నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ


నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. హిందూ మస్లిం‌‌లు ఐక్యమత్యం‌తో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. దర్గాలోని షహీద్‌లను దర్శించుకునేందుకు దేశం‌ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

కుల మతాలకు అతీతంగా భక్తులందరూ ఒక్కటై రొట్టెలు పంచుకునే ఈ రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రోగాలు నయమవుతాయని, వివాహ, ఉద్యోగ, సంతానం, ఆయురారోగ్యాలు సిద్ధిస్థాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు ఇంటి వద్ద రొట్టె (చపాతీ) లను తయారు చేసుకువచ్చి, స్వర్ణాల చెరువులోని నీళ్ళల్లో దిగి రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. కోరిన కోర్కెకు సంభంధించిన రొట్టెను స్వీకరించి బదులుగా మరుసటి ఏడాది ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువులో భక్తులకు పంచుతారు.

బారా షహీద్ దర్గా:

మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచానికి అందజేయుటకు 12 మంది మత బోధకులు భారత దేశానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా వీరు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలములోని గండవరం చేరగా, గండవరం చెరువు వద్ద వీరికి మరియు ఇస్లామేతరులకు యుద్దం జరిగినది. ఈ యుద్దం‌లో వీరు మరణం చెందారు. వీరి తలలు గండవరం చెరువులో తెగి పడగా, తలలు లేని వీరి మొండాలను వారి గుఱ్రాలు నెల్లూరులోని దర్గామిట్ట స్వర్ణాల చెరువు వద్దకు చేర్చగా, వారి మొం‌‌డాలను అక్కడే ఖననం చేయడం జరిగినది. కాలక్రమం‌లో ఈ పన్నెండు మొం‌‌డాలను వరుసగా సమాధులు నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు. ఉర్ధూ బాషలో ‘బారాహ్’ అనగా పన్నెండు మరియు ‘షహీద్’ అనగా వీర మరణం పొందిన అమరులు అని అర్ధం. ప్రపంచ శాంతి కోసం వచ్చి అమరులైన పన్నెండు మంది మత బోధకుల సమాధులు వల్ల ఈ దర్గాకు “బారా షహీద్ దర్గా” అని పేరువచ్చింది.

మరణించిన పన్నెండు మంది తలలో ఏడుగురి తలలు మాత్రమే యుద్ధం జరిగిన ప్రదేశం‌లో లభ్యమైనవి, ఈ ఏడు తలలు లభ్యమైన ప్రదేశాన్ని “సాతోషహీద్” అని పిలుస్తారు.

రొట్టెల పండుగ చరిత్ర:

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఒక కధనం ప్రచారం‌లో ఉంది. నెల్లూరును పాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యం‌తో బాధపడుతుండేది. ఆ రోగ నివారణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. స్వర్ణాల చెరువు వద్ద గల ఒక రజక దంపతులకు ఈ పన్నెండు మంది కలలో కనిపించి, వారి సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు, ఈ విషయం తెలుసుకున్న నవాబు నెల్లూరు బారా షహీద్ దర్గా నుండి మట్టిని తీసుకువచ్చి తన భార్యకు లేపనంగా పూయించగా, ఆమె ఆరోగ్యం కుదుటపడింది. దీనికి కృతజ్ఞతగా మరుసటి సంవత్సరము అర్కాటు నవాబు తన భార్యా సమేతంగా బారా షహీద్ బాబా దర్గా సం‌దర్శించి ప్రార్ధనలు నిర్వహించి నైవేద్యంగా రొట్టెలను సమర్పించాడు. ఆ రొట్టెలను అక్కడ ఉన్న ప్రజలకు పంచిపెట్టాడు. ఆ సంఘటనానంతరమే రొట్టెల పండుగ మొదలైందని చెపుతారు.

ప్రజలు తమకు ఎలాం‌‌టి కోరికలు ఉన్నా నెల్లూరు బారా షహీద్ దర్గాను దర్శించి, తమ కోరిక నెరవేరితే తర్వాత సంవత్సరం బారా షహీద్ దర్గా సం‌దర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. అలా కోరిన కోరిక తీరినవారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు. రొట్టెల పండుగ నాడు వారు తెచ్చిన రొట్టెలను ఇతరులతో పంచుతారు.

1930 సంవత్సరం‌లో మొదలై ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ పండుగ జరుగుతున్నట్లు స్థానిక పత్రికల ద్వారా తెలుస్తుంది. మొదటిలో ఈ పండుగను మొహరం నెలలో ఒక్క రోజు మాత్రమే జరుపుకునేవారు. కాలక్రమం‌లో భక్తుల తాకిడి ఎక్కువై కుల మతాలకుతీతంగా 4 రోజులు జరుపుకుంటున్నారు.

రొట్టెల పండుగ:

ప్రతీ సంవత్సరం మొహరం నెలలో నెల వంక కనిపించిన 11 వ రోజు నుండి రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహదత్‌తో ప్రారంభమవుతుంది. రెండవరోజు గంధమహోత్సం జరుగుతుంది. గంధమహోత్సం‌లో భాగంగా నెల్లురు జిల్లాలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెలలో గంధాన్ని తీసుకువచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి మిగిలిన గంధాన్ని భక్తులకు పంచుతారు. మూడవరోజు రొట్టెల పండుగ. ఆ రోజు భక్తులు స్వర్ణాల చెరువులో దిగి తమ కోర్కెలు తీరాలని వివిధ రకరకాల రొట్టెలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుండి హాజరు అవుతారు. ఆఖరి రోజు తహలీల్ ఫాతెహా‌తో పందుగ ముగుస్తుంది.

నెల్లూరులోని దర్శనీయ స్థలాలు:

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువు నందు ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నెల్లూరులో పెన్నా నది ఒడ్డున ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, శ్రీ ధర్మరాజస్వామి ఆలయం ప్రసిద్ధమైనవి.

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా అనేక ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. వెంకటాచలం మండలములోని కసుమూరు మస్తానయ్య స్వామి దర్గా, అనుమ సముద్రం మండలములోని అనుమ సముద్రం పేట దర్గా ప్రముఖమైనవి. ఇవేకాకుండా జిల్లాలో జొన్నవాడలోని శ్రీ కామాక్షితాయి ఆలయం, నరసింహ కొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆలయం, సూళ్లూరుపేటలోని చంగాళ్లమ్మ గుడి ప్రసిద్ధిగాంచినవి.

నెల్లూరు బారా షహీద్ దర్గా ఎలా చేరుకోవాలి?

బారా షహీద్ దర్గా నెల్లూరు నగరం‌లోని పొదలకూరు రోడ్ నందు డికె మహిళా కళాశాలకు దగ్గరలో ఉంది. మీరు స్థానిక ఆటోలు లేదా స్థానిక సిటీ బస్సులు లేదా టాక్సీలు ద్వారా ఈ దర్గా చేరుకోవచ్చు.

నెల్లూరు ఎలా చేరుకోవాలి?

  • నెల్లూరు నగరం రోడ్డు మార్గాల ద్వారా దేశం‌లోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.
  • నెల్లూరు అన్ని దేశం‌లోని అన్ని ప్రధాన నగరాలకు రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కాని నెల్లూరు నుండి కడపకు కేవలం బస్సు మార్గము మాత్రమే ఉంది.
  • సమీప విమానాశ్రయాలు తిరుపతి, విజయవాడ, చెన్నై వద్ద ఉన్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం