ఢిల్లీలోని ప్రసిద్ధి ఎర్ర కోట

Image by Shouvik Raychowdhury from Pixabay

ఎర్ర కోట లేదా లాల్ ఖిలా అనే కట్టడం పాత ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో అతి పెద్ద చారిత్రక నిర్మాణం. ఈ కోటను ఎర్రని ఇసుకరాయి ఉపయోగించి నిర్మించడం వలన ఎరుపు రంగులో ఉండి, ఎర్ర కోటగా ప్రసిద్ధిచెందింది. ప్రతి ఏడాది మన దేశం స్వాతంత్ర్యం పొందిన రోజైన ఆగస్టు 15 వ తేదీన భారత ప్రధానమంత్రి మువ్వన్నెల జెండాని ఎగరవేసి తదుపరి దేశానుద్దేశించి ఇక్కడి నుండే ప్రసంగిస్తారు. ఈ ఎర్ర కోట 2007 వ సంవత్సరములో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా UNESCO సంస్థ వారిచే ప్రకటించబడింది.

1649 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్ర కోటను నిర్మించగా, ఎర్ర కోట కేంద్రం‌గా ఢిల్లీ నగరం ఏడు సార్లు నిర్మితమైంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ కోట సాక్షీభూతం‌గా నిలిచింది.

ఆగస్టు 15, 1947 న భారతదేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మన జాతీయ పతాకాన్ని ఇక్కడే ఎగురవేసి ప్రసంగించారు. నాటి నుం‌‌‌చి ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇదే సంప్రదాయం ఈనాటికీ కొనసాగుతూ ఉంది.

ఎర్ర కోట చరిత్ర:

ఈ కోటను మొదటిసారిగా తోమారా రాజు అనంగ్‌పాలా నిర్మించారని చెపుతారు, దీనిని ఇప్పుడు కుల్బ్ మసీదు అని పిలుస్తారు. తదుపరి ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్‌ తన ప్రియసఖి ముంతాజ్ మరణాంతరం ఆగ్రా, లాహోర్ కోటల కన్నా పెద్ద కోటను నిర్మింపతలంచి హిందూ అచారులు, ముస్లిం హకీమ్‌‌ల సలహా మేరకు ఫిరోజ్ షా కోట్ల మరియు సలీం‌‌గఢ్‌‌ల మధ్య ప్రాంతం‌లోని యమునా నదీ తీరం‌లో కోట నిర్మాణ ప్రాంతం‌గా ఎంపిక చేశారు. ఆ ప్రాంతం‌లో షాజహానబాద్‌ అనే పట్టణం నిర్మింప చేసారు. షాజహాన్ ఈ కోట నిర్మాణాన్ని మే 12, 1639 న ప్రారంభించగా ఏప్రిల్ 6, 1648 న నిర్మాణం పూర్తి అయింది. జూన్ 15, 1648లో చక్రవర్తి కోటలోకి ప్రవేశించారు. మొదట్లో ఎర్ర కోటను ఖిలా-ఇ-ముబారక్ అని పిలిచేవారు. అంటే దీవించబడ్డ కోట అని అర్ధం.

ఎర్ర కోట నిర్మాణం:

ఫతేపూర్ సిక్రీ నుంచి నదీ మార్గం గుండా తెప్పించిన ఎర్రని చలువ రాతితో నిర్మించడం వలన ఈ కోటకు ఎర్ర కోట అనే పేరు వచ్చింది. తాజ్ మహల్ డిజైన్ చేసిన అహ్మద్ లాహోరి ఈ కోట డిజైన్‌లో పాలుపంచుకున్నారు. ఈ కోట షాజహాన్ చక్రవర్తి కళాస్పూర్తి, సృజనాత్మకతకు అద్దం పడుతుంది. హిందూ, ఇస్లామిక్, మొఘల్, ఫార్సీ సంస్కృతుల సమ్మేళనం ఈ కోట నిర్మాణం‌లో స్పష్టం‌గా కనిపిస్తుంది. పర్షియా కవి అమీర్‌ ఖుస్రో రాసిన కవితలోని “ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే... ఇదే...” అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్ర కోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో లిఖించబడినవి.

Image by TAugustine from Pixabay

షాజహానాబాద్‌లో ఇళ్ళు, ఉద్యానవనాలు, మసీదులు నిర్మిచుకునేందుకు తన ప్రజలను షాజహాన్ ప్రోత్సహించారు. యమునా నది ప్రక్కనే ఈ కోటను నిర్మించడం వలన, ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. దీని కోట గోడలు నది వైపున 18 మీ నుండి 33 మీ వరకు ఎత్తులో ఉంటాయి. సుమారు 2.41 కి.మీ.ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోటకు రెండు ముఖ్యమైన ముఖద్వారాలు ఉన్నాయి. అవి ఢిల్లీ దర్వాజ (Delhi Gate), లాహోర్ దర్వాజ (Lahore Gate). లాహోర్ దర్వాజా చట్టా చౌక్ అనే ఒక పొడవైన కప్పబడిన బజార్ వీధికి దారి తీస్తుంది. ఇక్కడ రాజ కుటుంబాలకు అవసరమైన సిల్క్ వస్ర్తములు, ఆభరణాలు, ఇతర వస్తువులను విక్రయించేవారు. షాజహాన్ కుమార్తెలలో ఒకరైన జహనారా ఇక్కడ చాందినీ చౌక్ అనే మార్కెట్‌ను నిర్మించారు.

షాజహాన్ అనంతరం కుమారుల మధ్య విభేదాలలో 1659లో ఔరంగజేబ్ తన అన్న అయిన దారాషికోని చంపి మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత కాలలో ఔరంగజేబ్ మరణించిన పిదప మొఘలుల అంతర్గత విభేదాలతో వారి పతనం‌తో పాటు ఎర్ర కోట పతనం కూడా ప్రారంభమైంది. 1739లో నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి ఎర్ర కోటలోని మయూరాసనం‌గా పేరుపొందిన ప్రఖ్యాత నెమలి సింహాసనం‌, కోహినూర్ వజ్రాలతో పాటు ఇతర సంపదలను దోచుకుపోయాడు.

పిదప మరాఠాలు 1788 నుండి 1803 వరకు ఢిల్లీకి పాలకులుగా ప్రకటించుకొని మొఘల్ చక్రవర్తి అయిన రెండవ షా ఆలం‌ను తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. తరువాత కొంత కాలానికి బ్రిటీష్ సైన్యాలు లార్డ్ లేక్ ఆధ్వర్యం‌లో ఢిల్లీని తమ కాలనీగా మార్చుకున్నాయి. షా ఆలం బ్రిటీష్ పాలనను అంగీకరించడంతో ఢిల్లీ మీద పెత్తనం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వచ్చింది. ఎర్ర కోటతో పాటు, ఢిల్లీలోని పలు ప్రాంతాలు బ్రిటీష్ వారు నియమించిన ఖిల్లేదార్ ఆధ్వర్యం‌లో ఉండేవి.

1837లో రెండవ బహధూర్ షా మొఘల్ సామ్రాజ్య పాలకుడయ్యాడు. అతడు తన తుది వరకు బ్రిటీషర్లు నియమించిన ఖిల్లేదార్ ఇచ్చే పించన్ మీద ఆధారపడటంకన్నా మరేమి చేయలేకపోయాడు.

1857 ఏప్రిల్‌లో బ్రిటీష్ సైన్యం‌లో పనిచేస్తున్న మంగళ్ పాండే అనే సైనికుడు బెంగాల్‌లోని బారక్ పూర్ ప్రాంతం‌లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేయగా, ఆ తిరుగుబాటు ఎర్ర కోట వరకు పాకి కొందరు బ్రిటీష్ సైనికాధికారులు, వారి కుటుం‌‌‌బీకుల హత్యకు దారి తీసింది. సరైన నాయకత్వం, సమన్వయం లేకపోవడం వలన సిపాయుల తిరుగుబాటు విఫలమైంది. నాలుగు నెలల తరువాత బ్రిటీష్ వారు ఈ కోటని కైవసం చేసుకొన్నారు. సిపాయుల తిరుగుబాటుకు మద్దతు పలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రచేశారనే అభియోగాలపై ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ పై ఎర్ర కోటలోని దివాన్-ఇ-ఖాస్‌లో విచారణ జరిపి 7 అక్టోబరు, 1858 న ఆయనను రాజ్యబహిష్కరణ చేశారు. ఆయన్ను రం‌గూన్ (ప్రస్తుత మయన్మార్) జైలుకి తరలించి, ఆయన సంతానాన్ని హత్య చేశారు.

ఈ విధంగా చివరి మొఘల్ చక్రవర్తి అయిన రెండవ బహధూర్ షా జఫర్ దేశం‌ నుంచి బహిష్కరించబడే వరకు షాజహాన్ మరియు తదుపరి మొఘల్ చక్రవర్తులు ఈ కోటలో నివసించారు.

1857 సిపాయిల తిరుగుబాటు తరువాత భారతదేశ పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటీష్ ప్రభుత్వం వశం చేసుకుంది. 1877, 1903, 1911 సంవత్సరాలలో ఎర్రకోటలో బ్రిటీష్ దర్బార్ నిర్వహించారు. 1911 దర్బార్ సందర్బంగా బ్రిటీష్ ఇండియా రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్లుగా ప్రకటించడమైనది.

1945 సంవత్సరం‌లో బోస్ ఆధ్వర్యం‌లోని ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అధికారులు మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్, కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గురుబక్ష్ సింగ్ థిల్లాన్‌లను బంధించి ఎర్రకోటలోనే విచారణ జరిగింది. ఈ ముగ్గురు భారతదేశంలోని మూడు ప్రధాన మతాలకు చెందినవారుకావడం వలన, వీరి కోసం దేశమంతా ఒక్కటవుతుందనే భావనతో వీరిని విడుదల చేసింది.

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా కోటలో ఎక్కువ భాగం భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది. 2003 వ సంవత్సరములో భారతీయ పురావస్తు విభాగం వారికి అప్పగించింది.

కోట లోపల ఉన్న ముఖ్యమైన భవనాలు:

అందమైన ఈ కోట లోపల అద్బుత కట్టడాలు, ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి...

దివాన్-ఇ-ఆమ్:
సామాన్య ప్రజలకు దర్శనం ఇవ్వడానికి, వారి ఫిర్యాదులను స్వీకరించి సభలు జరిపే ఈ ప్రజా దర్బార్ హాల్ మండపాన్ని ‘దివాన్-ఇ- ఆమ్’ అని పిలుస్తారు. 50 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి, బంగారం‌‌తో తాపడం చేశారు. బంగారు, వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు అంటే వెర్రి ప్రేమ కలిగినవానిగా పేరొందిన షాజహాన్ చక్రవర్తి ఇక్కడి బాల్కనీలోని మయూరాసన సింహాసనం అని చెప్పుకునే ప్రఖ్యాత నెమలి సింహాసనం‌ పై కూర్చొని దర్బార్ నిర్వహించేవాడు. సామ్రాజ్యంలో ఉన్న వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు, లక్ష తులాల బంగారపు కడ్డీలతో ఈ నెమలి సింహాసనం తయారు చేయించాడట.

దివాన్-ఇ-ఖాస్:
దీనినే ఖాస్ మహల్ అని కూడా పిలుస్తారు. పాలరాయితో నిర్మించబడిన ఈ మండపము‌లో షాజహాన్ చక్రవర్తి తన మంత్రులు, సామంత రాజులతో సమావేశం అయ్యేవాడు. ఇక్కడి స్తంభాలపై పూల చిత్రాలు చెక్కబడి విలువైన రాళ్ళతో అలంకరించబడి ఉంటాయి

ఇవేకాకుండా అంతఃపుర స్రీల కొరకు నిర్మించిన ముంతాజ్ మహల్ (ప్రస్తుతం ఒక మ్యూజియం), రంగ్ మహల్, రాచ కుటుంబ సభ్యుల సంగీత వాయిద్యాలకు ఉపయోగించే నక్కర్ ఖానా, ఔరంగజేబ్ అంతరంగ మసీదైనటువంటి మోతి మసీదు, నూరే బెహిష్త్, జనానా, హయత్-బక్ష్-బాగ్ అని పిలవబడే ఉద్యానవనం ఇతర ఉద్యానవనాలు, చారిత్రక నిర్మాణాలు, పాలరాయి మండపాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడే ఒక పురావస్తు మ్యూజియం మరియు భారత యుద్ధ స్మారక చిహ్నాల మ్యూజియం ఉన్నాయి.

ఎర్ర కోట సందర్శన సమయం:

ప్రతి రోజు ఉదయం 9.30 am నుంచి సాయంత్రం 4.30 pm వరకు ఎర్ర కోటను సందర్శించవచ్చును. ప్రతి సోమ వారం సెలవు. ప్రతి సాయంకాల సమయం‌లో సౌండ్ మరియు లైట్ ప్రదర్శనలు ఇంగ్లీష్ మరియు హింది బాషలలో నిర్వహిస్తారు. ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది. సౌండ్ మరియు లైట్ ప్రదర్శనలు వీక్షించదల్చిన ఔత్సాహికులు ప్రదర్శన సమయం గురించి ముందుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది.

కోట సందర్శనకు భారతీయులకు, విదేశీయులకు ప్రత్యేక రుసుం చెల్లించవలెను. కోట ప్రత్యేకతలు, చరిత్ర గురించి వివరించడానికి అవసరమైన గైడ్ సౌకర్యం కలదు.

ఎర్ర కోటకు ఎలా వెళ్ళాలి?

ఢిల్లీలోని చాందిని చౌక్‌ ప్రాంతం‌లో గల నేతాజి సుభాష్ మార్గ్‌‌లో కల ఎర్ర కోటను సిటి బస్సులు, టాక్సీలు, ఆటోలు, ఆన్‌లైన్ క్యాబ్ మరియు మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు.

సమీప మెట్రో స్టేషన్:
మెట్రో రైలు ద్వారా ఎర్ర కోట చేరుకోవాలంటే ఎర్ర కోటకు కిలో మీటరు దూరం‌లో ‘చాందిని చౌక్‌ మెట్రో స్టేషన్’ కలదు. ఇక్కడి నుండి నడక ద్వారా లేదా ఆటో ద్వారా ఎర్ర కోట చేరుకోవచ్చు,

సమీప బస్ స్టేషన్:
బస్సు ద్వారా ఎర్ర కోట చేరుకోవాలంటే సమీప బస్ స్టేషన్ ‘కశ్మీరీ గేట్ బస్ స్టేషన్’.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం