మైసూరు రాజ కుటుంబీకుల ఉద్యానవనం: బృందావన గార్డెన్స్



పర్యాటకులకు గమ్యస్థానం అయినటువంటి మైసూరు నగరం‌లో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మైసూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన గార్డెన్స్‌ను మైసూరుకు వచ్చే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రాంతాలలో ఒకటి.



మైసూరును చూడటానికి వచ్చే యాత్రికులు నగరానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ (KRS డ్యామ్) తీరాన ఉన్న ఈ ఉద్యానవనం విశేష ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉద్యానవనాన్ని సందర్శించటానికి ప్రతి సంవత్సరము సుమారు ఇరవై లక్షలు పైగా యాత్రికులు వస్తుంటారని అంచనా.



ఒకప్పుడు కృష్ణ రాజేంద్ర టెర్రస్ గార్డెన్స్ అని పిలిచే ఈ అందమైన ఉద్యనవనాన్ని కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ దిగువున కృష్ణరాజ వడయార్‌చే 1927 సంవత్సరంలో ప్రారంభించబడి 1932 వ సంవత్సరం‌లో పూర్తిచేయబడినది. కృష్ణ రాజ సాగర్ డ్యాంను భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యం‌లో కృష్ణరాజ వడయార్‌ - IV పేరు మీదుగా నిర్మించగా, డ్యాం క్రింది ప్రాంతం‌లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో కల ఈ ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ సారధ్యం‌లో కట్టించెను.


ప్రకృతి ప్రేమికులు బృందావనంలోని అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్‌లు, సరస్సులు కల ఈ ఉద్యానవనం అహ్లాదకరమైన సంధ్యా సమయాన్ని ఆస్వాదించవచ్చు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఉద్యానవనములోని రంగు రంగుల విద్యుదీప కాంతులతో పాటు సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది. వీటితో పాటు ఇక్కడి సరస్సులలో బోట్ రైడ్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ఉద్యానవనం మెయిన్ గేట్ ఏరియా, సౌత్ గార్డెన్స్, నార్త్ గార్డెన్ మరియు చిల్డ్రన్స్ గార్డెన్లుగా వర్గీకరింపబడినది. ఉద్యానవనం‌లోనికి మెయిన్ గేట్ ద్వారా పవేశించగలరు. ఇక్కడ ద్వారానికి ఇరువైపులా గులాబి తోటలు అకట్టుకుంటాయి. సౌత్ గార్డెన్స్ నందు కావేరమ్మ సర్కిల్ నందు కల కావేరీ మాత విగహం కలదు. సౌత్ గార్డెన్స్‌లో కల గ్లాస్ హౌస్ నందు వివిధ రకాల మొక్కలను పర్యాటకులు వారి అభిరుచి మేరకు కొనుగోలు చేయవచ్చును. నార్త్ గార్డెన్స్ నందు మ్యుజికల్ ఫౌంటైన్ షోను తిలకించవచ్చు.



సందర్శన సమయాలు:

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మరియు శని, ఆది వారాలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు సంవత్సరములో ఎప్పుడైనను సందర్శించవచ్చు. ఉద్యానవనం మొత్తం చూసి రావటానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం.



ప్రవేశ రుసుము:

బృందావన గార్డెన్స్ సందర్శించేందుకు ప్రవేశ రుసుం చెల్లించాలి. నేను వెళ్ళినప్పుడు ప్రవేశ రుసుం ఈ విధంగా ఉన్నాయి.
  • పిల్లలకు (5 నుండి 10 సంవత్సరాలు) - రూ. 5/-,
  • పెద్దలకు - రూ. 15/-
  • గార్డెన్స్‌లో అనుమతి లేనిదే కెమెరా వాడరాదు. పెనాల్టీ 50 రూపాయలు.


ఎలా వెళ్ళాలి?

  • రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే మైసూరు నగరం అనుసంధానించబడి ఉన్నది.
  • మైసూరు సిటి బస్టాండు నుండి కె.ఆర్.ఎస్. డ్యాం వరకు అనేక ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు ఎల్లప్పుడూ తిరుగుతుంటాయి.
  • బెంగళూరు నుండి డ్యాం వరకు, మైసూర్ వరకు కూడా కె.ఎస్.ఆర్.టి.సి. బస్సులు నడుస్తుంటాయి.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం