దేవనహళ్ళి: టిప్పు సుల్తాన్ జన్మ స్థలం


దేవనహళ్ళి కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు గ్రామీణ జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది బెంగుళూరు నగరానికి 35 కి.మీ.ల దూరంలో ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం వలన ఈ ప్రాంతము రియల్ఎస్టెట్ వ్యాపారానికి ప్రసిద్దిగాంచినది. అంతేకాకుండా ఈ ప్రదేశం పర్యాటక మరియు వారసత్వ సన్నిధిగా పేర్కొనవచ్చు. 18వ శతాబ్దం‌లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాల్ చేసి, వారికి ఎదురొడ్డి పోరాడిన టిప్పు సుల్తాన్ ఇక్కడే జన్మించినాడు.

నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకు ప్రయాణించేటప్పుడు జాతీయ రహదారి (NH-7) లో దేవనహళ్ళి గ్రామం‌లో ప్రభుత్వ ఆర్కియాలజి సర్వే వారి హోర్డింగ్ మరియు కోట ఆసక్తిగొలుపినది. కొంత కాలం తరువాత నేను దేవనహళ్ళిని సందర్శించడం జరిగినది.

దేవనహళ్ళి చరిత్ర:

దేవనహళ్ళి కోట

దేవనహళ్ళి తొలుత గంగవాడి రాజుల పాలనలో తరువాత రాష్ట్ర కూటులు, పల్లవుల, చోళుల, హోయసల, విజయనగర రాజుల పరిపాలనలో ఉండినది. విజయనగర రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు స్థానిక పాలెగాడైన ‘రణ బైర గౌడ’ కుమారుడు ‘మల్ల బైరె గౌడ’ ఈ ప్రాంతం‌లో 1501 సంవత్సరములో కోటను నిర్మించాడు. తొలుత ఇది మట్టితో నిర్మించారు. ఈ కోటను తొలుత “దేవనదొడ్డి” లేదా “ దేవనపుర” అని పిలిచేవారని తెలుస్తుంది. కాలక్రమం‌లో ఈ కోట దేవన హళ్ళిగా ప్రఖ్యాతిగాంచినది.

కోట ద్వారం లోపలి

విజయనగర రాజుల అనంతరం ఈ కోట మైసూర్ పాలకులు వడయార్ రాజులు మరియు మరఠాల ఏలుబడిలో ఉండినది. పిమ్మట హైదర్ అలి మరియు టిప్పు సుల్తాన్‌ల పాలనలో ఉండినది. వీరు అధికారం‌లో ఉండగా, ఈ కోటను రాతితో నిర్మించినారు. టిప్పు సుల్తాన్ ఈ కోటకు యూసఫబాద్ అని నామకరణం చేసాడు. కాని ఆ పేరు ప్రసిద్ధిగాంచలేదు. టిప్పు అనంతరం 1791 సంవత్సరములో ఈ కోట ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు ఆక్రమించినారు.

టిప్పు సుల్తాన్ జన్మ స్థలం

టిప్పు సుల్తాన్:

అసమాన ధైర్యసాహసాలతో దక్షిణ భారత దేశపు నెపోలియన్‌గా ఖ్యాతిగాంచిన అరివీర భయంకరుడు టిప్పూ సుల్తాన్ దేవనహళ్ళిలో 1750 సంవత్సరంలో జన్మించాడు. కడప ఆర్కాట్ నవాబ్ కూతురైనటువంటి ఫాతిమా ఫకృన్నిసా మరియు హైదర్ ఆలిలు టిప్పు తల్లిదండ్రులు. ప్రముఖ సూఫి తత్వవేత్త అయిన మస్తాన్ నెలియా ఫతే ఆలీ మరియు హైదర్ ఆలి తండ్రి ఫతే మహమ్మద్‌ల జ్ఞాపకార్థం టిప్పూకు ఫతే ఆలీగా పేరు పెట్టారు. కాలక్రమం‌లో టిప్పు సుల్తాన్గా ప్రసిద్ధి పొందాడు.

దేవనహళ్ళి కోట ప్రవేశ ద్వారం‌నకు ఎడమ వైపు అర కిలోమీటరు దూరం‌లో టిప్పు జన్మ స్థలం కలదు. ఇక్కడ టిప్పు జన్మ సూచిక గురించి తెలియజేస్తూ 6 అడుగుల స్తంబాలతో కూడిన ఒక స్మారక చిహ్నం మరియు టిప్పు గురించి ప్రభుత్వ శిలాఫలకం కలదు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని ఖాస్ బాగ్ అని పిలుస్తారు.

దేవనహళ్ళి కోట నిర్మాణం:

కోట గోడ

దేవనహళ్ళి కోటను తొలుత మట్టితో నిర్మించగా, టిప్పు సుల్తాన్ రాతితో నిర్మించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణం‌లో కోట నిర్మాణం జరిగింది. తూర్పు దిక్కున యందు కోట ప్రవేశద్వారం కలదు. కోట గోడలపై కాపల సైనికులు పర్యవేక్షణ కొరకు 12 బురుజులు క్రమ పద్దతిలో నిర్మితమై ఉన్నాయి. కోట లోపల వివిధ పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. వీటిలో వేణుగోపాల స్వామి ఆలయం, చంద్రమౌళేశ్వరాలయం, నాగేశ్వరాలయం ప్రసిద్ధిగాంచినవి. ప్రతి దీపావళి పండుగరోజు చంద్రమౌళేశ్వర ఆలయంలో జరిగే లక్షదీపోత్సవం అద్భుతం‌గా ఉంటుంది. కోటలోని వివిధ ఆలయాలు, నిర్మాణాల వద్ద ప్రభుత్వ ఆర్కియాలజి సర్వే వారు సం‌రక్షణ కట్టడాలుగా పేర్కొంటూ బోర్డ్‌లను ఏర్పాటుచేసివున్నారు.

వేణుగోపాల స్వామి ఆలయం:

వేణు గోపాల స్వామి ఆలయం

పూర్వం తమిళనాడులోని కంచి నివాసి ఒకరు ఈ ప్రాంతములో స్థిరపడినాడు. ఒకరోజు వడగండ్లతో కూడిన వర్షం కురియగా వారి ఆశ్రయం నేలకూలగా, ఒక చెట్టు క్రింద ఆశ్రయం పొందారు. ఆ రాత్రి వారికి కలలో వేణుగోపాల స్వామి మరియు తిమ్మరాయుని స్వామి కనపడి అక్కడి పుట్టలో నేను వెలసి ఉన్నానని, తనని అక్కడే ప్రతిష్టించవలెనని ఆదేశించెను. మరుసటి రోజు వారు ఆ పుట్టని త్రవ్వగా, వేణుగోపాల స్వామి మరియు తిమ్మరాయుని స్వామి విగ్రహాలు కనిపించెను. పిమ్మట వారు తిమ్మరాయుని స్వామి విగ్రహాన్ని గౌతమగిరి బేటా ప్రాంతంలో ప్రతిష్టించి, వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ప్రస్తుత దేవనహళ్ళి గ్రామం‌నకు తీసుకువచ్చి ప్రతిష్టించారు.

వేణు గోపాల స్వామి ఆలయం లోపలి స్తంభాలు
వేణుగోపాల స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలిలో నిర్మించినారు. ప్రవేశద్వారంలో ఎతైన రాజగోపురం, విశాలమైన అంతర్గత ప్రాంగణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఆలయం నందు అధ్బుత శిల్పాలతో నిర్మితమైవున్నది. ఆలయం లోపలి గోడలపై రామాయణ పురాణ కథలు శిల్పాల రూపం‌లో చిత్రించినారు. భక్తులు ఈ ఆలయం‌ను ఉదయం 7.00 గంటల నుంచి 10.00 గంటల వరకు మరియు సాయంత్రం 8.00 గంటల నుండి 6.00 గంటల వరకు దర్శించవచ్చు.

ఇతర ఆకర్షణలు:

  • దేవనహళ్ళి గ్రామం వివిధ ఆలయాలకు ప్రసిద్దిగాంచినది. ఇక్కడ పురాతనమైన చంద్రమౌళేశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, నాగేశ్వరాలయం ప్రసిద్ధిగాంచినవి.
  • ఇక్కడ హైదర్ ఆలీ మరియు టిప్పు సుల్తాన్‌లు నివసించిన భవనం ఉన్నది.
  • ప్రసిద్ధిగాంచిన నందిని హిల్స్ ఈ ప్రాంతమునకు దగ్గరలోనే ఉంది.

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం:
బెంగళూరు నగర శివారులో ఉన్న యల్హంక పట్టణం నుంచి 29 కి.మి. దూరంలో కలదు. యల్హంక లేదా బెంగళూరు నుంచి బస్సులు, ప్రయివేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం:
యల్హంక - చిక్‌బల్లాపూర్ రైలు మార్గం‌లోగల దేవనహళ్ళిలో రైల్వే స్టేషన్ కలదు.

విమాన మార్గం:
దేవనహళ్ళిలోనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం