మమ్మియూర్ శ్రీ మహదేవ దేవాలయం, గురువాయూర్


మమ్మియూర్ శివాలయం కేరళ రాష్ట్రం‌లో నెలకొని వున్న ప్రముఖ పుణ్య క్షేత్రం గురువాయూర్ నందు కలదు. ఈ క్షేత్రాన్నే మమ్మియూర్ దేవాలయం లేదా మమ్మియూర్ మహాదేవ క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీ గురువాయూరప్పన్ దేవాలయనికి సమీపం‌లో వాయువ్యంగా సుమారు 200 మీటర్ల దూరంలో ఈ మమ్మియూర్ మహాదేవుని ఆలయం కలదు. ఈ ఆలయం‌లో మహా శివుడు ఉమా మహేశ్వరుని రూపంలో పూజించబడుతున్నాడు. ఇక 'గురువు', 'వాయివు' లిద్దరిచే నిర్మితమైన శ్రీ కృష్ణ దేవాలయం గల ఊరు కనుక ‘గురువాయూరు’ అని పిలువబడుతుందని ఐతిహ్యం.

గురువాయురప్పన్ వెలసిన ఈ క్షేత్ర భూమికి యజమాని మహా శివుడు. అందువలన గురువాయూరు సందర్శించిన భక్తులు మమ్మీయూర్ నందు వెలిసిన మహాదేవున్ని దర్శించకపోతే గురువాయూరు పర్యటన సఫలం కాదని చెబుతారు.

గురువాయురప్పన్ క్షేత్రం గురించి నేను ఇది వరకే వ్రాసిన పోస్ట్ సందర్శించుటకై ఇక్కడ క్లిక్ చేయండి



స్థల పురాణం:

దేవతల గురువైన బృహస్పతి మరియు వాయు దేవుడు గురువాయురప్పన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు తగిన ప్రదేశం కొరకు వెదుకుచూ పరశురామ క్షేత్రమైన కేరళ తీర ప్రాంతానికి వచ్చెను. అక్కడ మహా శివుడు ఒక సరస్సు ఒడ్డున తపస్సు చేయుచుండగా ఆ ప్రదేశమునకు విచ్చేసెను. వారి ఆగమనోద్దేశ్యం గ్రహించిన మహా శివుడు ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుటకు సమ్మతించి ఆ స్థలం‌ను విడిచి సరస్సు అవతలి ఒడ్డున గల ప్రాంతమునకు వెళ్ళి పార్వతి సమేతుడై నివసించెను. ఆ సరస్సు నేడు రుద్ర తీర్ధం అని పిలువబడుచున్నది. మహా శివుడు పార్వతీ సమేతుడై వెలసిన ప్రదేశాన్ని ‘మహిమయూర్’ అని, క్రమేణా ‘మమ్మియూర్’ అని పిలువబడుచున్నది. .

ఈ విధంగా గురువాయురప్పన్ కొరకు ఈ స్ఠలమును వదిలి రుద్ర తీర్ధము ఆవలి వెళ్ళి మమ్మీయూర్ నందు వెలిసిన మహాదేవున్ని తప్పక దర్శించవలెనని చెపుతారు. అలా దర్శించకపోతే గురువాయూరు పర్యటన అసంపూర్తి అని చెపుతారు.

ఆలయ నిర్మాణం:

త్రిస్సూర్ జిల్లాలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఈ ఆలయం సాంప్రదాయ కేరళ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడినది. ఆలయ గోడలపై పురాణ గాధలు వర్ణించే కుడ్య చిత్రాలు (మురళ్ పెయింట్స్) ఎంతో అందంగా చిత్రించి వున్నాయి. మమ్మియూర్ మహాదేవ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలో మహా శివునితో పాటు మహా విష్ణువుని కూడా పూజిస్తారు. ఆలయం లోపల మహా శివుని గుడితో పాటు ప్రక్కన మహా విష్ణువుకి ఒక గుడి నిర్మించబడివుంది. భారతదేశంలో శివుడు మరియు విష్ణువులను సమాన హోదాలో పూజించే అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. .

ఉమా మహేశ్వరుడుగా పూజలందుకుంటున్న ఈ ఆలయం‌లో పార్వతీ దేవికి ప్రత్యేక మందిరం లేదు. అయితే ఆమె శివుని ప్రధాన గర్భగుడి వెనుక వైపున పూజించబడుతుంది. పార్వతీ దేవికి పట్టు చార్తాల్ (పట్టు వస్త్రం సమర్పించడం) ప్రధాన నైవేద్యం. ఆలయం యొక్క వాయువ్య మూలలో ప్రత్యేక గర్భగుడిలో భగవతీ దేవి విగ్రహం ప్రతిష్టించబడింది. పూమూడల్ (దేవుని పువ్వులతో కప్పడం), ముత్తరుక్కల్ (అడ్డంకులను తొలగించడానికి పూజారి దేవుడి ముందు కొబ్బరికాయలను సరిగ్గా రెండు భాగాలుగా విడగొట్టడం), మరియు పట్టు మరియు తాళి చార్తాల్ ముఖ్యమైన నైవేద్యాలు. .

ఆలయం లోపల ఇంకా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, నాగరాజు మరియు నాగరాణి దేవతలకు ఉప ఆలయాలను దర్శించవచ్చు. అయ్యప్ప ఆలయం‌లో శని దోష నివారణకు ఎల్లుతిరి దీపాలు, శొంఠితో చేసిన దీపాలు ఇక్కడ ప్రధాన నైవేద్యాలు.

ఆలయ సమయం:

ఈ ఆలయం భక్తుల దర్శనం కోసం తెల్లవారుజాము 4.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరియు సాయంత్రం 4.45 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.


డ్రస్ కోడ్ :

గురువాయూరప్పన్ ఆలయ దర్శనం కొరకు విచ్చేసే భక్తులు ఏవిధంగా సంప్రదాయ దుస్తులు ధరించాలో అదే విధంగా మమ్మియూర్ మహాదేవున్ని దర్శించే భక్తులు కూడా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషులు చొక్కా ధరించరాదు కాని పంచ, కండువ ధరించాలి మరియు స్త్రీలు అయితే చీర లేదా చుడిదార్ ధరించాలి.

మమ్మియూర్ చుట్టుప్రక్కల దర్శించవలసిన ఇతర ప్రాంతాలు:

గురువాయురప్పన్ ఆలయం, పున్నత్తూర్‌కోటలోని దేవస్థానానికి చెందిన ఏనుగులశాల, మ్యూజియం, తిరు వెంకటాచలపతి ఆలయం, పార్ధసారధి ఆలయం, నెన్ మెని బలరామ ఆలయం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మురళ్ పెయింట్స్, చవకాడ్ బీచ్, పాలయూర్ చర్చి మొదలైనవి.

మమ్మియూర్‌కి ఎలా చేరుకోవాలి?

గురువాయూరులోని మమ్మియూర్ మహా దేవ ఆలయం గురువాయురప్పన్ శ్రీ కృష్ణ ఆలయం వాయువ్యంగా 200 మీటర్ల దూరంలో నెలకొని ఉంది.గురువాయురప్పన్ ఆలయం నుండి నడక ద్వారా లేదా ఆటో ద్వారా మమ్మియూర్ మహా దేవ ఆలయం చేరుకోవచ్చు. .

గురువాయురు పట్టణం కేరళలోని త్రిసూర్ నగరానికి సుమారు 30 కి.మీ.ల దూరం‌లో వున్నది. తెలుగు రాష్ట్రాల యాత్రికులు త్రిసూర్ చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా రైలు మార్గం‌లో గురువాయూరు చేరుకోవడం సులభం.

రోడ్డు మార్గం:
గురువాయూరు కేరళలోని అన్నీ ప్రధాన ప్రాంతాల నుండి చేరుకోవడానికి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం:
గురువాయూరులో రైల్వే స్టేషన్ కలదు. గురువాయూరుకి సమీప రైల్వే జంక్షన్ త్రిసూర్‌‌లో కలదు. ఇక్కడి నుండి గురువాయూరు చేరుకోవడానికి రైలు సదుపాయం కలదు. కాని త్రిసూర్ నుండి ప్రయివేట్ వాహనాల ద్వారా కాని, లోకల్ బస్సుల ద్వారా గురువాయూరు చేరుకోవడం ఉత్తమమైన మార్గం.

వాయు మార్గం:
కొచ్చిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువాయూరుకు సుమారు 87 కి.మీ.ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. అలాగే గురువాయూరు నుండి సుమారు 100 కి.మీ.ల దూరంలో ఉన్న కాలికట్ నందు మరొక అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయాల నుండి టాక్సీలు, బస్సుల ద్వారా గురువాయూరుకు చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం