్య ఆలయం:

కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం‌ వెనుక భాగం‌లో ఆది సుబ్రహ్మణ్య ఆలయం కలదు. ఇక్కడ స్వామి వారు పుట్ట రూపములో ఉంటారు. ఇక్కడే స్వామి వారు మొట్టమొదటిసారిగా సర్ప రాజు వాసుకికి దర్శనమిచ్చినట్లుగా చెపుతారు. ఇక్కడ భక్తులకు పుట్టమన్నుని ప్రసాదంగా ఇస్తారు. కుక్కే వెళ్ళిన భక్తులు ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోకపోతే కుక్కి తీర్ధయాత్ర పరిపూర్ణంకాదని చెపుతారు.

డ్రస్ కోడ్ :

కుక్కే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కొరకు వెళ్ళే భక్తులు – పురుషులు అయితే పంచ, కండువ మరియు స్త్రీలు అయితే చీర లేదా చుడిదార్ దరించాలి.

ఇతర ప్రధాన ఆలయాలు:

కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు కుమారధార దాటిన తరువాత క్షేత్రపాలకుడైన "అభయగణపతి స్వామి” ఆలయం దర్శించవచ్చు. అభయగణపతి ఆలయం ప్రక్కనే వనదుర్గా అమ్మవారి సన్నిధి ఉంటుంది. బస్టాండుకి దగ్గరలో నారాద మహర్షి ప్రతిష్టించిన కాశికట్టె గణపతి స్వామి వారి ఆలయం దర్శించవచ్చును.

పూజా కార్యక్రమాలు:

ఈ క్షేత్రంలో జరిగే సర్ప దోష పూజలలో ఆశ్లేషబలి, సర్ప సంస్కార అతి ముఖ్యమైనవి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి ప్రస్తుత జన్మలో కానీ లేక గత జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ పలు సందర్భములలో సర్పాలకు హాని కలిగించినచో సర్ప దోషానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఏర్పడిన సర్పదోషముల నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ క్షేత్రం‌లో ఆశ్లేషబలి, సర్ప సంస్కార, కాల సర్ప దోష నివారణ పూజలు చేస్తారు. అలా పూజలను చేసిన వారిని సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము, కుజ దోషముల నుండి రక్షిస్తాడని భక్తుల నమ్మకం.

ఆశ్లేష బలి పూజ:
కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో ఈ పూజ నిర్వహించబడుతుంది. పూజకు హాజరయ్యే భక్తులు తమకు కేటాయించిన సమయానుసారం దేవస్థానం లోపల హాజరు కావలెను. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలలో ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.

సర్ప సంస్కార / సర్ప దోష పూజలు:
ఈ పూజా విధానం వ్యక్తి మరణించిన తరువాత చేసే శ్రాద్ధ కర్మల వలె ఉంటుంది. ఈ పూజను నిర్వహించే వ్యక్తితో పాటుగా అతని కుటుంబ సభ్యులు ముగ్గురిని అనుమతినిస్తారు. సంస్కార పూజ చెయ్యదలిచిన భక్తులు రెండు రోజులు స్వామి సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు రెండు రోజులు దేవస్థానం వారు వసతి మరియు భోజన సదుపాయం కలిపిస్తారు.


స్ధానిక ఆకర్షణలు:

కుక్కే సుబ్రమణ్య దేవాలయం దర్శనం‌తో పాటు ఆలయం చుట్టూ నదులు, పర్వతాలు, దట్టమైన అడవులు ముఖ్యంగా కుమారపర్వతం పర్వతారోహకులకు (ట్రెక్కింగ్) ఎంతో ఉత్సాహాన్ని పుట్టిస్తాయి.

చూడదగిన ప్రదేశాలు:

సుందరమైన పశ్చిమ కనుమలలో పచ్చని దట్టమైన అడవులలో నెలకొని వున్న ఈ క్షేత్రానికి దగ్గరగా దక్షిణ కన్నడ జిల్లాలో చూడదగిన ఎన్నో చారిత్రక, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ‘స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కూర్గ్ లేదా కొడుగు పట్టణం కుక్కే గ్రామానికి 73 కిలో మీటర్ల దూరం‌లో ఉంది. అలాగే కుక్కే నుంచి 73 కిలో మీటర్ల దూరం‌లో మడికేరి ఉంది. ఇక్కడ వున్న టిబెటన్ల ఆశ్రమం, మడికేరి కోట, అబ్బె జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. మంజునాధ స్వామి నెలకొని వున్న ధర్మస్థల ఇక్కడికి 54 కిలో మీటర్ల దూరం‌లో నెలకొని ఉంది. ఇక్కడ నెలకొని వున్న బహుబలి విగ్రహం అదనపు ఆకర్షణ. ప్రసిద్ద చిక్‌మంగళూర్ కుక్కే నుంచి 120 కిలో మీటర్ల దూరం‌లో మరియు హోయసల రాజులచే నిర్మించబడిన హలెబెడు కుక్కే నుండి 120 కిలో మీటర్ల దూరం‌లో చారిత్రక పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

వసతి:

కుక్కే సుబ్రహ్మణ్యక్షేత్రంలో ఉండడానికి స్థానిక ప్రవేట్ హోటల్స్ కలవు. ఇవే కాకుండా దేవస్ఠానం ఆధ్వర్యం‌లో నామమాత్రపు ధరలతో వసతి సదుపాయం కల్పిస్తుంది.

కుక్కేకి ఎలా చేరుకోవాలి?

కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం మంగళూరు నుండి సుమారు 110 కి.మీ.ల దూరంలో బెంగళూరు నుండి సుమారు 300 కి.మీ.ల దూరంలో ఉంది. మంగుళూరు లేదా బెంగుళూరు నుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్టాల నుండి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శించాలనుకొనే యాత్రికులు ముందుగా బెంగళూరు చేరుకొని అక్కడ నుండి బస్సు లేదా రైలు మార్గం‌లో కుక్కే చేరుకోవడం సులభం.

రోడ్డు మార్గం:
కర్ణాటకలోని ముఖ్య నగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూర్‌ల నుండి KSRTC ఆద్వర్యం‌లో ఎ.సి., నాన్ ఎ.సి., డీలక్స్ బస్సులు డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు మర్గం:
క్కుక్కే నుండి సుమారు 12.4 కి.మీ.ల దూరంలో సుబ్రహ్మణ్య రోడ్ (రైల్వే స్టేషన్ కోడ్: SBHR) రైలు స్టేషన్ కలదు. బెంగళూరు, మైసూర్, మంగళూర్‌ల నుండి సుబ్రహ్మణ్య రోడ్ చేరడానికి రైలు సౌకర్యం ఉన్నది. సుబ్రహ్మణ్య రోడ్ రైలు స్టేషన్ ఆటో ద్వారా కుక్కే కలదు.

వాయు మార్గం:
కుక్కేకు సమీపం‌లో మంగళూర్‌ నందు విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం