ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు.

ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు.

ప్రధాన ఆలయం:

మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు.

పురాణ ప్రాశస్థ్యం:

సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు.

పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర్కాయీ, కుమారస్వామి మరియు కన్యాకుమారిలు ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణ కొరకు తగిన వారిని అన్వేషిస్తూ బిర్మన్నా పర్గాడే దంపతుల గృహానికి వచ్చారు. ధర్మదేవతలను ఆ దంపతులు ఆహ్వానించి పూజించి గౌరవించారు. వారి ఆతిధ్యానికి ప్రసన్నులై ఆ రోజు రాత్రి ఆ దంపతుల కలలో కనిపించి వారి ఇంటిని ధర్మదేవతలకు అప్పగించి, వారిని ధర్మ ప్రచారం చేయమని ఆదేశించారు. అంతట ఆ దంపతులు వారి గృహాన్ని ధర్మదేవతలకు ఇచ్చి వారి కొరకు వేరొక గృహాన్ని నిర్మించుకున్నారు. ఆ గృహాన్నే ‘నెలియాడుబీడు’ అని పిలుస్తారు. తరువాత ఆ గృహమే ప్రధాన ఆలయం‌గా మార్చబడినది. ఆలయం నందు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించగా, అణ్ణప్ప అనే భక్తుడు మంగళూరు సమీపం‌లోని కదిరి అనే ప్రాంతం నుండి శివలింగం తీసుకువచ్చి ఈ గర్భాలయం‌లో ప్రతిష్ఠించారు.

ఆ తరువాత 16 వ శతాబ్ధం‌లో ఉడిపి పీఠాధిపతి అయిన శ్రీ వాదిరాజస్వామి ఈ ప్రాంతాన్ని సందర్శించి గర్భాలయం‌లోని శ్రీ మంజునాధ లింగాన్ని పునఃప్రతిష్టించి ఈ ప్రదేశానికి “ధర్మస్థల “ అను నామకరణం చేసారు. నాటి నుంచి ఈ క్షేత్రం - శ్రీ క్షేత్రం, సిద్దప్ప క్షేత్రం, మహా నిధి క్షేత్రం, మహా దేవప్ప సన్నిధిగా భక్తులచే పిలువబడుచున్నది.

డ్రస్ కోడ్ :

ధర్మస్థల ఆలయ దర్శనం కొరకు విచ్చేసే భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే దరించాలి. పురుషులు చొక్కా దరించరాదు కాని పంచ, కండువ దరించాలి మరియు స్త్రీలు అయితే చీర లేదా చుడిదార్ దరించాలి.

ఆలయ సందర్శన వేళలు:

ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యహ్నాం 2 గంటల వరకు మరియు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది.

అన్నదానం:

ఈ క్షేత్రం‌లో అన్నపూర్ణ అని పిలువబడే అదునాతన వంటశాల కలదు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతిరోజు అన్నదానం చేయబడుతుంది.

తులాభారం:

భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరిన తరువాత బియ్యం, అరటి పండ్లు, బెల్లం, నాణేలు మొదలైన వాటితో తులాభారం తూగి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటారు.

స్ఠానిక ఇతర ఆకర్షణలు:

సుందరమైన పచ్చని అందాలలో నెలకొని వున్న ధర్మస్ఠల క్షేత్రం‌లో శ్రీ మంజునాధ స్వామి ఆలయమే కాకుండా ఇతర ఆకర్షణలు కలవు. అవి ...

నేత్రావతి నది :
ధర్మస్ఠల క్షేత్రం అద్బుతమైన ప్రకృతి సౌందర్యాల నడుమ నేత్రావతి నదీ తీరం‌లో నెలకొని వున్నది. మంజునాధ స్వామి దర్శనానికి ముందుగా నేత్రావతి నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితి. ఇక్కడ భక్తులు బట్టలు మార్చుకోవడానికి గదులు ఉన్నాయి. నేత్రావతి నది స్వామి వారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరం‌లో ఉన్నది. నదీ తీరం నుంచి ఆలయం చేరుకోవడానికి బస్సులు మరియు షేర్ ఆటోలు వున్నాయి.

అణ్ణప్ప బెట్ట :
కన్నడ బాషలో బెట్ట అంటే కొండ అని అర్ధం. ధర్మస్థలలోనికి ప్రవేశించేటప్పుడు బస్ స్టాండ్‌నకు కుడి వైపున ఒక కొండ కనిపిస్తుంది. ఈ కొండనే అణ్ణప్ప బెట్ట అని పిలుస్తారు. దీనినే బడినెడి బెట్ట అని కూడా పిలుస్తుంటారు. కొండ పై భాగాన నలుగురు ధర్మ దేవతలు కొలువై వుంటారు. కొండ పైకి 150 మెట్లతో మార్గం ఉంది. కొండ పైకి మాత్రం స్త్రీలను, పిల్లలను అనుమతించరు.

బాహుబలి విగ్రహం :
ధర్మస్ఠల దేవాలయానికి దగ్గరలో రత్నగిరి అనే కొండపై బాహుబలిగా ప్రఖ్యాతిచెందిన గోమఠేశ్వరుని విగ్రహం కలదు. రత్నగిరి కొండపైకి మెట్ల మార్గం లేదా రోడ్డు మార్గం కలదు. సుమారు 175 టన్నుల బరువు గల ఈ విగ్రహాన్ని ఏకశిలపై చెక్కబడినారు. ఈ విగ్రహాన్ని 1973 వ సంవత్సరములో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం ఎత్తు 39 అడుగులు అనగా 12 మీటర్లు.

మంజూష మ్యూజియం :
ఇక్కడ ధర్మస్థలకు సంబంధించిన పురాతన కాలానికి సం‌బంధించిన సాంస్కృతిక వారసత్వ వస్తువులు, కళాఖండాలు, పురాతన లిఖిత ప్రతులు, చిత్రాలు మొదలైనవి చూడవచ్చును.

మంజూష కార్ల మ్యూజియం :
మంజూష ప్రదర్శనాలయం ప్రక్కనే మంజూష కార్ల మ్యూజియం కలదు. ఇక్కడ పురాతన కాలానికి సం‌బంధించిన అరుదైన కార్లను చూడవచ్చును.

చంద్రనాధ స్వామి ఆలయం :
జైన మతానికి సంబంధించిన ఈ ఆలయం‌లో చంద్రనాధ స్వామి విగ్రహం వుంది. భక్తులు ధ్యానం చేసుకోవాటానికి ఇక్కడకి వస్తుంటారు.

వసతి:

ధర్మస్థలలో ఉండడానికి స్థానిక ప్రవేట్ హోటల్స్ కలవు. ఇవే కాకుండా దేవస్ఠానం ఆధ్వర్యం‌లో నామమాత్రపు ధరలతో వసతి సదుపాయం కల్పిస్తుంది.

ధర్మస్థలకి ఎలా చేరుకోవాలి?

ధర్మస్థల క్షేత్రం మంగళూరు నుండి సుమారు 74 కి.మీ.ల దూరంలో బెంగళూరు నుండి సుమారు 300 కి.మీ.ల దూరంలో ఉంది. మంగుళూరు లేదా బెంగుళూరు నుండి బస్సులు, ప్రయివేటు వాహనాలు, టాక్సీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్టాల నుండి ధర్మస్థల దర్శించాలనుకొనే యాత్రికులు ముందుగా బెంగళూరు చేరుకొని అక్కడ నుండి బస్సు లేదా రైలు మార్గం‌లో ధర్మస్థల చేరుకోవడం సులభం.

రోడ్డు మార్గం:
కర్ణాటకలోని ముఖ్య నగరాలైన బెంగళూరు, మంగళూరు, మైసూర్‌ల నుండి KSRTC ఆద్వర్యం‌లో ఎ.సి., నాన్ ఎ.సి., డీలక్స్ బస్సులు డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

రైలు మర్గం:
రైలు ద్వారా చేరుకోవాల్సిన వారు బెంగళూరు నుండి యడమంగళ (Yedamangala) రైలు స్టేషన్‌కు చేరుకొని అక్కడ నుండి లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ధర్మస్ఠలకు చేరుకోవచ్చు. కాని మంగళూరు చేరుకొని అక్కడ నుండి ప్రయివేట్ వాహనాల ద్వారా కాని, లోకల్ బస్సుల ద్వారా ధర్మస్ఠలకు చేరుకోవడం ఆమోదించబడిన మార్గం.

వాయు మార్గం:
ధర్మస్థలకు సమీపం‌లో మంగళూర్‌ నందు విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...