ఖాండ్వాలోని దాదా ధునివాలే దర్బార్‌‌


భారతదేశం ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులకు ప్రసిద్ధి. అటువంటి గురువులలో ఒకరిగా పేరొందిన ధునివాలే దాదాజి యొక్క సమాధి మందిరం వెలసియున్న ‘దాదా ధునివాలే దర్బార్’ దర్శించడానికి మేము ఖాండ్వా పట్టణానికి వెళ్ళాము. ఖాండ్వాకి చేరుటకు మా స్వస్థలం అయిన కావలి నుండి నేరుగా ప్రయాణ మార్గం లేకపోవుట వలన మేము కావలి నుండి నవజీవన్ ఎక్స్‌‌‌ప్రెస్‌‌ ద్వారా మహారాష్ట్రలోని అకోలా జంక్షన్ చేరుకొని, అక్కడ నుంచి మరొక రైలు ద్వారా ఖాండ్వా పట్టణం చేరుకొన్నాము. ఈ బ్లాగ్ పోస్టు ద్వారా ఖాండ్వా విశేషాల గురించి చెపుతాను.


ఖాండ్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిమార్ ప్రాంతం‌లో ఉన్న ఒక ప్రాచీన మరియు చారిత్రక పట్టణం. ఇది ఖాండ్వా జిల్లా యొక్క పరిపాలనా కేంద్రం. ఖాండ్వా జిల్లాను గతం‌లో తూర్పు నిమార్ జిల్లాగా పిలిచేవారు. ఇక్కడ పలు ప్రాచీన ఆలయాలు మరియు జైన మందిరాలు ఉన్నాయి. 12 వ శతాబ్దం‌లో జైన మతం పట్ల విశ్వాసం పెరగడం వలన ఖాండ్వా జైన మత ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధిచెందింది. 1818 వ సంవత్సరం‌లో ఖండ్వా జిల్లాను మరాఠీ పాలకుల నుండి బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక బ్రిటీష్ పాలనలో ఖాండ్వా నిమార్ ప్రాంతంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా వర్ధిల్లింది. బాలీవుడ్ చలనచిత్ర నటుడు అశోక్‌కుమార్ మరియు ఆయన సోదరుడు సినీ గాయకుడు కిషోర్‌కుమార్ ఖాండ్వాలో జన్మించారు.

పురాణ ప్రాశస్థం:

ఈ పట్టణానికి ఖాండ్వా అనే పేరు ‘ఖాండవ వనం‌’ నుండి ఉద్భవించింది. మహా భారతం‌లో అర్జునుడు ఖాండవ వన దహనం చేసినట్లు చెప్పబడిన ప్రాంతం ఇదే. రామాయణం‌లో కూడా ఈ ప్రదేశం గురుంచి ప్రస్థావన ఉంది. వనవాస కాలం‌లో శ్రీ రాముడు తన భార్య అయిన సీతా దేవి దాహం తీర్చుటకు, తన బాణములను నాలుగు వేర్వేరు దిశలో ప్రయోగించగా, వివిధ ప్రాంతాల్లో నాలుగు కుండాలు (అంటే చెరువులు) ఏర్పడినట్లు చెపుతారు. అవే పద్మ కుండ్, భీం కుండ్, సూరజ్ కుండ్ మరియు రామేశ్వర్ కుండ్.

అధ్యాత్మిక గురువు అయినటువంటి ధునివాలే దాదాజి సమాధి మందిరం వెలసియున్న దాదా ధునివాలే దర్బార్‌ని దర్శించడానికి భక్తులు ఖాండ్వాకి తరలి వస్తుంటారు. ఇక్కడ దాదాజి సమాధితో పాటు అతని శిష్యుడు చోటే బాబా సమాధి కూడా దర్శించవచ్చు. దాదా ధునివాలే దర్బార్‌ ఖాండ్వా బస్ స్టాండ్ నుండి 2 కిలో మీటర్ల దూరంలో ఉంది. గురు పౌర్ణిమ సందర్బముగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ధునివాలే దాదాజి సమాధి మందిరం దర్శించుకొంటారు.

ధునివాలే దాదాజి గురించి:

వీరి అసలు పేరు, తల్లిదండ్రుల గురించి సరియైన ఆధారాలు లేవు. వీరు నర్మదా నది తీరం‌లో తిరుగుతూ ఎల్లప్పుడూ ధుని వెలిగించి దాని ముందు కూర్చిని ఉండటం వలన భక్తులు అతనిని ధునివాలే తాతా అంటే ధునివాలే దాదాజి (హిందీలో దాదా అంటే తాత అని అర్థం) అని పిలిచేవారు, వీరిని భక్తులు శివ స్వరూపం‌గా భావించి ‘శ్రీ కేశవనంద్‌జీ మహారాజ్’ అని పిలుస్తుంటారు. వీరినే భక్తులు ‘బడే బాబా’ అని కూడా పిలిచేవారు. ధునివాలే దాదాజి వారు తన జీవితం‌లో ఎన్నో విచిత్ర సంఘటనలు, మహిమలు చూపారు. వీరు తన జీవితం‌లో 3 సార్లు తన దేహాన్ని వదిలి మరలా బ్రతికి వచ్చినట్లు చెపుతారు. మొదటిసారి వీరు నర్మదా నదీ తీరం‌లోని అడవిలో మరణించినట్లు వారి శిష్యులు కనుగొని సంస్కారాలు చేసిన కొంతకాలం తరువాత ‘హోషంగాబాద్’ (Hoshangabad) అనే ఊరిలో తన శిష్యులకు కనిపించారు. మరొకసారి ఒక బావిలో పడి మరణించగా, శిష్యులు దాదాజిని సమాధి చేసారు. కొన్ని రోజుల తరువాత దాదాజి ‘సోహగ్‌పూర్’ (Sohagpur) అనే ఊరిలో తిరిగి కనపడ్డారు. చివరగా నర్మదా నది పుష్కరాల సమయం‌లో నదిలో పడి మరణించగా, శిష్యులు 3 రోజులు వేచిచూసి దాదాజి పార్ధీవ శరీరాన్ని దహనం చేసారు. ఒక నెల రోజుల తరువాత దాదాజి ‘సిరిసిరిసిందూర్’ అనే ఊరిలో తన శిష్యులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత తన చివరి శ్వాస వరకు ఖాండ్వా పట్టణం‌లో నివసించారు. తేది 03-12-1930 న భక్తులకు చెప్పి తన దేహాన్ని వదిలి సమాధిలోకి వెళ్లారు. ఈ సమాధి మందిరాన్ని ‘దాదా ధునివాలే దర్బార్‌’ అని పిలుస్తారు. ఈ సమాధి మందిరం ఖాండ్వా పట్టణం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో కలదు.


ఛోటే దాదాజీ గురించి:

రాజస్థాన్‌ రాష్ట్రం‌లోని దిద్వానా అనే గ్రామం నుండి భన్వర్‌లాల్ అనే భక్తుడు దాదాజీని దర్శించుకునేందుకు వచ్చారు. దాదాజీని చూసినంతనే ఆయనకు దాసుడై ఆయన పట్ల పూర్తి అంకితభావంతో దాదాజి పాదాల చెంతనే కాలం గడపటం మొదలుపెట్టాడు. వీరిని భక్తులు శ్రీ విష్ణువుగా భావించి ‘శ్రీ హరినంద్‌జీ మహారాజ్’ అని పిలిచేవారు. వీరినే ‘చోటే బాబా’ లేదా ‘చోటే దాదాజీ’ అని కూడా పిలిచేవారు. దాదా దునివాలే సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన మార్గంలోనే నడిచారు. ఎంతో ఉదారస్వభావి అయిన చోటే దాదాజీ అనారోగ్య కారణంగా 1942 వ సంవత్సరం‌లో మరణించగా, ఖాండ్వాలో దాదాజి సమాధి ప్రదేశానికి ప్రక్కనే ఉత్తరం దిక్కున సమాధి చేసారు.

ఖాండ్వాలో ఇతర ప్రధాన ఆకర్షణలు:

ఘంటా ఘర్‌:
ఖాండ్వా పట్టణం నడిబొడ్డులో బ్రిటిష్ వారి పాలనలో 1884 వ సంవత్సరములో నిర్మించబడిన ప్రసిద్ధ కట్టడం ‘ఘంటా ఘర్’ ఇప్పటికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఘంటా ఘర్‌ను ‘ముల్తాన్ క్లాక్ టవర్’ అని కూడ పిలుస్తారు.

జిల్లా కలెక్టర్ బిల్డింగ్:
ఖాండ్వా పట్టణంలో బ్రిటిష్ వారి పాలనలో 1919 వ సంవత్సరములో నిర్మించబడిన ప్రసిద్ధ కట్టడం ‘జిల్లా కలెక్టర్ బిల్డింగ్’ ఈ రోజుకి కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ భవనం 15000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఆ కాలంలో అనేక అనుబంధ కార్యాలయములకు స్థానం కల్పించేందుకు నిర్మించారు. ఈ భవనం చుట్టూ దట్టమైన చెట్ల పెంపకం ఉండుట వల్ల ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ నుండి కేవలం 1 కిలో మీటరు దూరంలో ఉంది.

గౌరీ కుంజ్:
విలక్షణ గాయకుడైన కిషోర్ కుమార్ మరియు అతని సోదరుడు బాలివుడ్ సినిమా నటుడైన అశోక్ కుమార్ ఖాండ్వాలో జన్మించారు. కిషోర్ కుమార్ జన్మించిన ప్రదేశాన్ని అతని గౌరవార్ధం వారి తల్లిదండ్రులు గౌరి దేవి మరియు కున్జిలాల్ గంగోపాధ్యాయల పేరు మీదుగా ‘గౌరీ కుంజ్’ అనే స్మారక చిహ్నం నిర్మించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ గౌరీ కుంజ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదేశం కళలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఒక వేదిక వలె పనిచేస్తుంది. ఇది రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు నిమిషాల నడక దూరంలో ఉంది.


ఖాండ్వా చుట్టుప్రక్కల చూడవలసిన ప్రదేశాలు:

ఖాండ్వా పరిసర ప్రాంతాలలో సందర్శకులు పర్యటించటానికి అనేక ప్రసిద్ధ పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి.

తులజా భవానీ మాత దేవాలయం:
దాదా దర్బార్ సమీపంలో వెలసియున్న తులజా భవానీ మాత దేవాలయం ప్రసిద్దమైనది. పార్వతి దేవి యొక్క అవతారంగా భావించే తులజా భవానీ మాత ఈ ఆలయంలో ప్రధాన దేవత. ఈ పురాతన ఆలయంతో ముడిపడి అనేక కధనాలు ఉన్నాయి. శ్రీ రాముడు తన వనవాస సమయంలో ఈ ఆలయంలో పూజలు చేసారని చెపుతారు. నవరాత్రి సందర్భంగా ఇక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భవాని మాతను సందర్శించుకుని తరిస్తారు.

శ్రీ ఓంకార మాంధాత:
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటయిన ఓంకారేశ్వర్ క్షేత్రం ఖాండ్వాకు 89 కిలో మీటర్ల దూరం‌లో ఉంది. ఇక్కడ స్వామి వారిని ఓంకార మాంధాతగా పిలుస్తారు. నర్మదా, కావేరీ నదీ సంగమ ప్రాంతమయిన ఈ దీవి హిందువులు ప్రణవ నాదంగా పిలిచే ఓం‌కారాన్ని తలపిస్తుంది.

అసిర్గర్హ్ ఫోర్ట్:
సాత్పురా పర్వత శ్రేణిలో ఖాండ్వా పట్టణంకు 69 కిలో మీటర్ల దూరంలో ఉన్న అసిర్గర్హ్ కోటను అహిర్ రాజవంశానికి చెందిన అస్సా అహిర్ నిర్మించెను. ఈ కోటను ప్రారంభంలో ఆసా అహిర్ ఘుర్ అని పిలిచేవారు. కానీ కాలానుగుణంగా అసిర్గర్హ్ ఫోర్ట్‌‌‌గా మారింది. ఈ కోట నిర్మాణ శైలి పర్షియన్, ఇస్లామిక్, టర్కిష్ మరియు భారతీయ నిర్మ్మాణ శైలుల సమ్మేళనంగా పేర్కొనవచ్చు. కోట లోపల బాల్కనీలు, మినార్లు మరియు సమాధులను చూడవచ్చు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఔత్సాహికులు ఈ కోటను చూడటానికి వస్తుంటారు.

ఇందిరా సాగర్ ఆనకట్ట:
ఖాండ్వా పట్టణం‌నకు 75 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇందిరా సాగర్ ఆనకట్ట ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పవచ్చు. ఈ ఆనకట్ట 92 మీటర్ల ఎత్తు, 653 మీటర్ల పొడవుతో ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జల విద్యుత్ ప్రాజెక్టుగా ప్రసిద్ధిగాంచినది. ఈ బహుళార్ధసాధక ఆనకట్టను నర్మదా నదిపై నర్మదా నగర్ వద్ద భారత దేశ మాజి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీచే నిర్మించబడింది. ఈ అందమైన ఆనకట్టను చూడాలనుకొనే పర్యాటకులు ఖాండ్వా రైల్వే స్టేషన్ నుండి లేదా బీర్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడకు చేరవచ్చు.

ఖాండ్వాలో వసతి:

ధునివాలే దర్బార్‌ని దర్శించడానికి వచ్చే భక్తులకు ఆలయ ట్రస్ట్ వారి వసతి గృహాలు నామమాత్రపు ధరలతో కలవు. వసతి గృహాలు శుభ్రంగా ఉంటాయి. భోజన సౌకర్యం కలదు. ఇవే కాకుండా ఖాండ్వా నందు వసతికి అనేక లాడ్జిలు, ధర్మశాలలు కలవు. ఇక్కడ ఉత్తర భారతీయ వంటకాలు మాత్రమే లభిస్తాయని గమనించగలరు.


ఖాండ్వా ఎలా వెళ్ళాలి:

ఖాండ్వాను రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం:
ఖాండ్వా దేశం‌లోని ప్రధాన పట్టణాలతో అనుసంధానమై ఉంది. బస్సులు లేదా ప్రవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం:
ఖాండ్వా ప్రధాన రైలు జంక్షన్‌గా ఉండటం వలన దేశం‌లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కలకత్తా, కొచిన్, బెంగుళూర్, హైదరాబాద్, జమ్మూ, పాట్నా, భూపాల్, ఇండోర్ వంటి ముఖ్యమైన ప్రదేశాల నుండి తరచుగా రైళ్లు ఉన్నాయి.

విమాన మార్గం:
ఖాండ్వా సమీప విమానాశ్రయం ఇండోర్‌లోని దేవీ అహల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇండోర్ నుండి ఖాండ్వాకు 141 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం