ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం


ఉడుపి లేదా ఉడిపిలో నెలకొని వున్న శ్రీ కృష్ణ ఆలయం ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణుడు బాల కృష్ణుని రూపం‌లో వెలసిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో బెంగళూరుకు సుమారు 500 కిలో మీటర్ల దూరం‌లో మరియు మంగుళూరుకు 80 కిలో మీటర్ల దూరం‌లో పచ్చని కొండల మధ్య ప్రశాంత సముద్ర తీరం‌లో నెలకొని ఉంది.


పురాణ ప్రాశస్థం:

పురాణ కధనం ప్రకారం చంద్రుడు ఈ ప్రాంతం‌లో దక్ష శాప విముక్తికై తపస్సు చేసి మహా శివుని తలపై శాశ్వత స్ఠానం పొందాడని, అందుకే ఈ ప్రాంతానికి ఉడు రాజు (చంద్రుని) అనే పదాన్ని అనుసరించి ఉడుపి అనే పేరు వచ్చినట్లుగా చెపుతారు. అందుకు ప్రామాణికంగా ఇక్కడ వున్న చంద్ర మౌళీశ్వరాలయం చూడవచ్చు.

చారిత్రక ప్రాశస్థం:


ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన శ్రీ మద్వాచార్యులు విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ప్రతిష్టింపజేసినట్లుగా చారిత్రక ఆధారాలు కలవు. ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం ద్వారక నుండి ఇక్కడకి వచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. ఒకరోజు ద్వారక నుంచి సరుకుల రవాణా చేస్తున్న ఒక ఓడ గాలివానకు సముద్రం‌లో చిక్కుకుంది. అప్పుడు సముద్ర తీరం‌లో పూజలు నిర్వహిస్తున్న శ్రీ మద్వాచార్యులు తన మంత్ర శక్తితో ఆ ఓడలోని ప్రయాణికులను కాపాడెను. అందుకు కృతఙతగా ఆ ఓడలోని నావికుడు ఒక గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. ఆ గోపీచందనం మట్టిని తొలగించగా, చిన్ని కృష్ణుని విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా ఉడుపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు.

ప్రధాన ఆలయం:

ప్రస్తుతం శ్రీ కృష్ణ మందిరముగా పిలువబడుచున్న ఈ కృష్ణ మఠాన్ని కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించబడి ఉంది.

ప్రధాన ఆలయం‌లో ప్రవేశించగానే కుడివైపున ఒక కొనేరు కనిపిస్తుంది. దీనినే శ్రీ మద్వ తీర్ఢం అని పిలుస్తారు. ఉత్సవాల సందర్భముగా ఈ తీర్ధం‌లో తెప్పోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ తీర్ధం మధ్య భాగం‌లో గల మండపం నందు శ్రీ మద్వాచార్యుల విగ్రహం ఉంది. తీర్ధం దాటిన తరువాత భగీరధుని మండపం కలదు. ఎడమవైపున చెన్న కేశవ ఆలయం మందిరం ఉంది.

గర్బాలయానికి ముందు భాగం‌లో వెండి ధ్వజ స్తంభం కలదు. దానికి సమీపం‌లో తీర్ధ మండపం కలదు. ఇక్కడ స్వామి వారికి ఇష్టమైన అటుకుల పొడి తదితర సామాగ్రి ఉంచుతారు.

చెన్న కేశవ స్వామి ద్వారం నుండి ముందుకు వెళ్ళితే, గర్బాలయంలోని స్వామి వారిని నవ రంధ్రాలు ఉన్న కిటికీ గుండా దర్శించుకోవాలి. ఆలయం‌ తూర్పు అభిముఖంగా ఉన్నప్పటికి, గర్బాలయంలో శ్రీ కృష్ణుని విగ్రహం పడమర అభిముఖంగా కిటికీ గుండా భక్తులకు దర్శనమిస్తాడు. పూర్వం ఆలయ పూజరులు అనుమతించని కారణంగా కనకదాసు అనే భక్తుడిని అనుగ్రహించుటకు గర్బాలయం‌లోని స్వామి వారు ఇలా వెనుకకు తిరిగి (పడమర వైపుకు) గవాక్షం (కిటికీ) ద్వారా దర్శనమిచ్చినట్లుగా చెపుతారు. ఆనాడు కనకదాసుకు దర్శనమిచ్చిన కిటికీ గుండా మాత్రమే స్వామి వారిని దర్శించుకోవాలి. వెండి తాపడంతో తయారుచేయబడిన ఈ కిటికీని ‘కనకనకిండి’ (అనగా కనకుని కిటికీ) అని పిలుస్తారు. కనకదాసు స్వామి వారిని ప్రార్ధించినచోట ఒక మండపాన్ని నిర్మించారు. దీనినే ‘కనకదాసు మండపం’ అని పిలుస్తారు. గర్భాలయం నందు నలుపు రంగు సాలిగ్రామతో తయారు చేయబడిన శ్రీ కృష్ణుని విగ్రహం నయన మనోహరం‌గా దర్శనిమిస్తుంది. స్వామి వారు ఒక చేతిలో కవ్వము మరియొక చేతిలో వేణువుతో బాల కృష్ణునిగా దర్శనమిస్తాడు.


గర్భాలయం వెలుపల ఇతర ఉపాలయాలు కలవు. శ్రీ కృష్ణ మందిరమునకు వెనుకగా అతి పురాతనమైన చంద్రమౌళీశ్వరాలయం ఉన్నది. అలాగే 5000 సంవత్సరాల క్రితం భీముడు నిర్మింపజేసినట్లుగా భావిస్తున్న అనంతేశ్వర స్వామి ఆలయం దర్శించవచ్చును.

అష్ట మఠాలు:

ద్వైత మత ప్రచారం‌లో భాగంగా శ్రీ మద్యాచార్యులు శ్రీ కృష్ణ మఠానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులతో ఉడుపి కేంద్రం‌గా ఉడుపి చుట్టుప్రక్కల గ్రామలలో ఎనిమిది మఠాలను (అవి పేజావర, పుత్తగె, పలిమారు, అదమారు, సోదె, కాణియూరు, శీరూరు, కృష్ణాపుర) ఏర్పాటుచేయించెను. వీటినే అష్ట పీఠాలు అని పిలుస్తారు. శ్రీ కృష్ణ మందిరం‌లో అర్చన నిర్వహణ బాధ్యత ప్రతి రెండు సంవత్సరాలకు ఒక మఠం తరువాత మరొక మఠం వారు వంతుల వారిగా నిర్వహించేలా ఏర్పాటుచేసెను. ఈ సందర్బముగా జరిగే ఉత్సవాన్ని “పర్యాయ ఉత్సవం” అని పిలుస్తారు.


నిర్మాల్య అలంకరణ:

ప్రతి రోజు వేకువజామున నిర్మాల్య పూజ చేస్తారు. అప్పుడు స్వామి వారు ఎటువంటి అలంకారములు లేకుండా దర్శనమిస్తారు. ఈ దర్శనాన్నే విశ్వరూప దర్శనం అని అంటారు.

ఉడుపి వంటకాలు:

ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయానికే కాక మంచి వంటలకు కూడా ప్రసిద్ధి. ఉడుపి హోటల్లు ప్రపంచవ్యాప్తముగా వివిధ ప్రదేశాలలో కనపడుతుంటాయి. మధ్వ మతం వారు తయారు చేసే ఈ శాకాహార వంటకాలను శ్రీ కృష్ణుడి దేవాలయానికి నైవేద్యంగా అర్పిస్తుంటారు. ఈ వంటకాలు క్రమేణా ప్రసిద్ధి చెంది కర్ణాటక రాష్ట్రంలోనే కాక, దేశం యావత్తూ ప్రసిద్ధి గాంచాయి. ఉడుపి పేరుతో నేటికి ఉడుపి హోటళ్ళు చాలా చోట్ల వివిధ ప్రదేశాలలో కనపడుతూంటాయి.

స్థానిక ఇతర ఆకర్షణలు:

ఉడుపి లో శ్రీ కృష్ణ మందిరమే కాకుండా మరవంతె బీచ్, మల్పే బీచ్, కాపు బీచ్, దరియా బహదుర్గాద్ కోట, సెయింట్ మేరీస్ ఐల్యాండ్, కుడ్లు జలపాతాలు మొదలైనవి దర్శనీయ స్థలాలు.

వసతి మరియు భోజనం:

దేవస్థానం సత్రాలు బిర్లా, శృంగేరీ, కృష్ణ, గీతాసత్రాలలో విడిది చేయవచ్చు. ఉడుపి దేవస్థానంలో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇవే కాకుండా అత్యాధునిక వసతి సదుపాయాలు గల ప్రవేట్ హోటల్లు కలవు.

ఉడుపి కి ఎలా చేరుకోవాలి?

ఉడుపి క్షేత్రం మంగళూరు నుండి సుమారు 70 కి.మీ.ల దూరంలో బెంగళూరు నుండి సుమారు 500 కి.మీ.ల దూరంలో ఉంది. మంగుళూరు లేదా బెంగుళూరు నుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ నుంచి ఉడుపి కి చేరుకోవాడనికి రోడ్డు మార్గం ద్వారా అయితే సుమారు 913 కిలో మీటర్ల దూరంలో రైలు మార్గం ద్వారా అయితే సుమారు 1500 కిలో మీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి డైరెక్ట్ బస్సులు కలవు మరియు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుండి రైలు సదుపాయం ఉంది. తెలుగు రాష్టాల నుండి ధర్మస్థల దర్శించాలనుకొనే యాత్రికులు ముందుగా బెంగళూరు చేరుకొని అక్కడ నుండి బస్సు లేదా రైలు మార్గం‌లో ఉడుపి చేరుకోవడం సులభం.

రోడ్డు మార్గం:
కర్ణాటకలోని ముఖ్య నగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూర్‌ల నుండి KSRTC ఆద్వర్యం‌లో ఎ.సి., నాన్ ఎ.సి., డీలక్స్ బస్సులు డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు మర్గం:
ఉడుపి దేశం‌లోని ప్రధాన పట్టణాలతో రైలు మార్గం గుండా అనుసంధానమై ఉంది.

వాయు మార్గం:
ఉడుపి కి సమీపం‌లో మంగళూర్‌ నందు విమానాశ్రయం కలదు.

మరింత సమాచారము కొరకు:

శ్రీ కృష్ణ దేవస్థానం వారి ఫోన్ నెం. : 0820-2520598
శ్రీ కృష్ణ దేవస్థానం వారి వెబ్ సైట్: www.udipikrishnamutt.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...