బాబా నడయాడిన షిరిడి క్షేత్రం


షిరిడి (షిర్డీ) మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం. సాయి బాబా నడయాడిన షిరిడిని జీవితం‌లో ఒక్కసారైనా దర్శించాలని ఆయన భక్తులు ఆకాంక్షిస్తారు. ఇక్కడి నెలకొని ఉన్న శ్రీ సాయి బాబా మందిర్‌ను దర్శించడానికి దేశం‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

సాయి బాబా అసలు పేరు, జన్మ స్థలం, తల్లిదండ్రులు గురించి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం శ్రీ సాయి బాబా తన 16వ వయస్సులో షిరిడికి వచ్చి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి తరువాత కొంత కాలం కనిపించలేదని ఆయన భక్తులు భావిస్తారు. ఆ కనుపించని సమయం‌లో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పిదప కొంత కాలానికి ఔరంగాబాద్ జిల్లా ధూప్ ఖేడా గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే వ్యక్తి తన బావమరిది కొడుకు పెళ్ళి కోసం ఎడ్లబండిలో షిరిడీ వెళుతుండగా వారితో పాటు కలిసి షిరిడి వచ్చారని భావిస్తారు. ఆయన షిరిడి వచ్చినప్పుడు ఖండోబా ఆలయ సమీపంలో ఆలయ పూజారి మహల్సాపతి “ఆవో సాయీ” (తెలుగులో రండి సాయీ అని అర్ధం) అని పిలిచారు. ఆ విధంగా “సాయి” అనే పేరు స్థిరపడి ఆయన “షిరిడి సాయి బాబా”గా ప్రసిద్ధుడైనాడు.


షిరిడీలో ఒక పాత మసీదులో నివసించేవాడు. ఈ మసీదునే “ద్వారకమాయి” అని పిలిచేవారు. అక్కడ ప్రతి సాయంత్రం బాబా దీపాలు వెలిగించేవాడట. మసీదులో ధునిని వెలిగించి, అందులో నుండి విభూతిని తన దర్శనానికి వచ్చే భక్తులకు పంచేవారు. భక్తులు ఈ విభూతి తమ బాధలను తొలగిస్తాయని బావించేవారు. తన దర్శనానికి వచ్చే భక్తులకు ఉపదేశాలు, ధర్మ బోధనలు చేసేవారు. సర్వ మత శాంతి సందేశాలను బోధించే సాయిబాబాని హిందువులు సాధువు, యోగి మరియు సద్గురుగాను, మహ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావిస్తారు. తన దైనిక వ్య్వవహారాలలోను, బోధనలలో హిందూ ముస్లిం మతాల సంప్రదాయాలను పాటించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి గ్రంధాలను అధ్యయనం చేసిన ఆయనకు వాటిపై లోతైన పరిజ్ఞానం కలదు. హిందువుల దైవమైన శ్రీ రాముడు, మహ్మదీయుల దైవమైన అల్లా ఒక్కరే అని అందరూ సోదరుల వలె కలిసి మెలసి జీవంచండి అని బోధించేవాడు. సాయి బాబా మహత్తులు దేశమంతటా తెలిసి భక్తులు పెక్కురు బాబా దర్శనానికి షిరిడి రాసాగారు.


సాయి బాబా సమాధి:

అక్టోబరు 15, 1918 మధ్యహ్నాం 2.30 గంటలకు తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో అంతిమ శ్వాస విడిచారు. ఆయన కోరిక మేరకు ఆయన పార్ధివ దేహాన్ని బూటి వాడాలో ఖననం చేయబడినది. అక్కడే సమాధి మందిరం నిర్మించబడినది. పిదప 1954 సంవత్సరములో పాలరాతితో నిలువెత్తు సాయి బాబా విగ్రహం ప్రతిష్టించెను.

షిరిడీలో చూడవలసిన ప్రదేశాలు:

శ్రీ సాయి బాబాతో సహచర్యాన్ని పంచుకున్న ప్రదేశాలు షిరిడీలో ఎన్నో ఉన్నాయి. షిరిడీ వెళ్ళిన యాత్రికులందరూ ఈ ప్రదేశాలను తిలకించడం ఒక అపురూప దివ్యానుభూతి చెందుతారు.


సమాధి మందిరం (శ్రీ సాయి బాబా మందిర్ ):


షిరిడిలో ఉన్న ప్రదేశాలలో సమాధి మందిరానికే అత్యంత విశిష్ట స్థానం కలదు. ఇప్పుడు సమాధి మందిరం ఉన్న ప్రాంతం‌లో బాబా స్వయంగా పెంచిన ఒక పూల తోట ఉండేది. బాబా ఆదేశం మేరకు ఈ తోట ఉన్న ప్రాంతం‌లో నాగపూర్‌కు చెందిన కోటీశ్వరుడైన గోపాలరావు బూటీ శ్రీ కృష్ణుడు కోసం పెద్ద దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టాడట. దీనినే బూటి వాడా అని అంటారు. కానీ 1918 సంవత్సరములో సాయి బాబా మరణించిన పిదప పార్ధివ దేహాన్ని బూటి వాడాలో సమాధి చేయబడినది. దాంతో ఈ దేవాలయం కాస్త సాయి బాబా దేవాలయం (సమాధి మందిర్‌)గా ప్రసిద్ధి చెందినది. పిదప 1954 సంవత్సరములో శ్రీ తాలిమ్ అనే శిల్పి పాలరాతితో అద్బుతమైన సాయి బాబా విగ్రహం ప్రతిష్టించెను. ఈ సమధి మందిరాన్ని ఉదయం 5 గంటల కాకడ హారతితో తెరచి రాత్రి ప్రార్ధనల అనంతరం 10 గంటలకు మూసివేస్తారు. గురు వారం రోజు ప్రత్యేక పూజ, దర్శనం ఉంటుంది. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుండి. గురు పూర్ణిమ, దసరా, శ్రీ రామ నవమి వంటి పర్వదినాలలో రాత్రి వేళల్లో కూడా ఆలయం తెరిచే ఉంటుంది.



ద్వారకమాయి:

సమాధి మందిరం వద్దనే గల మసీదును ద్వారకామాయి అని పిలుస్తారు. బాబా షిరిడీ వచ్చినప్పుడు ఒక పాత మసీదును తన నివాసంగా ఏర్పరుచుకొని, ఆ మసీదుకే “ద్వారకమాయి” నామకరణం చేసారు. బాబా ఇందులోనే ఎక్కువ కాలం గడిపాడు. ఇక్కడే ధునిని వెలిగించి, అందులో నుండి విభూతిని తన దర్శనానికి వచ్చే భక్తులకు పంచేవారు. ద్వారకామాయిలో బాబా చిత్రపటం, బాబా కూర్చోవటానికి వాడిన పెద్ద బండరాయి, పల్లకి మొదలగునవి భక్తులను ఆకర్షిస్తాయి.


చావడి:

ద్వారకామాయి మందిరంకు దగ్గరలో మరియు అబ్దుల్‌ బాబా వారి ఆశ్రమమునకు ఎదురుగా ఉండే చిన్న ఇంటినే చావడి అని పిలుస్తారు. బాబా చివరి రోజుల్లో ఇక్కడే నివసించేవారట. చావడి రెండు భాగాలుగా విభజింపబడినది. ఎడమ ప్రక్క భాగంలోనికి ఆడవారికి మాత్రమే ప్రవేశం. కుడిప్రక్క భాగంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం. ఇక్కడ బాబా వాడిన చెక్క మంచమే, తెల్ల కూర్చి లు ఆకర్షణలు. ప్రతి గురువారం ద్వారకామాయి నుంచి చావడికి పల్లకీలో బాబా చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళుతారు.



గురుస్థాన్‌:


సమాధి మందిరం నుండి బయటకు వచ్చు మార్గంలో గల వేప చెట్టు ప్రదేశాన్నే గురుస్థాన్‌ అని పిలుస్తారు. ఈ చెట్టు బాబాచే స్వయంగా నాటబడినది. బాబా రోజూ ఈ చెట్టు క్రింద కొంత సమయంపాటు గడిపేవారు. ఇక్కడ అగర్బత్తిలను వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి అవుతామని భక్తుల విశ్వాసం. ఈ ప్రదేశాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు.


లెండీ బాగ్‌:


బాబా స్వయంగా మొక్కలను నాటి నీరొ పోసి పెంచిన వనమే ఈ లెండీ బాగ్ (లెండీ వనం). ఇక్కడ బాబా మర్రిచెట్టు కింద దీపం వెలిగించేవారు. ఇప్పటికి అఖండ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. బాబా తరచూ ధ్యానం చేసేవారు ఇక్కడ గల దత్త మందిరం, గణపతిని మరియు బాబా వారు ఉపయోగించిన బావిని దర్శించవచ్చు. లెండీ బాగ్‌ చూచుటకు భక్తులు 4 వ నెంబరు గేటునుండి ప్రవేశించవలసి యున్నది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది.


దీక్షిత్ వాడా మ్యూజియం:



దీక్షిత్ వాడా మ్యూజియంలో సాయిబాబా అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మరియు ఆయన వాడిన దుస్తులు, పాత్రలు, చెప్పులు వంటి అనేక వస్తువులు ప్రదర్శించబడతాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటలకు సందర్శించవచ్చు.


ఖండోబా ఆలయం:


షిరిడీలోని పురాతన శివాలయం ఈ ఖండోబా ఆలయం. ఈ ఆలయ పూజారి అయిన మహల్సాపతి బాబా షిరిడీ వచ్చినప్పుడు “ఆవో సాయీ” (తెలుగులో రండి సాయీ అని అర్ధం) అని పిలిచారంట. ఆ విధంగా “సాయి” అనే పేరుతో “సాయి బాబా”గా ప్రసిద్ధుడైనాడు.


>షిరిడి చుట్టుప్రక్కల చూడవలసిన ప్రాంతాలు:

షిరిడి చుట్టుపక్కల చూడవలసిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి.

శని శింగనాపూర్‌:

శని దేవుని ఆలయం‌గా ప్రసిద్ధిగాంచిన శని శింగనాపూర్‌ షిరిడీకి 73 కిలోమీటర్ల దూరంలో కలదు. శని శింగనాపూర్‌లో ప్రత్యేకత ఏమనగా ఏ ఇంటికీ తలుపులు ఉండవు. ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది.

నాసిక్:


షిరిడీకి 87 కిలోమీటర్ల దూరంలో నాసిక్ ఉంది. ఈ పాంతం‌లో శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్లు భావిస్తారు. శ్రీరాముడి ఆనవాళ్లు నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తాయి.ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు (నాసికం) కోశాడని ఆ కారణంగానే దీనికి నాసిక్ అన్న పేరొచ్చిందని చెబుతారు. పంచవటి, సీత గుహ నాసిక్ లో చూడవలసిన ప్రదేశాలు.

త్రయంబకేశ్వర్ ఆలయం:

నాసిక్‌కు కొద్ది దూరంలో జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ ఆలయం కలదు. గోదావరి నది జన్మస్థానం కూడా ఇదే.

ఔరంగాబాద్‌ :


షిరిడీ నుండి 104 కిలోమీటర్ల దూరంలో గల ఔరంగాబాద్‌ కలదు. ఇక్కడ ఆగ్రాలోని తాజ్ మహల్‌కి నకలుగా చెప్పబడే బీబీకా మక్ బారా అనే స్మారక కట్టడం యాత్రికులను ఆకట్టుకొంటుంది. ఔరంగ జేబు కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్థం నిర్మించిన బీబీకా మక్ బారా నిర్మింపజేశారు. అలాగే ఔరంగాబాద్ సమీపంలో గల ఘృష్ణేశ్వరం మహదేవ్ ఆలయం‌ను ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.

ఎల్లోరా గుహలు:


షిరిడీ నుంచి 97 కిలో మీటర్ల దూరం‌లో మరియు ఔరంగబాద్ నుంచి 30కిలో మీటర్ల దూరం‌లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఎల్లోరా గుహలు మొత్తం 34 గుహలు కలవు. వీటిలో 17 హిందూ మతానికి, 12 బౌద్ధ మతానికి 5 జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయంగా పేరుపొందింది. అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 150 సంవత్సరాలు పట్టింది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.


అజంతా గుహలు:

షిరిడీ నుంచి 200 కిలో మీటర్ల దూరం‌లో మరియు ఔరంగబాద్ నుంచి 96 కిలో మీటర్ల దూరం‌లో అజంతా గుహలు ఉన్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ అజంతా గుహలు క్రీ.శ. 2 వ శతాబ్దం‌లో నిర్మింపజేశారు. ఇవి మొత్తం 29 వరకు ఉన్నాయి. ఈ గుహలు బుద్ధుని జీవితగాధలను చూపుతుంది.


పత్రి (శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం‌):

ఇటీవల కాలం‌లో మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీలో సాయిబాబా జన్మించినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వి.బి.ఖేర్ అనే సాయిబాబా భక్తుడు మొట్ట మొదటిసారిగా 1975 వ సంవత్సరంలో కనుగొనెను. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ (సాయి మెమోరియల్ కమిటీ) ఏర్పాటు చేసి సాయిబాబా పుట్టిన ఇంటిని కొనుగోలు చేసి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించెను. 1994 వ సంవత్సరంలో ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టి, శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం‌ను పూర్తి చేసి 1999 వ సంవత్సరంలో దీనిని జాతికి అంకితం చేసెను. ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు మరియు పునాదులు మందిర ప్రాంగణంలో చూడవచ్చు. ఈ మందిరాన్ని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.షిరిడీ నుంచి సుమారు 280 కిలో మీటర్ల దూరం‌లో పత్రి కలదు.

ఇవే కాకుండా బీచ్ లు, కోటలు, హిల్ స్టేషన్లు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలను చూడవచ్చు. మీరు గనక మూడు నాలుగు రోజులు షిరిడీ ట్రిప్ ప్లాన్ వేసుకుంటే ఇవన్నీ చూసిరావచ్చు.

వసతి:


  • షిరిడిలో వసతి చేయాలనుకుంటే స్థానిక హోటల్స్ కలవు. తెలుగు వారు నడుపుతున్న హోటల్స్ కూడా కలవు.
  • ఇవే కాకుండా షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం‌లో ద్వారావతి మరియు భక్త నివాస్‌లో నామమాత్రపు ధరలతో వసతి సదుపాయం కల్పిస్తుంది.
  • ఆన్‌లైన్ ద్వారా వసతి కొరకు http://www.sai.org.in సందర్శించండి.


దర్శన సమయం:


  • సాధారణ రోజులలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. గురు పూర్ణిమ, దసరా, శ్రీ రామ నవమి వంటి పర్వదినాలలో రాత్రి వేళల్లో కూడా ఆలయం తెరిచే ఉంటుంది.
  • బాబా దర్శనానికి క్యూ లైన్‌లో వేచి ఉండాలి. శీఘ్ర దర్శనం కొరకు ఆన్‌లైన్ ద్వారా రూ 100/- లు చెల్లించి టిక్కెటు పొందవచ్చును. అలాగే ఆన్‌లైన్ ద్వారా హారతి దర్శనం కొరకు రూ 500/- లు చెల్లించి టిక్కెటు పొందవచ్చును.
  • ఆన్‌లైన్ ద్వారా దర్శనం కొరకు http://www.sai.org.in సందర్శించండి.
  • వృద్దులకు మరియు వికలాంగులకు ప్రత్యేక ప్రవేశం కలదు.

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం:

షిరిడీ దేశం‌లోని అన్ని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించబడి ఉన్నది. ముంబై, పూణే, అహ్మద్ నగర, ఔరంగాబాద్, పూణే, కోపర్గావ్ నగరాల నుంచి ప్రైవేట్ వాహనాలు (టాక్సీ) లేదా ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాల ద్వారా షిరిడీ చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రవేట్ ఆపరేటర్లు ప్రత్యెక ప్కాకేజీలు అందజేస్తున్నారు.

రైలు మార్గం :

కొత్తగా నిర్మించిన సాయినగర్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో షిరిడి వుంది. ఇక్కడి నుండి ప్రైవేట్ వాహనాలు లేదా టాక్సీల ద్వారా సాయి మందిరం చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ కాక షిరిడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో మన్మాడ్ జంక్షన్, 22 కిలోమీటర్ల దూరంలో కోపర్గావ్ రైల్వే స్టేషన్ మరియు 50 కిలోమీటర్ల దూరంలో నాగర్‌సూల్ రైల్వే స్టేషన్లు దేశం‌లోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ల నుంచి షిరిడికి నిత్యం టాక్సీ సేవలు అందుబాటులో వున్నాయి.

వాయు మార్గం:

షిరిడికి 305 కిలోమీటర్ల దూరంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అలాగే 76 కిలోమీటర్ల దూరం‌లో నాశిక్‌లోని గాంధీ నగర జాతీయ విమానాశ్రయం, 104 కిలోమీటర్ల దూరం‌లో ఔరంగాబాద్‌‌లోని చిక్కల్తానా జాతీయ విమానాశ్రయం మరియు 147 కిలోమీటర్ల దూరం‌లో పూణే నగరంలోని లోహేగావ్ జాతీయ విమానాశ్రయాలు కలవు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం