ఉడుపి సమీపంలోని అందమైన ద్వీపాల సమూహం సెయింట్ మేరీస్ ద్వీపం


సెయింట్ మేరీస్ ద్వీపం ఉడుపి సమీపంలోని మల్పే బీచ్‌కు ఉత్తరాన ఉన్న చిన్న అందమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీపం‌లోని తెల్లని ఇసుక బీచ్‌లు, ఏకరాతి స్ఫటికాకార శిలలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. సాధారణంగా యాత్రికులు ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఉడుపికి దగ్గరలో వున్న ఈ ద్వీపాన్ని సందర్శిస్తుంటారు. ఉడుపి ప్యాకేజీలలో భాగంగా సందర్శించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

అరేబియా సముద్రం‌లోని ఈ ద్వీపం కోకోనెట్ ఐల్యాండ్, నార్త్ ఐల్యాండ్, సౌత్ ఐల్యాండ్ మరియు దర్యాబహదూర్‌గర్ ఐల్యాండ్ అనే నాలుగు ద్వీపాల సమూహం. ఈ ద్వీపం అంతటా చెల్లాచెదురుగా ఉన్న ప్రత్యేకమైన స్ఫటికాకార రాళ్ళు ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి. అగ్ని పర్వతం నుండి వెలువడిన లావా వలన ఇటువంటి రాళ్ళు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ స్ఫటికాకార శిలలపై నిలబడి సూర్యాస్తమయాన్ని వీక్షించడం ద్వీపంలో అత్యంత ఆకర్షణీయమైన అనుభవాలలో ఒకటి.

భౌగోళిక ప్రాముఖ్యత:

సుమారు 88 మిలియన్ సంవత్సరాల క్రితం మడగాస్కర్ భారత భూభాగం‌లో కలిసి వుండేవి. కాలక్రమం‌లో మడగాస్కర్ భారత భూభాగం నుంచి వేరుపడిన సమయం‌లో ఈ దీవులు ఏర్పడినట్లు చెపుతారు.


చారిత్రక ప్రాముఖ్యత:

1498 సంవత్సరములో పోర్చుగీసు నావికుడు వాస్కో-డ-గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే సమయంలో కప్పడ్ బీచ్ (కాలికట్ సమీపంలో) చేరుకోవడానికి ముందుగా ఈ ద్వీపానికి చేరుకున్నాడని చెబుతారు. వాస్కో-డ-గామా ఈ ద్వీపాలలో ఒకదానికి పోర్చుగీస్ భాషలో “ఓ పాద్రావో డి శాంటా మారియా” అని నామకరణం చేశాడు. ఆ పేరు నుండే ఈ ద్వీపానికి ప్రస్తుత పేరు వచ్చింది.

సెయింట్ మేరీస్ ద్వీపాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం:

ఈ ద్వీపాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి జనవరి మధ్య కాలం అనుకూలంగా ఉంటుంది, ఈ నెలల్లో ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు బీచ్‌కి వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి.

సెయింట్ మేరీస్ ద్వీపం చుట్టూ సందర్శనా స్థలాలు:

ఉడుపిలోని శ్రీ కృష్ణాలయం, దర్యాబహదూర్‌ఘర్ కోట, వడభండేశ్వర ఆలయం మరియు మల్పే బీచ్‌లు సెయింట్ మేరీస్ ద్వీపం చుట్టూ వున్న ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

వాటర్ స్పోర్ట్స్:

సెయింట్ మేరీస్ ద్వీపంలో పర్యాటకులకు ఇక్కడి వాటర్ స్పోర్ట్స్ మరిచిపోలేని అనుభూతినిస్తాయి.

సెయింట్ మేరీస్ ద్వీపంలో ఆహారం:

ఈ ద్వీపం జనావాసాలు లేనిది కావున పర్యాటకులు స్నాక్స్, డ్రింక్స్ తమ వెంట తీసుకువెళ్ళటం ఉత్తమం.

సెయింట్ మేరీస్ ద్వీపాన్ని సందర్శించు పర్యాటకులకు సూచనలు:

ఈ ద్వీపంలో రాత్రి పూట ఉండటానికి అనుమతినివ్వరు. అందువలన పర్యాటకులు తమ సౌకర్యం కొరకు అవసరమైన మందులు మరియు ఎండతీవ్రత తట్టుకోవడం కోసం సన్‌స్క్రీన్ లోషన్స్, టోపీలు, త్రాగునీటిని తీసుకువెళ్లండి.

సెయింట్ మేరీస్ ద్వీపానికి ఎలా చేరుకోవాలి:


సెయింట్ మేరీస్ ద్వీపం ఉడుపిలోని మల్పే బీచ్‌ తీరం నుండి 4 మైళ్ల దూరంలో ఉంది. ఈ ద్వీపంలోకి ప్రవేశించడానికి పడవలు మాత్రమే ఏకైక మార్గం. ఈ ద్వీపానికి చేరుకోవాలంటే ముందుగా ఉడుపి చేరుకొని అక్కడి నుంచి మల్ఫే పోర్ట్ చేరుకోవాలి. మల్పేకి చేరుకోవడానికి ఆటోరిక్షాలు లేదా క్యాబ్ సౌకర్యం ఉన్నది. మల్ఫే పోర్ట్ నుండి ఫెర్రీ సేవల ద్వారా మాత్రమే ఈ ద్వీపం చేరుకోవచ్చు. సుమారు 25-30 నిమిషాల సమయం‌లో సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం తరువాత సెయింట్ మేరీస్ చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలే కాకుండా స్పీడ్ బోట్ సదుపాయం కూడా ఉన్నది.

ఫెర్రీ రైడ్‌ల సమయాలు :
ఫెర్రీ రైడ్‌లు సాధారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయం‌లో ప్రారంభమవుతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో ఇది మూసివేయబడుతుంది.

ఫెర్రీ రైడ్‌ ఖర్చు :
ఫెర్రీ రైడ్‌కు ఒక్కొక్కరికి సుమారుగా 300 నుంచి 400 ఖర్చు అవుతుంది. ఫెర్రీ పూర్తిగా నిండిన తర్వాత మాత్రమే రైడ్ ప్రారంభమవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం