ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శ్రీ రంగపట్టణంలోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం


కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లాలో గల శ్రీ రంగపట్టణంలోని శ్రీ రంగనాధ స్వామి ఆలయం దక్షిణ భారతదేశం‌లోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం మైసూరు నగరానికి అతి సమీపములో ఉన్నది. ఇక్కడ వెలసియున్న శ్రీ రంగనాధ స్వామి వలన ఈ పట్టణానికి శ్రీ రంగపట్టణం అనే పేరు వచ్చింది. దీనినే శ్రీ రంగపట్న లేదా శిరంగ పట్టణ్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం చుట్టూ కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుట వలన శ్రీ రంగపట్టణం ఒక సుందర ద్వీపం‌లా కనుపడుతుంది.

శ్రీ రంగనాథుడు:

పాల సముద్రంలో శేష పానుపుపై పవళించి ఉండే భంగిమలో కనిపించే శ్రీ రంగనాథుడిని శ్రీ మహా విష్ణువు స్వరూపాలలో ఒకటిగా భక్తులు కొలుస్తుంటారు. ఈ క్షేత్రం‌లో స్వామి వారు కావేరి సమేతంగా దర్శనమిస్తాడు. అయితే ఉత్సవ మూర్తులలో మాత్రం శ్రీ దేవి, భూదేవి అమ్మవార్లు మాత్రమే దర్శనమిస్తారు.

కావేరి నదికి శ్రీ రంగనాథునికి ఉన్న సంబంధం విశిష్టమైనది. దేశం‌లోని ప్రముఖ పంచ రంగ క్షేత్రాలలో మూడు క్షేత్రాలు కావేరి నది ఒడ్డునే వెలసియున్నాయి. అవి కావేరి నది మొదట్లో కర్ణాటకలోని శ్రీరంగపట్నం వెలసిన రంగనాథుడ్ని ఆది రంగ గాను, కర్ణాటక రాష్ఱం‌లోని శివన సముద్రంలో వెలిసిన రంగనాథుడ్ని మధ్య రంగ గాను, తమిళనాడులోని శ్రీరంగం‌లో వెలిసిన రంగనాథుడ్ని అంత్య రంగ గాను భక్తులు కొలుస్తారు. ఇవి వేటికవే ప్రత్యేకం, పురాతనం.


శ్రీ రంగపట్టణం స్థల పురాణం:

పూర్వం గౌతమ మహర్షి బ్రహ్మ హత్య పాతకం పోగొట్టుకోవడం కోసం ఈ ప్రాంతం‌లో గల గుహలో తపస్సు చేసి శ్రీ మహా విష్ణువుని ప్రసన్నుడిని చేసుకున్నాడు. శ్రీ మహా విష్ణువు ఆదేశానుసారం ఇక్కడి కావేరి నదిలో స్నానమాచరించి తన పాపాన్ని పోగొట్టుకొంటాడు. అనంతరం కావేరి, గౌతమ మహర్షిల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు శ్రీ రంగనాథుని రూపం‌లో ఇక్కడ వెలసినాడని భక్తులు చెపుతారు.

శ్రీ రంగనాథస్వామి ఆలయం:

శ్రీ రంగనాథస్వామి ఆలయము చాలా పురాతనమైనది. ఈ ఆలయమును ఎవరు ఎప్పుడు నిర్మించారనేదానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఈ ఆలయము వివిధ రాజ వంశీయుల ఏలుబడిలో ప్రముఖ పుణ్య క్షేత్రం‌గా అభివృద్ధి చెందింది. అద్భుత శిల్ప, వాస్తు శిల్ప కళలకు సుందర తార్కాణం‌గా అలరారుతున్న ఈ ఆలయము గంగ, హోయసల, విజయనగర రాజుల కళాపోషణకు ప్రతీకగా పేర్కొనవచ్చు.

శ్రీ రంగపట్టణం‌లోని ప్రముఖంగా చెప్పుకోదగినది శ్రీ రంగనాథస్వామి ఆలయం. ఇక్కడ శ్రీ రంగనాథుడు రంగనాయకి దేవితో కొలువైఉంటాడు. సుమారు 5 ఎకరాల స్థలం‌లో ఈ ఆలయం నిర్మితమై ఉన్నది. సుమారు 100 అడుగుల ఎత్తులో ఆకాశాన్నంటున్నట్లు కనిపించే గాలి గోపురం స్వామి వైభవానికి సంకేతంగా కనిపిస్తుంది. ఈ ఆలయం లోపల ప్రాంగణం‌లో నరసింహ, సుదర్శన, గోపాలకృష్ణ, శ్రీ రామ, శ్రీనివాస, పంచముఖ ఆంజనేయ స్వామి మొదలగు 32 ఉపాలయాలు ఉన్నాయి. గర్భ గుడి గంగ రాజుల నిర్మాణ శైలిలో, రంగ మండపం, రాజ గోపురం విజయ నగర రాజుల నిర్మాణ శైలిలో నిర్మితమై ఉన్నాయి. ఆలయం‌లో 700 లకు పైగా అద్భుత రాతి స్తంభాలు ఉన్నాయి.

ఇతర ఆకర్షణలు:

హైదర్ ఆలి, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ శ్రీ రంగపట్టణం రాజధానిగా మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించుట వలన ఈ పట్టణం‌లో నిర్మాణాలు హిందూ అరబిక్ నిర్మాణ శైలి పోలి ఉంటాయి. ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి ఆలయంతో పాటు ఎన్నో చారిత్రత్మక అద్భుత కట్టడాలను వీక్షించవచ్చును.

  • టిప్పు సుల్తాన్‌ లోహపు కవచాలు గల రాకెట్లను యుద్ధరంగంలో ఉపయోగించి శత్రువులను దునుమాడేవారు. రాకెట్లు, ఇతర మందుగుండు సామగ్రి తయారయ్యే "తారా మండల్‌ పేట్‌"గా వ్యవహరించే ప్రాంతాన్ని మనం శ్రీ రంగపట్టణం‌లో వీక్షించవచ్చును.
  • టిప్పు సుల్తాన్ తన తల్లిదండ్రుల సమాధులను నిర్మించిన “గుంబజ్” మరియు “జమ్మా మసీద్” లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
  • టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా వినియోగించిన “దరియా దౌలత్ బాగ్” అనే అద్భుత భవనం ఉంది, ఇక్కడి మ్యూజియం‌లో టిప్పు సుల్తాన్ వాడిన దుస్తులు, ఆయుధాలు తదితరాలను పొందుపరిచారు.
  • శ్రీ రంగ పట్టణానికి నీటిని సరఫరా చేసే “వాటర్ గేట్” ద్వారా శతృవులు కోటలోకి ప్రవేశించి టిప్పు సుల్తాన్‌ని చంపిన ప్రదేశం‌లో ఒక స్మారక చిహ్నం కలదు.
  • శ్రీ రంగ పట్టణానికి సమీపం‌లో సుమారు 67 చ.కి.మీ. వైశాల్యం‌లో గల “రంగన్ తిట్టూ” అభయారణ్యములో ఎన్నో అరుదైన వైవిధ్య పక్షిజాతులు దర్శనమిస్తాయి.
  • శ్రీ రంగ పట్టణానికి సమీపం‌లో “కరిఘట్టు” అని పిలవబడు నల్లని కొండపై వెలసిన శ్రీనివాసుడుని దర్శించవచ్చు. కరిఘట్టు పై వెలసిన శ్రీనివాసున్ని కరిగిరి వాసునిగా (కరి అనగా నలుపు, గిరి అనగా కొండ) భక్తులు పూజిస్తుంటారు. కరిఘట్ట మైసూరు నుండి 20 కి.మీ. దూరములో శ్రీ రంగపట్టణమునకు 4 కి.మీ దూరములో యున్నది. కరి ఘట్టను వరాహ పురాణములో నీలచల అని వ్యవరించెడి వారు. ఈ ఆలయము సముద్రపు మట్టము నుండి 2976 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ పై యున్నది. ఈ ఆలయం చేరుకొనుటకు 450 మెట్లు ఎక్కి లేదా రోడ్డు మార్గం ద్వారా చేరుకొనవచ్చు. అచట నుండి నిమిషాంబ ఆలయము శ్రీ రంగ పట్టణము చక్కగా కాన వచ్చును. అతి పురాతన మయిన ఈ ఆలయములో బృగు మహర్షిచే ప్రతిష్టించ బడిన 6 అడుగుల ఎత్తు గల నల్లని రాతి విగ్రహము వైకుంఠ శ్రీనివాస విష్ణు విగ్రహము మూలవిరాట్టుగా యున్నది. ప్రధాన విగ్రహము ఎడమ వైపు యోగ శ్రీనివాస కుడి వైపు భోగ శ్రీనివాస విగ్రహములు కలవు. పద్మావతి దేవికి ప్రత్యేక సన్నిధి కలదు. గరుడాళ్వార్ మూల విగ్రహమునకు ఎదురుగా కలదు. బలి పీఠము ద్వజ స్థంభము గరుడాళ్వారు వెనుక గలవు. ఒక పెద్ద కళ్యాణ మంటపము వివాహాది కార్యక్రమములు జరుపుకొనుటకు కలదు. గర్భగుడి వెనుక శ్రీవారి పాదములు కలవు. కావేరి యొక్క ఉపనది లోకపావని నది కొండ ప్రక్కనుండి పారుతు పశ్చిమ వాహిని కావేరి నది యందు కలయును.ఇచటి ఆలయ సౌందర్యము మరియు ప్రకృతి అందచందములు వర్ణించట కంటే అనుభవించిన ప్రత్యేక ఆనందము.

    ఈ ఆలయమునకు బస్సు సౌకర్యము మరియు ప్రవేటు వాహనముల సదుపాయము కలదు. ఇచట వసతి మరియు భోజన సదుపాయము లేదు. శ్రీరంగపట్టణములో అనేక వసతి మరియు భోజన సదుపాయములు కలవు. ఈ ఆలయము ఉదయము 10 గంటలనుండి మధ్యాఃనము 2 గంటల వరకు తెరచియుండును.
  • శ్రీ రంగ పట్టణానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరులో “నిమిషాదేవి ఆలయం” కలదు. పూర్వం ముక్తకుడు అనే ఋషి లోకకళ్యానార్థం ఇక్కడ ఒక గొప్ప యాగాన్ని తలపెట్టగా. ఆ యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక ఋషి వల్ల కాలేదు. దాంతో పార్వతి దేవిని ప్రార్ధించగా, పార్వతీదేవి స్వయంగా యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి, రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు.
  • భారత దేశం‌లో రెండవ పెద్ద జలపాతం అయిన “శివన సముద్రం” ఇక్కడికి సమీపం‌లో కలదు.
  • చారిత్రక నగరం అయిన మైసూర్ నగరం ఇక్కడికి అతి సమీపం‌లో కలదు.

శ్రీ రంగ పట్టణం ఎలా వెళ్ళాలి?


రోడ్డు మార్గం:
శ్రీ రంగ పట్టణం కర్ణాటక రాజధాని బెంగళూరు మరియు మైసూర్ నగరాలకు అనుసంధానించబడియున్నది. పర్యాటకులు బెంగళూరు మరియు మైసూర్ నగరాల నుండి సులభంగా బస్సుల లేదా ప్రయివేట్ టాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం:
శ్రీరంగ పట్టణంలో రైలు స్టేషన్ లేదు. ఇక్కడికి సుమారు 17 కి.మీ. ల దూరంలో సమీప రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి అన్ని నగరాలకు రైలు సౌకర్యం కలదు. పర్యాటకులు ఇక్కడి నుండి సులభంగా బస్సుల లేదా ప్రయివేట్ టాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

విమాన మార్గం:
శ్రీ రంగ పట్టణానికి సమీపం‌లో మైసూర్ నందు జాతీయ విమానాశ్రయం కలదు. దేవనహళ్ళి, బెంగుళూరు నందు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...