భారతీయ అమర సైనికుల స్మృతి చిహ్నం ఇండియా గేట్

Image courtesy: Asif Methar (www.pexels.com)

ఇండియా గేట్ (India Gate) న్యూ ఢిల్లిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటి. నేను వృత్తి రీత్యా గుర్గావ్‌లో ఉన్నప్పుడు ఇండియా గేట్ దర్శించడం జరిగినది. ఈ పోస్ట్‌‌‌లో ఇండియా గేట్ విశేషాలు తెలుపుతాను.

ఇండియా గేట్‌ చరిత్ర:

భారతదేశపు రాజధాని నగరం న్యూ ఢిల్లిలోని రాజ్‌పథ్‌లో గల ఈ స్మృతి చిహ్నాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరియు మూడవ ఆం‌గ్లో ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఆంగ్లేయుల తరపున పోరాడుతూ అసువులు బాసిన 90 వేల మంది భారతీయ అమర జవాన్ల జ్ఞాపకార్థం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం వారు కట్టించారు. బ్రిటీష్ ఇంజనీరు అయిన సర్ ఎడ్విన్ లుటియెన్స్ ఇండియా గేట్‌ స్మారక కట్టడాన్ని రూపకల్పన చేయగా, తేది 10-02-1921 న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌ పునాదిరాయి వేసాడు. 10 సంవత్సరాల అనంతరం తేది 12-02-1931 న లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రారంభం‌లో ఈ స్మృతి చిహ్నాన్ని 'ఆలిండియా మెమోరియల్ వార్'గా పిలిచేవారు.


ఇండియా గేట్‌ డిజైన్:

ఈ కట్టడం పారిస్‌లో గల ‘ఆర్చ్-డీ-ట్రయంఫ్’ (Arc de Triomphe) నిర్మాణ శైలి పోలి ఉంటుంది. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన ఎరుపు రంగు గ్రానైట్‌తో ఈ స్మారక కట్టడాన్ని నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు ఆప్ఘన్ యుద్ధంలో మరణించిన అమర జవానుల పేర్లు వారి గౌరవార్ధం ఈ నిర్మాణంపై లిఖించబడ్డాయి. 138 అడుగుల (42 మీటర్లు) ఎత్తుతో నిర్మించిన ఈ స్మృతి చిహ్నానికి పై భాగంలో INDIA అనే పదం క్రింద ఈ దిగువున చూపిన పదాలు స్పష్టంగా కనిపించేటట్లు రాయిపై చెక్కబడింది.
TO THE DEAD OF THE INDIAN ARMIES WHO FELL AND ARE HONOURED IN FRANCE AND FLANDERS MESOPOTAMIA AND PERSIA EAST AFRICA GALLIPOLI AND ELSEWHERE IN THE NEAR AND THE FAR EAST AND IN SACRED MEMORY ALSO OF THOSE WHOSE NAMES ARE HERE RECORDED AND WHO FELL IN INDIA OR THE NORTH-WEST FRONTIER AND DURING THE THIRD AFGHAN WAR


ఇండియా గేట్ వద్ద ప్రస్తుతం ఒక ఖాళీ గోపుర మండపం ఉంది. ఇక్కడ 1936 వ సంవత్సరములో మరణించిన భారత చక్రవర్తి కింగ్ జార్జ్ V కి నివాళిగా అప్పటి ప్రభుత్వం ఈ గోపుర మండపం నందు జార్జ్ విగ్రహం పెట్టారు. కానీ స్వాతంత్రం అనం‌తరం 1968 వ సంవత్సరం ఈ విగ్రహాన్ని తొలగించి ఢిల్లిలోని కారోనేషన్ పార్కుకి తరలించారు.

ఇండియా గేట్ చుట్టూ ఉన్న పచ్చని పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్లు, సుందరమైన పార్కులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చల్లని సాయంత్రం గాలి ప్రతిరోజూ వందలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది. అంతేకాక రాత్రి పూట ఏర్పాటు చేసిన దీపపు కాంతుల వెలుగులో ఇండియా గేట్ నయనమనోహరంగా ఉంటుంది.

అమర్ జవాన్ జ్యోతి (లేదా అమర సైనికుడి జ్వాల):


1971వ సంవత్సరం‌లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో (బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ధం) అమరులైన భారత జవానుల త్యాగాలకు గుర్తుగా, రివర్స్డ్ L1A1 సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ పోలిన నల్ల పాలరాయి స్తంభంతో కూడిన నిర్మాణం యుద్ధ జవాను హెల్మెట్‌తో కప్పబడి, నాలుగు శాశ్వత కాంతి (జ్యోతి) జ్వాలలతో ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేసిఉంది. ‘అమర్ జవాన్ జ్యోతి’గా పిలవబడే దీనిని అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఇరవై మూడవ భారత రిపబ్లిక్ దినోత్సవం తేది 26-01-1972 న ప్రారంభించారు. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని అమర్ జవాన్ జ్యోతికి నివాళులు అర్పించిన తరువాత రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి భవన్ నుండి ప్రారంభమై ఇండియా గేట్ చుట్టూ వెళుతుంది.


ఇండియా గేట్‌ వద్ద గల ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు:

  • నేషనల్ వార్ మెమోరియల్ (750 m)
  • చిల్డ్రన్స్ పార్క్ (900 m)
  • నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (1.4 m)
  • పురాణా ఖిల్లా (2.2 km)
  • నేషనల్ సై‌న్స్ సెంటర్ (2.5 km)
  • జంతర్ మంతర్ (2.9 km)
  • రాష్ట్రపతి భవన్ (2.7 km)
  • లోధి గార్డెన్ (2.9 km)
  • కన్నాట్ ప్లేస్ (4 km)
  • రాజ్ ఘట్ (5.2 km)
  • చాంధినీ చౌక్ (5.6 km)
  • జమా మసీద్ (5.8 km)
ఇవే కాకుండా ఇండియా గేట్‌కి ఒక కిలో మీటర్ దూరం‌లో గల ఆంధ్రా భవన్ నందు భోజనం చాలా బాగుంటుంది. ఇండియా గేట్‌ వెళ్ళినప్పుడు ఇక్కడ తప్పక ఒకసారి రుచి చూడండి.

ఇండియా గేట్‌కి ఎలా వెళ్ళాలి ?

దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లికి దేశం‌లోని అన్ని ప్రధాన ప్రాంతాలతో రోడ్డు, రైలు, వాయి మార్గాల ద్వార అనుసంధానించబడి వున్నది.

ఢిల్లీ మెట్రో స్టేషన్ ద్వారా:
మెట్రో రైలు ద్వారా ఇండియా గేట్ చూడవలసిన వారు ‘బారాఖంబా’ మెట్రో స్టేషన్‌లో దిగి. అక్కడి నుంచి ఆటో లేదా టాక్సీలో 10 నిమిషాలు ప్రయాణిస్తే ఇండియా గేట్ చేరుకోవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం