అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్


మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు.

ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 30-04-1878న నాడు అనగా చైత్ర శుద్ధ త్రయోదశి నాడు తమ అవతార సమాప్తి గావించారు.

సర్వ మత శాంతి సందేశాలను బోధించే శ్రీ స్వామి సమర్ధ హిందూ ముస్లిం భక్తులను సమంగా చూసేవారు. షిరిడీలో వలె ఇక్కడ కూడా భక్తులకు గురువారం ప్రముఖమైనది. కోడాక్ కంపెనీ వారు మొదటి సారి 1857 సంవత్సరంలో స్వామివారిని ఫోటో తీశారు. ఆ ఫోటో లో స్వామి చుట్టూ పెద్ద కాంతిపుంజం ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. అప్పుడు మన దేశంలో ఫోటోలు లభ్యం అయ్యేవి కావు. ఆ ఖర్చు కేవలం మహారాజాలు మాత్రమే భరించేవారు. కోడాక్ కంపెనీ బొంబాయి (ప్రస్తుత ముంబాయి)లో ఆఫీస్ మొదలుపెడుతూ కంపెనీ పేరు కోసం స్వామి వారి ఫోటో తీసారు.

అక్కల్ కోట్‌లో చూడవలసిన ప్రదేశాలు:


సమాధి మందిర్ (లేదా) పీటేతాల్ మందిర్ (లేదా) చోళప్ప మఠం (లేదా) చోళప్ప మందిర్:

శీ స్వామి సమర్ధ వారి ముఖ్య భక్తులలో చోళప్ప ఒకరు. అహ్మద్ ఆలీఖాన్ అనే వ్యక్తి ద్వారా అక్కల్ కోట్‌లోని ఖండోబా మందిరం నుండి చోళప్ప ఇంటికి వచ్చారు. స్వామి సమర్ధ వారు తరచుగా చోళప్పది నాది జన్మజన్మల బంధం అని చెబుతుండేవారు. శ్రీ స్వామి సమర్ధ వారు చోళప్ప ఇంట్లో ఉండడం చోళప్ప భార్యా, పిల్లలకు ఇష్టం లేదు, అయినప్పటికీ కొద్దిరోజుల తరువాత శ్రీ స్వామి సమర్ధ వారింట్లో ఒక సభ్యుడిగా అయ్యారు. ఒకనాడు చోళప్ప ఇంటిలోని బావి ఎండిపోగా, స్వామి వారు తన మహిమతో ఆ బావిలో సమృద్ధిగా నీరు వూరించారు. స్వామి సమర్ధ పోషణార్ధం అప్పటి అక్కల్ కోట్ రాజైన శ్రీ మాలొజీరావు భాంస్లే కొంత రొక్కాన్ని ప్రతీ నెలా చోళప్ప ఇంటికి పంపేవారు.

తేది 30-04-1878 న అనగా చైత్ర శుద్ధ త్రయోదశి, మంగళ వారం సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి సమర్ధ తమ భౌతిక దేహాన్ని విడిచారు. స్వామి సమర్ధ నిర్యాణం అనంతరం శ్రీ స్వామి వారి భౌతికదేహం చోళప్ప గృహంలోనే సమాధి చేయబడినది. శ్రీ స్వామి సమర్ధ భౌతికదేహాన్ని పద్మాసనం‌లో కూర్చోబెట్టి చోళప్ప గృహం‌లోని నేలమాళిగ (Underground) లో ఉంచి సమాధి చేసారు. ఆ విధంగా ఏర్పడినదే సమాధి మందిర్. దీనినే పీటేతాల్ మందిర్ లేదా చోళప్ప మఠం లేదా చోళప్ప మందిర్ అని పిలుస్తారు.

చోళప్ప శ్రీ స్వామి సమర్ధ కంటే ఒక సంవత్సరం ముందు అంటే 1877 సంవత్సరం‌లో ముక్తి పొందారు. చోళప్ప మఠం నందు శ్రీ స్వామి సమర్ధ వారు అప్పట్లో ధరించిన చర్మ మరియు రజిత పాదుకలు మరియు వారు వాడిన ఇతర వస్తువులను చూడవచ్చు.


బాలప్ప మఠం:

శీ స్వామి సమర్ధ వారి ముఖ్య భక్తులలో బాలప్ప ఒకరు. ఇతను కర్ణాటక రాష్ట్రం‌లోని ధార్వాడ్ జిల్లాలో గల హవేలీ గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారస్తుడు మరియు ఆస్థిపరుడు. స్వామి ఉమ్మి వేసుకునే పాత్ర కడగటం‌తో బాలప్ప గురుసేవ మొదలైంది. కాలక్రమేణ స్వామికి వంట చెయ్యడం, భోజనం పెట్టడం వంటి పనులు బాలప్ప చేసేవారు. బాలప్ప భక్తికి మెచ్చి స్వామి సమర్ధ బాలప్పకి ఒక తులసి మాలను ఇచ్చారు. పిమ్మట బంగారు ఉంగరాన్ని (రాజ ముద్రను) స్వయంగా శ్రీ స్వామి బాలప్ప వేలికి తొడిగారు. శ్రీ స్వామి సమర్ధ ఎప్పుడూ, ఎన్నడూ తియ్యని వారి మెడలోని రుద్రాక్ష మాలను తీసి బాలప్ప మెడలో వేసారు. శ్రీ స్వామి సమర్ధ వాడిన ఒక పాత చొక్కాని ఆయనే స్వయంగా బాలప్పకి తొడిగారు. చివరకి వారి కౌపినాన్ని కుడా బాలప్పకే ఇచ్చారు. స్వామి సమర్ధ పాదుకలు ఇచ్చి ఒక మఠాన్ని స్థాపించి అక్కడే ఆ పాదుకలను ప్రతిష్టించమన్నారు. అలా శ్రీ స్వామి సమర్ధ వారి ఆదేశానుసారం బాలప్పచే స్థాపించబడినదే నేటి బాలప్ప మఠం. ఇక్కడ స్వామి అనుగ్రహించిన పాదుకలు, రుద్రాక్షలు, పడక, హుక్కా, స్వామి వారి వివిధ చిత్ర పటాలు దర్శించవచ్చు.


వటవృక్ష మందిర్:

శ్రీ స్వామి సమర్ధ వారికి ప్రీతిపాత్రమైన వటవృక్షం (మర్రి చెట్టు), దాని ప్రక్కనే ఉంచబడిన వారి పాదుకలు, వారి పడక, జరీతో నేసిన కఫ్నీ ఇక్కడ దర్శించవచ్చు. ఈ సన్నిధినే వటవృక్ష స్వామి మహరాజ్ అని అంటారు. ఇక్కడ భక్తులకు వసతి మరియు భోజన సౌకర్యం కలదు.

ఖండోభా మందిర్:

అక్కల్ కోట్‌లో శ్రీ స్వామి సమర్ధ మొదటిసారిగా విచ్చేసిన ప్రదేశం ఖండోభా మందిర్. ఇది అక్కల్ కోట్‌లో MSRTC బస్ స్టాండ్ ఎదురుగా కలదు. ఇక్కడ శ్రీ గజానన్ మహారాజ్ ప్రతిష్టించిన శ్రీ స్వామి సమర్ధ పాదుకలు కలవు. ఇక్కడే శ్రీ స్వామి సమర్ధకి ఇష్టమైన ‘సుందరి’ అనే కోతి సమాధి కుడా కలదు.

నయా ప్యాలెస్ లేదా రాయల్ ప్యాలెస్:

అక్కల్ కోట్‌లో స్వామి సమర్ధకు సంబంధించిన మఠాలే కాకుండా రాజరిక ప్రసాదాలు కలవు. అక్కల్ కోట్ సంస్థానాన్ని భాం‌‌స్లే రాజులు పరిపాలించారు. ఈ రాజ కుటింబీకులు నివసించిన భవనాన్ని ‘నయా ప్యాలెస్ లేదా రాయల్ ప్యాలెస్’ అని పిలుస్తారు. ఇది MSRTC బస్ స్టాండ్ వద్ద గలదు. రాయల్ ప్యాలెస్ వెనుక వైపు గల స్టేట్ మ్యుజియం‌లో అప్పటి రాచరికపు వస్తువులను భద్రపరిచారు. అప్పటి యుద్ధ సమయాల్లో వాడే వివిధ ఆయుధాలు, 12 నుండి 15 అడుగుల పొడవైన తుపాకులు, ఏనుగు కాళ్ళతో చేసిన సోఫాలు, పులి చర్మాల వంటివి ఎన్నో ఇక్కడ చూడవచ్చు. రాయల్ ప్యాలెస్ ముందు గేటు ఎప్పుడూ మూసే ఉంచుతారు.


ఇవే కాకుండా రాజ రాయని మఠం, నూరుద్దీన్ దర్గా దర్శనీయాలు.


ఎలా వెళ్ళాలి:


రోడ్డు మార్గం:
అక్కల్ కోట్ పట్టణం షోలాపూర్ మరియు గాణుగాపురం పట్టణాలతో అనుసంధానమై ఉంది. ఈ పట్టణాల నుండి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ RTC బస్సులు లేదా ప్రవేట్ టాక్సీ / జీపుల ద్వారా సులభంగా అక్కల్ కోట్ చేరుకోవచ్చు.

హైదరాబాద్ నుండి అక్కల్ కోట్ వేళ్ళాలనే యాత్రికులకు APTDC వారు నిర్వహిస్తున్న బస్సుల ద్వారా హైదరాబాద్ నుండి షోలాపూర్ చేరుకొని, అక్కడ నుండి RTC బస్సులు లేదా ప్రవేట్ జీపుల ద్వారా అతి సులభంగా అక్కల్ కోట్‌కు చేరుకోవచ్చు. అన్నీ బస్సులు మరియు జీపులు యాత్రికుల సౌలభ్యం కోసం దేవస్థానం నిర్మించిన యాత్రి నివాస్ లేదా భక్త నివాస్ గేటు దగ్గర ఆగుతాయి.

రైలు మార్గం:

రైలు ద్వారా అక్కల్ కోట్ చేరుకోవాలనే యాత్రికులు చెన్నై – ముంబాయి రైలు మార్గం‌లో గల ‘అక్కల్ కోట్ రోడ్దు’ స్టేషన్ వుంది. ఈ స్టేషన్ దేశం‌లోని అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉన్నది. ఇక్కడి నుండి యాత్రికులు జీపులు లేదా ఆటోల ద్వారా అక్కల్ కోట్‌లోని యాత్రి నివాస్ లేదా భక్త నివాస్ చేరుకోవచ్చు.

వసతి మరియు ఆహారం:


అక్కల్ కోట్‌లో శ్రీ స్వామి సమర్ధ ట్రస్ట్ వారు నడుపుతున్న యాత్రీ నివాస్ మరియు భక్త నివాస్ అనే వసతి గృహాలు కలవు. ఇక్కడ వసతి సదుపాయం నామమాత్రపు ధరలతో ఉంటుంది. యాత్రీ నివాస్ నందు భక్తులందరికి కామన్ బాత్ రూం‌‌‌లు కలవు. క్రొత్తగా నిర్మించిన భక్త నివాస్ నందు అటాచ్డ్ బాత్ రూం‌‌‌‌‌లు కలవు. ఇవే కాకుండా అక్కల్ కోట్ నందు వసతికి అనేక లాడ్జిలు, ధర్మశాలలు కలవు.

దాదాపుగా ప్రతీ వసతీ గృహానికీ క్యాంటిన్ సదుపాయం కుడా అనుసంధానింపబడి ఉంది. వటవృక్ష మందిర్ దగ్గర ప్రతీ రోజు మధ్యాహ్నం మరియు రాత్రి ఉచిత అన్నప్రసాద వితరణ కుడా కలదు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం