ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజప్రాసాదాల నగరం మైసూరు

మైసూరు ప్యాలెస్

మైసూరు నగరాన్ని కర్ణాటక రాష్టానికి సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటారు. ఈ నగరములో రాజరిక వారసత్వాన్ని ప్రతిబింబించే పెద్ద రాజ భవనాలు, విశాలమైన రోడ్లు, మ్యూజియంలు, సరస్సులు, ప్రఖ్యాత పట్టు చీరలు, యోగా కేంద్రాలు, చందనం తోటలు వంటి ఎన్నో ప్రత్యేకతలు సందర్శకులకు ఎప్పటికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. పర్యాటకులు ఈ నగరాన్నే ‘ఐవరీ సిటీ’ లేదా ‘రాజప్రాసాదాల నగరం’ అని పిలుస్తుంటారు. ఇక్కడి గంధపు ఉత్పత్తులు ఈ నగరాన్ని ‘శాండల్ ఉడ్ సిటి’ అని పేరు తెచ్చిపెట్టాయి. మైసూరు నగరంలో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని ‘యోగా సిటి’ అని కూడా పిలుస్తుంటారు.

పురాణ ప్రాశస్థం:

మహిషాసురుని విగ్రహం ముందు
భారతీయ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. అతని పేరుతోనే ఈ ప్రాంతానికి ‘మహిష - ఊరు’ అని నామకరణం చేయబడింది. కాలక్రమేణా అది ‘మహిషూరు’గా రూపొంది, ఆంగ్లేయుల రాకతో అది “మైసూరు”గా స్ధిరపడింది. ఈ రాక్షసుడుని ఇక్కడి ప్రాంత ప్రజలు కొలిచే చాముండి దేవి సంహరించినట్లు చెపుతారు. నేటి మైసూరు నగరానికి తూర్పున ఉన్న కొండపై చాముండేశ్వరీ దేవాలయం నెలకొని ఉంటుంది.

చరిత్ర:

చారిత్రక ఆధారాల ప్రకారం మైసూరు రాజ్యాన్ని గంగ వంశం వారు 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 1004 వరకు పరిపాలించారు. వారి తర్వాత చోళులు, హొయసల రాజులు మైసూరు రాజ్యాన్ని పరిపాలించారు. వీరి తరువాత యదు వంశస్ధులైన స్థానిక భూస్వాములు విజయనగర మహా సామ్రాజ్యనికి కప్పం కడుతూ మైసూరు పాలకులుగా పాలించారు. వీరే తర్వాతి కాలంలో ఒడయార్ వంశస్ధులుగా కూడా పిలువబడ్డారు.

3వ చామరాజ ఒడయార్ ఆధ్వర్యం‌లో మైసూరు కోటను నిర్మించి దానిని తన పాలనకు ప్రధాన నగరంగా చేసుకున్నాడు. విజయనగర మహా సామ్రాజ్య పతనాంతరం 1610 వ సంవత్సరంలో శ్రీ రంగపట్టణం‌లోని విజయనగర సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని మైసూరు నుండి శ్రీ రంగపట్టణానికి బదలాయించాడు. అనంతర కాలం‌లో రాజధానిని మైసూరుకు మార్చబడినది.

18 శతాబ్దం‌లో మైసూరు రాజ్యాన్ని హైదర్ ఆలీ మరియు టిప్పు సుల్తానులు 1761 నుండి 1799 వరకు పరిపాలించారు. వీరి కాలం‌లో రాజధానిని మైసూరు నుండి శ్రీ రంగపట్టణానికి మార్చబడినది. 1799 వ సంవత్సరములో జరిగిన యుద్దం‌లో టిప్పు సుల్తాన్ మరణించిన పిదప, మైసూరు రాజధానిగా మారింది. 1831వ సంవత్సరములో బ్రిటీష్ కమీషనర్ మార్క్ కబ్బన్ రాజధానిని బెంగళూరుకు మార్చడంతో మైసూరు తన రాజధాని హోదాను కోల్పోవలసి వచ్చింది. 1881వ సంవత్సరములో బ్రిటీష్ పాలకులు మైసూరు రాజ్యాన్ని ఒడయార్ వంశస్థులకు అప్పగించడంతో మైసూరు మళ్ళీ రాజధానిగా మారింది. అప్పటి నుండి 1947 వ సంవత్సరం వరకు ఒడయార్ రాజుల పాలనలో మైసూరు రాజధానిగా వర్ధిల్లినది. ఆ సమయం‌లోనే క్రిష్ణరాజ ఒడయార్ IV మైసూరు పట్టణాన్ని విశాలమైన రోడ్లు, అతి పెద్ద రాజ భవనాలు, తోటలు మరియు సరస్సుల ఏర్పాటుతో ఒక ప్రత్యేక నగరంగా చక్కటి ప్రణాళిక మేరకు రూపొందించారు. బ్రిటీష్ సామ్రాజ్యం‌లో కల మూడు అతి పెద్ద రాజసంస్థానలలో ఒకటయిన మైసూరు సంస్థానం స్వాతంత్ర్యం తరువాత భారతదేశం‌లో విలీనం అయ్యింది.

చాముండేశ్వరీ ఆలయం

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దసరా ఉత్సవాలు:

మైసూరు నగరంలో జరిగే దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్దిగాంచినవి. పదిహేనవ శతాబ్ధిలో ప్రారంభమైన ఈ ఉత్సవాలను పది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయం‌లో మైసూరు ప్రజలే కాక, దేశ వివిధ ప్రాంతాలనుండి ప్రజలు మైసూరుకు వచ్చి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు. ఈ ఉత్సవాల సందర్బంగా చాముండేశ్వరి దేవిని 9 అవతారాలతో అలంకరించి పూజిస్తారు. ఈ ఉత్సవాలలో తొమ్మిదవ రోజు ‘మహార్నవమి’ రోజున ఖడ్గాన్ని పూజించి అలంకరించిన ఏనుగులు, గుఱ్రాలు, ఓంటెల మీదుగా ఊరేగిస్తారు. ఆఖరి పదవ రోజు ‘విజయదశమి’ అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున చాముండేశ్వరి దేవిని ఏనుగుపై బంగారు అంబారీలో ఊరిగేస్తారు. దీనినే ‘జంబూ సవారీ’ అంటారు. ఈ ఊరిగింపు అంగరంగ వైభవంగా మైసూరు ప్యాలెస్ నుంచి ప్రారంభమై బన్ని మండపం వరకు సాగుతుంది. ఇదే రోజు రాత్రి జరిగే పంజీన కవయట్టు అనే దివిటీల ప్రదర్శనతో ఈ దసరా ఉత్సవాలను ముగిస్తారు.
బృందావన గార్డెన్స్‌లో లైట్ షో

స్ధానిక ఆకర్షణలు:

మైసూరు నగరాన్ని వినోదాన్ని పంచే వారసత్వ నగరంగా టూరిస్టులు అభివర్ణిస్తుంటారు. మైసూరును సందర్శించే పర్యాటకులకు ఇక్కడి సంప్రదాయాలు, కళలు, ఆహారాలు, జీవనవిధానం మరచిపోలేని అనుభూతులను కలిగిస్తాయి. ఇక్కడి మైసూరు ప్యాలెస్ లేదా అంబా ప్యాలెస్, జగన్మోహన ప్యాలెస్, లలితా మహల్, జయలక్ష్మీ విలాస్ భవనం ఆనాటి మైసూరు పాలకుల రాచరిక ఠీవికి దర్పణం పడుతుంది. చాముండేశ్వరి దేవాలయం, సోమనాధపుర దేవాలయం, మహాబలేశ్వర దేవాలయం, సెయింట్ ఫిలోమినా చర్చి మైసూరు నగరంలో ప్రధాన ఆకర్షణలు. ఇక మైసూరును సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలలో బృందావన గార్డెన్స్ ఒకటి. సాయంత్రం వేళల్లో ఇక్కడి ఫౌంటెన్ నుంచి వచ్చే రంగు రంగుల కాంతులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. మైసూరు జూ భారతదేశంలో ఉన్న ఉత్తమమైన జూ పార్క్‌గా పరిగణింపబడుతుంది. రైల్వే మ్యూజియం, వ్యాక్స్ మ్యూజియం, జిఆర్ఎస్ ఫాంటసీ పార్క్, కారంజి లేక్, మరియు కుక్కర హళ్ళి సరస్సు వంటి ప్రదేశాలు పర్యటనలో చూడవలసిన ప్రసిద్ద పర్యాటక ప్రాంతాలు. మైసూరు పట్టణానికి చుట్టు పక్కలగల పర్వత ప్రదేశాలు పర్వతారోహకులకు ఎంతో ఉత్సాహాన్ని పుట్టిస్తాయి.

మైసూరు పాక్‌:

రాయల్ స్వీట్‌గా పిలవబడే దక్షిణ భారతీయ సాంప్రదాయ తీపి వంటకం అయిన ‘మైసూరు పాక్’ ఈ ప్రాంతానికి సంబంధించినదే!. ముమ్మడి కృష్ణరాజా ఒడయార్ పాలనలో మైసూరు ప్యాలెస్‌కు వచ్చిన అతిధిల కొరకు అప్పటి పాలకులు మెచ్చే విధంగా ఈ వంటకాన్ని తయారు చేసినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో దీనికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోవడంతో మైసూరు పేరుమీదుగా మైసూరు పాక్‌గా పేరుపొందింది.

బృందావన గార్డెన్స్

మైసూరులో షాపింగ్:

మైసూరులో షాపింగ్ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మైసూరు ఏనుగు దంతపు పని, రోజ్ ఉడ్ హస్తకళలు, చందనపు కళాఖండాలు, చందనపు ధూపం స్టిక్స్ మొదలగు గంధపు ఉత్పత్తులకు ఎంతో ప్రసిద్ది. అలాగే ఇక్కడి పట్టు చీరలు ఎంతో ఘనత వహించాయి. మైసూరు సాంప్రదాయ పెయింటింగ్సా పిలవబడే గంజిఫా పెయింటింగ్స్ ఎంతో ప్రసిద్ది చెందాయి.

ఎలా వెళ్ళాలి?


రోడ్డు, రైలు మార్గం:
  • మైసూరు నగరం బెంగుళూరుకు 140 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన ప్రాంతాలు రోడ్డు, రైలు మార్గాలచే కలుపబడి ఉంది.

విమాన మార్గం:
  • మైసూరు విమానాశ్రయం లేదా మందకల్లి విమానాశ్రయం ద్వారా దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలను నిర్వహిస్తోంది.
  • మైసూరుకు దగ్గరలో దేవనహళ్ళి (బెంగుళూరు) అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...