ఢిల్లీలోని అద్బుత ప్రాచీన కట్టడం కుతుబ్ మినార్‌

Image courtesy: Internet media

కుతుబ్ మినార్ ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రానికి ఒక మచ్చు తునక. ప్రపంచంలోనే ఎత్తయిన ఇటుకల మినార్ (స్తంభం) గా పేరుపొందిన ఈ నిర్మాణం దేశ రాజధాని నగరమైన ఢిల్లీ‌లోని మెహ్రౌలీ ప్రాంతం‌లో గలదు. కుతుబ్ మినార్ ఉన్న ప్రాంతం పురాతన కట్టడాలయిన ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు, అలై దర్వాజా, అలై మినార్, ఇమాం జామిన్ సమాధి, ఇల్తుమిష్ సమాధి, సుల్తాన్ ఘడి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ సమాధి మరియు మదర్సాలతో కూడిన ఇతర నిర్మాణాలన్నింటిని కలిపి “కుతుబ్ కాంప్లెక్స్” అని పిలుస్తారు. 239 అడుగుల పొడవు గల ఈ స్మారక చిహ్నాన్ని నగరంలోని చాలా ప్రాంతాల నుండి చూడవచ్చు. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన సుప్రసిద్ధ ఆకర్షణీయమైన స్మారక కట్టడం విశేషాల గురించి తెలుసుకొందాం.

కుతుబ్ మినార్ చరిత్ర:

చరిత్ర పుస్తకాల ప్రకారం, ఈ నిర్మాణాన్ని క్రీ.శ. 1192 – 1206 సంవత్సరాల మధ్య కాలం‌లో డిల్లీ పాలించిన కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా, ఆ తరువాత వచ్చిన రాజు ఇల్తుమిష్ పూర్తి చేసాడు. కుతుబుద్దీన్ ఐబక్ మినార్ మొదటి అంతస్తుని కట్టించగా, ఇల్తుమిష్ టవర్ యొక్క మరో మూడు అంతస్తులను నిర్మించాడు. కుతుబుద్దీన్ ఐబక్ పేరు మీదుగా కుతుబ్ మినార్ అని పేరుగాంచింది.

కుతుబ్ మినార్ రెండుసార్లు మెరుపులతో దెబ్బతినగా, తదుపరి పాలకులు దాన్ని మరమ్మతులు చేశారు. తరువాత కాలం‌లో ఫిరోజ్ షా పాలనలో భూకంపం కారణంగా మినార్ యొక్క రెండు పై అంతస్తులు దెబ్బతినగా మరమ్మతులు చేశారు. 1505 వ సంవత్సరంలో భూకంపం సంభవించగా దీనిని సికందర్ లోడి మరమ్మతులు చేపించాడు. తరువాత 1794 వ సంవత్సరంలో మరొక భూకంపాన్ని ఎదుర్కొనగా మేజర్ స్మిత్ అనే ఇంజనీర్ మినార్ యొక్క ప్రభావిత భాగాలను మరమ్మతులు చేశాడు.

ఈ మినార్ ఎందుకు కట్టారనేదానిపై భిన్న కధనాలున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ నగరాన్ని పర్యవేక్షించేందుకు మరియు శత్రువుల దాడి కనిపెట్టేందుకు నిఘా కోసం కట్టి వుంటారని అధికులు భావిస్తుంటారు. బాగ్దాద్‌ నుంచి వచ్చిన గురువు ఖ్వాజా భక్తియార్‌ కాకి గౌరవార్థం నిర్మించారని మరో కథనం కూడా ప్రాచుర్యం‌లో ఉంది.

కుతుబ్ మినార్ నిర్మాణం:

కుతుబ్ మినార్ ఇండో-ఇస్లామిక్ ఆఫ్ఘన్ నిర్మాణానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ మినార్‌ని 73 మీటర్ల అంటే 239 అడుగుల పొడవుతో పెరుగుతున్న శంఖాకార టవర్ వలె అయిదు అంతస్తుల్లో నిర్మించినారు. మొదటి మూడు అంతస్తులు ఎర్ర ఇసుకరాయితో నిర్మించగా నాల్గవ మరియు ఐదవ అంతస్తులు పాలరాయి మరియు ఇసుకరాయితో కట్టించారు. మినార్ గోడల పై పవిత్ర ఖురాన్లోని సూక్తులు వ్రాసియున్నారు. మినార్ చుట్టూ వివిధ శాసనాలు ఉన్నాయి. మినార్ కింది భాగం‌లో 47 అడుగులు ఉండగా, పైకి వెళ్ళేకొద్ది తగ్గుతూ చివరకు 9 అడుగులు ఉంటుంది. మినార్ పైకి చేరాలంటే 379 మెట్లు ఉన్నాయి. మినార్ లోపల మేడ మీదకు వెళ్లడం ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. డిసెంబరు 4, 1981 న విద్యుత్ ప్రమాదం వల్ల జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించిన కారణంగా అప్పటి నుంచి టవర్ లోపలికి ప్రజలను అనుమతించడం లేదు.

కుతుబ్ మినార్ నీడ మాయం అయ్యే రోజు:

కుతుబ్ మినార్‌ నిర్మాణం‌లో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతీ సంవత్సరం జూన్ 22న ఈ కుతుబ్ మినార్ నీడ మాయం అయిపోతుంది. దీనికి కారణం ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉండి మరియు 5 డిగ్రీలు వంపు కలిగి వుండటం వలన భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడటం లేదు.

కుతుబ్ మినార్ వద్ద చూడవలసిన ఇతర ఆకర్షణలు:

కుతుబ్ కాంప్లెక్స్‌‌‌లో భాగమైన కుతుబ్ మినార్ చుట్టుప్రక్కల చూడదగిన కట్టడాలున్నాయి.

ఇనుప స్థంభం (ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ):
క్రీ.శ 400 చంద్ర గుప్త II విక్రమాదిత్య చేత నిర్మించబడిన 7 మీటర్ల ఎత్తుగల ఇనుప స్తంభం ప్రత్యేక ఆకర్షణ. తుప్పు రహిత లోహ మిశ్రమంతో తయారు చేసిన ఈ స్తంభం “ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ” అనే పేరుతో ప్రసిద్ధిపొందింది. దాదాపు 1600 సంవత్సరాల నుండి ఎండ, వాన, మంచు వంటి కఠినమైన వాతావరణ పరిస్థితులని తట్టుకొని తుప్పు పట్టకుండా ఈ నాటి లోహ శాస్త్రజ్ఞులని సైతం ఆశ్చర్యచకితులని చేస్తున్నది. దీని ఎత్తు 7.21 మీ (23 అడుగులు 8 అంగుళాలు) కాగా, వ్యాసం 40 సెం.మీ వుంది. దీని బరువు ఆరు టన్నుల (13,228 పౌండ్లు) కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ లోహ నిర్మాణంలో వాడిన రసాయనిక ధర్మాల వివరాలను ఇప్పటికి ఎవ్వరూ ఖచ్చితంగా కనిపెట్టలేకపోవటం, మన ప్రాచీన భారతీయ లోహ విజ్ఞాన శాస్త్ర ఉన్నతికి మరియు నాటి పనివారి అద్బుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు:
కుతుబ్ కాంప్లెక్స్ ప్రాంగణం‌లో గల ఈ మసీదు ఢిల్లీలోని అతి ప్రాచీన మసీదుల్లో ఒకటి. ఈ మసీదు చాలా వరకు శిథిలమైపోయినది.

అలై దర్వాజా:
కుతుబ్ కాంప్లెక్స్ సముదాయంలో గల కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు కి ప్రవేశ మార్గం గా ఉపయోగించబడిన గుమ్మటం గల ఈ చిన్న చతురస్రాకార భవనం అలై దర్వాజా గా ప్రసిద్ధి చెందింది. ఈ నిర్మాణం కుతుబ్ మినార్‌‌కి వెనక భాగం‌‌లో ఉంది.

అలై మినార్:
అలై మినార్ ఒక అసంపూర్ణ కట్టడం. కుతుబ్ మినార్‌‌కి రెట్టింపు ఎత్తులో కట్టాలనే ఆలోచనతో అల్లావుద్దీన్‌ ఖిల్జీచే ప్రారంభించబడిన ఈ నిర్మాణం అతని మరణంతో 88 అడుగులు వద్దే ఆగిపోయింది.

ఇమాం జామిన్ సమాధి:
సికందర్ లోడి పరిపాలనా కాలంలో ఈ మసీదు లో నివసించిన టర్కీ దేశస్థునికి ఈ సమాధి అంకితం చేయబడినది. ఈ సమాధి అలై దర్వాజా పక్కనే ఉంది.

అల్లావుద్దీన్‌ ఖిల్జీ సమాధి మరియు మదర్సా:
క్రీ.శ 1296 నుంచి 1316 సంవత్సరాల మధ్య కాలంలో ఢిల్లీ‌కి రెండవ సుల్తాన్‌గా అల్లావుద్దీన్‌ ఖిల్జీ పరిపాలించాడు. కుతుబ్ కాంప్లెక్స్ సముదాయం‌లోనే అల్లావుద్దీన్‌ ఖిల్జీ యొక్క సమాధి మరియు అతనిచే నిర్మించబడిన మదర్సా ఉన్నాయి.

ఇల్తుమిష్ సమాధి:
బానిస రాజవంశ పరిపాలకుడు అయిన ఇల్తుమిష్ సమాధి కూడా ఈ కుతుబ్ కాంప్లెక్స్ ప్రాంగణం‌లోనే ఉంది.

సుల్తాన్ ఘడి:
ఇల్తుమిష్ పెద్ద కొడుకు నసీర్-ఉద్-దీన్ సమాధి నిర్మాణమే ఈ సుల్తాన్ ఘడి. ఇది క్రీ.శ. 1231 సంవత్సరంలో నిర్మించబడినది. అసాధారణమైన ఆకృతితో చావళ్ళతో కోటని తలపించే ఈ కట్టడం హిందూ ముస్లిం భక్తులచే ఒక పవిత్ర దర్గా వలే పూజలు అందుకుంటుంది.

కుతుబ్ మినార్‌కు సమీపంలోని ఇతర ఆకర్షణలు:

  • ఎర్ర కోట
  • హుమయూన్ సమాధి
  • జామా మసీదు
  • సఫ్దర్‌జంగ్ సమాధి
  • ఇండియా గేట్
  • అక్షరధామ్
  • జంతర్ మంతర్

సందర్శన సమయం:

  • కుతుబ్ మినార్‌ను ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శించవచ్చును.
  • కుతుబ్ మినార్ వద్ద ప్రవేశ ఛార్జీలు మరియు ఫీజులు:
  • భారతీయ సందర్శకుల ప్రవేశ టికెట్ ౩౦ రూపాయలు.
  • విదేశీ సందర్శకులకు 500 రూపాయలు.
  • 15 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు ఉచితంగా ప్రవేశించవచ్చు.

కుతుబ్ మినార్‌కు ఎలా వెళ్ళాలి?

కుతుబ్ మినార్ భారత రాజధాని నగరమైన ఢిల్లీ యొక్క దక్షిణ భాగం వైపు మెహ్రౌలి వద్ద ఉంది. బస్సులు, టాక్సీలు, ఆటోలు, ఆన్‌లైన్ క్యాబ్ మరియు మెట్రో రైలు ద్వారా కుతుబ్ కాంప్లెక్స్ చేరుకోవచ్చు.

సమీప మెట్రో స్టేషన్:
మెట్రో రైలు ద్వారా కుతాబ్ మినార్ మెట్రో స్టేషన్ వద్ద దిగి అక్కడ నుండి 6 నిమిషాల దూరంలో ఉన్నందున మీరు నడక ద్వారా లేదా ఆటో ద్వారా చేరవచ్చు,

సమీప బస్ స్టాండ్:
ఢిల్లీ NCR (National Capital Region) లో ఎక్కడి నుండైనా మీరు DTC (Delhi Transport Corporation) బస్సుల ద్వారా స్మారక చిహ్నం యొక్క ప్రవేశ ద్వారం వెలుపల ఉన్న కుతుబ్ మినార్ బస్ స్టాండ్‌కు చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం