ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మైసూరులో నెలకొనివున్న శ్రీ చాముండేశ్వరీ ఆలయం

శ్రీ చాముండేశ్వరీ ఆలయం కర్ణాటక రాష్ట్రం‌లోని ప్రధాన నగరాలలో ఒకటైన మైసూరు నగరానికి తూర్పున సుమారు 12 కి.మి.ల దూరం‌లో గల చాముండీ పర్వతం‌పై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఈ నగరాన్నే క్రౌంచపురి, క్రౌంచ పట్టణం, క్రౌంచ పీఠంగా పిలుస్తుంటారు.

పురాణ ప్రాశస్థం:

పూర్వం మహిషపురిగా పిలవబడే ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించేవాడు. ఈ రాక్షసుడు పరమశివుడిని తన కఠోర తపస్సుతో మెప్పించి, లోకం‌లోని ఏ పురుషుడి చేతిలో మరణించకుండా వుండేలా వరం పొందాడు. మహిషాసురుడుని వధించుటకై శ్రీ చాముండేశ్వరీ దేవి శక్తి స్వరూపిణిగా అవతరించి, మహిషాసురుని సంహరించి మహిషాసురమర్ధినిగా ప్రసిద్ధమైనది.

శక్తి పీఠం:

హిందూ పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం సమయం‌లో సతీ దేవి ప్రాణ త్యాగం చేసినప్పుడు, పరమ శివుడు ఆమె శరీరాన్ని తన భుజాన వేసుకొని రుద్రతాండవం చేశాడు. ఆ సమయం‌లో విష్ణు దేవుడు తన చక్రం‌తో ఆమె శరీరాన్ని ఖండించగా, ఆ శరీర బాగాలు దేశం‌లోని పద్దెనిమిది ప్రాంతాలలో పడి ఆ ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్దిగాంచాయి. వాటిలో నాల్గవ శక్తి పీఠమే శ్రీ చాముండేశ్వరీ క్షేత్రం. ఈ పీఠం‌పై సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు.

ఆలయ ప్రాశస్థం:

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం‌లో హోయసల పాలకులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆలయ గోపురాన్ని 17వ శతాబ్దం‌లో విజయనగర రాజ పాలకులు నిర్మించారు. హోయసల, విజయ నగర రాజ వంశీయుల ఏలుబడిలో ప్రముఖ పుణ్య క్షేత్రం‌గా అభివృద్ధి చెందింది. వారి తరువాత కాలం‌లో మైసూరుని పాలించిన రాజులు ముఖ్యం‌గా ముస్లిం పాలకులైన హైదర్ ఆలీ, వారి కుమారుడు టిప్పు సుల్తాన్‌లు అమ్మవారికి అనేక ఆభరణాలను కానుకలుగా సమర్పించారు.

వారి తదనంతరం స్ఠానిక ఒడయారు రాజులు ఈ దేవాలయాన్ని అత్యంత సుందమైన ఆలయంగా రూపొందించారు. వీరు శ్రీ చాముండేశ్వరీ దేవిని కులధైవంగా పూజించేవారు. అద్భుత శిల్ప, వాస్తు శిల్ప కళలకు సుందర తార్కాణం‌గా అలరారుతున్న ఈ ఆలయము ఒడయారు రాజుల కళాపోషణకు ప్రతీకగా పేర్కొనవచ్చు. ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయ గాలి గోపురం ఏడు అంతస్థులతో సుమారు నలభై అడుగుల ఎత్తుతో ఆకాశాన్నంటున్నట్లు కనిపిస్తుంది. ఆలయ ముఖద్వారం‌ వెండి తొడుగుతో నిర్మింపబడి వుంటుంది. దీనిపై అమ్మవారి పౌరాణిక గాధా చిత్రాలతో కూడి ఆలయ వైభవాన్ని చాటుతుంది. ఈ ఆలయ ప్రాంగణం‌లో శివునికి, వినాయకునికి, ఆంజనేయ స్వామికి ఉపాలయాలు ఉన్నాయి. ఆలయం వెలుపల ఒక చేతిలో కత్తి మరొక చేతిలో పడగ విప్పిన పాముతో మహిషాసురిని విగ్రహం కలదు.

అమ్మవారి అభరణాలు:

శ్రీ చాముండేశ్వరీ దేవి అమ్మ వారికి ధరింపజేసే ఆభరణాలు చాలా విలువైనవని చెపుతారు. దసరా పండుగల సందర్బంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ ఆభరణాలను అమ్మవారికి అలంకరించి ఆ తరువాత తిరిగి ఖజానాకు తరలిస్తారు. అమ్మవారికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని ఒడయార్ రాజు తన వద్ద ఉంచుకొని, దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అమ్మవారికి సంబంధించిన విలువైన ఆభరణాలలో చామరాజ ముడి (కిరీటం) కర్ణపత్రం, డాలు, మూడు పతకాలు, కాసుల హారం, పచ్చల పతకాలు, నాగడం, జడ బిళ్ళ, జడ సరాలు వంటివి ప్రభుత్వ ఆధీనం‌లో వుండగా, వజ్ర కచతమైన త్రిశూలం, పాశుపతాస్ర్తం, కవచం, నాగస్రం, ఢమరుకం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలు స్ఠానిక ఒడయారు రాజుల ఆధీనం‌లో ఉన్నాయి. ఈ విశేషాఅభరణాలన్నింటిని మూలవిరాట్టుకు కాకుండా ఉత్సవ మూర్తికి మాత్రమే అలం‌కరిస్తారు.

వెల కట్టలేని పచ్చల హారం:

అమ్మవారి ఆభరణాలలో గల పచ్చల హారం ప్రత్యేకమైనది. గతం‌లో ముమ్మడి కృష్ణ ఒడియార్ దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరగగా, “మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే వచ్చే డబ్బు కూడా ఈ పచ్చల హారానికి సరిపోదని” బెంగుళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి ఒకరు అభిప్రాయపడ్డారని తెలుస్తుంది.
‌‌‌‌‌‌‌

దసరా ఉత్సవాలు:

మైసూరు నగరంలో జరిగే దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్దిగాంచినవి. ఈ ఉత్సవాలను పది రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్బంగా ఒడయారు రాజుల కులదైవం అయిన శ్రీ చాముండేశ్వరీ దేవిని వివిధ ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు. ఈ దసరా ఉత్సవాల సమయం‌లో మైసూరు ప్రజలే కాక, దేశ విదేశాల నుండి ప్రజలు మైసూరుకు వచ్చి వేడుకలలో పాల్గొని ఆనందిస్తారు.


మూడో అతి పెద్ద నంది:

ఆలయానికి వెళ్ళే నడక మార్గం‌లో 800వ మెట్టు దగ్గర గల శివాలయం ముందు ఒక పెద్ద నంది విగ్రహం కలదు. గ్రానైట్‌తో చెక్కబడిన ఈ విగ్రహం 15 అడుగుల ఎత్తుతో మరియు 24 అడుగుల పొడవుతో దేశం‌లో కల అతి పెద్ద నంది విగ్రహాలలో మూడో అతి పెద్ద నంది విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చెక్కబడిన గంటలు చాలా అందం‌గా అకర్షిస్తాయి.

సందర్శన సమయం:

ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు మరియు సాయింత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.

ఎలా వెళ్ళాలి?

రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే మైసూరు నగరం అనుసంధానించబడి ఉన్నది. మైసూరు నుంచి కొండ పైకి వెళ్ళుటకు బస్సు మరియు ప్రయివేట్ వాహన సౌకర్యం కలదు. 1659 సంవత్సరంలో వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. కాలి నడకన మెట్లు ఎక్కి కొండ పైకి చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కల్ కోట్ స్వామీ సమర్ద మహారాజ్

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట్ ప్రముఖ పుణ్యక్షేత్రం మరియు చారిత్రక, రాచరిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ నెలకొని వున్న ‘శ్రీ స్వామి సమర్థ మహారాజ్’ సమాధి మందిరం‌ను దర్శించడానికి ఆయన భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడా స్థిరంగా ఉండని శ్రీ స్వామి సమర్థ మహారాజ్ వారు ఎక్కువ కాలం అంటే సుమారు 22 సంవత్సరాలు అక్కల్ కోట్ గ్రామం‌లో నివసించుట వలన వారి భక్తులు ఆయనను ‘అక్కల్ కోట్ మహారాజ్’ అని, వారు ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి ‘స్వామీ సమర్ద’ అని అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. ఈనాడు అక్కల్ కోట్‌‌గా పేరుపొందిన ఈ పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. శ్రీ స్వామి సమర్థ వారు ఎక్కడ పుట్టారో? వారి తల్లిదండ్రులు ఎవరో? ఎక్కడ నుంచి వచ్చారో? మొదలగు విషయాలు ఎవరికీ తెలియదు. శ్రీ స్వామి సమర్థ వారు దేశం‌లోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ 1856 సంవత్సరంలో అక్కల్ కోట్ గ్రామం చేరినాడు. నాటి నుంచి అక్కల్ కోట్ గ్రామం‌లో నివసిస్తూ అక్కడి ప్రజలకు వివిధ మహిమలు చూపగా, తద్వారా మహారాష్ట్ర అంతటా ప్రాచుర్యం పొందారు. భక్తులు వీరిని శ్రీ దత్తాత్రేయుని మూడవ అంశం‌గా భావించి పూజించేవారు. వీరు తేది 3...

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం‌లో సుందరమయిన పశ్చిమ కనుమల మధ్య గల సుబ్రహ్మణ్య అను గ్రామములో కలదు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి)ని సర్ప దేవునిగా భక్తులు ఆరాధిస్తారు. భక్తులు తమ జాతకంలోని కుజ దోష, కాలసర్ప దోష నివారణ నిమిత్తం సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి పూజలు, మరియు కాలసర్ప దోష నివారణ పూజల నిర్వహించుటకు దేశంలోని పలు ప్రాంతాల నుండి ఇక్కడకు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం‌లో ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. వాటిలో ఆది, మధ్య, అంత్య సర్ప క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని “ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం”గా భక్తులు భావిస్తారు. మిగిలిన రెండు క్షేత్రాలు బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో వున్న ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా, మరియు అనంతపురం నుంచి డెబ్బై కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం‌లో వున్న నాగలమడక సుబ్ర...

ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం

శ్రీ మంజునాధ స్వామి కొలువుదీరి వున్న ధర్మస్థల క్షేత్రం కర్ణాటక రాష్ట్రం‌లో మంగళూరుకు సమీపం‌లో నెలకొని వున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మహా శివునికి గల పేర్లలో శ్రీ మంజునాధ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం మంజునాధుడు కాగా, అమ్మ వారిని ‘అమ్మనవరు’ అని పిలుస్తారు. ఈ ఆలయం జైన మతస్థుల ఆధ్వర్యం‌లో వైష్ణవ పూజారులచే అర్చనలు జరిపే ఏకైక శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన ఆలయం: మంజునాధ స్వామి ఆలయం చూడటానికి కేరళ, కర్ణాటక సంప్రదాయల ప్రకారం నిర్మించిన ఒక పురాతన ఇల్లులా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా వుంటుంది. ఆలయం ముందు ఒక కోనేరు వుంది. ప్రధాన ఆలయం‌లో మహా శివుడు, మంజునాధుడు, అమ్మనవరు, ధర్మదేవతలు మొదలైన ధైవసన్నిధులు కలవు. పురాణ ప్రాశస్థ్యం: సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మల్లర్మడిలోని కుడుమాగా ఉన్నది. జైన సైన్యాధికారి అయిన బిర్మన్నా పర్గాడే అతని బార్య అమ్ము బల్లాధితో కలిసి ఈ ప్రాంతం‌లో నివసిస్తుండేవారు. ఆ దంపతులు గ్రామస్తులతో ఎంతో ప్రేమగా, ఔదార్యంగా వుంటూ గ్రామ ప్రజలచే గౌరవించబడేవారు. పురాణ కధనం ప్రకారం ఒకనాడు ధర్మదేవతలైన కళారహు, కళర...