మైసూరు మహారాజుల రాజ సౌధం అంబా విలాస్ ప్యాలెస్


రాజభవనాల నగరంగా ప్రసిద్ధి చెందిన మైసూరును సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన 7 రాజభవనాల్లో అంబా విలాస్ ప్యాలెస్ ఒకటి. దీనినే ‘మైసూరు ప్యాలెస్’ లేదా ‘మైసూరు మహారాజా ప్యాలెస్’ అని కూడా పిలుస్తుంటారు.


మైసూరు మహారాజ కుటుంబీకుల కొరకు ఈ ప్యాలెస్ భవనాన్ని నిర్మించారు. 14 వ శతాబ్దం‌లో నిర్మింపబడిన ఈ భవనం అనేక పర్యాయాలు పునర్మించి ప్రస్తుత ప్యాలెస్ భవనాన్ని నిర్మిచారు. బ్రిటీష్ ఆర్కిటెక్ అయిన హెర్నీ ఇర్విన్‌ సారధ్యం‌లో ఇండో సార్సెనిక్, ద్రవిడ, మొగలుల, రోమన్, మరియు ప్రాచ్య దేశాల నిర్మాణాల శైలిలో 1897 – 1912 సంవత్సరాల మధ్య నిర్మించబడినది. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ 41,47,913/- వ్యయం అయ్యింది. 1912 సంవత్సరములో ప్యాలెస్ నిర్మాణం పూర్తయినప్పటికి, తదనంతర కాలం‌లో ప్యాలెస్ ఆధునీకరణ పనులు జరిగాయి. ఈ ఆధునీకరణ పనులలోనే ప్రజా దర్బార్ నిర్మించారు.




ప్యాలెస్ భవనం తూర్పు దిక్కు అభిముఖంగా ఉంటుంది. రాజ భవనం‌లోనికి ప్రవేశించడానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ప్రవేశ ద్వారాన్ని ‘జయ మార్తాం‌‌డ ద్వారం’ అని, ఉత్తర ప్రవేశ ద్వారాన్ని ‘జయరామ ద్వారం’ అని, దక్షిణ ప్రవేశ ద్వారాన్ని ‘బలరామ ద్వారం’ అని, పశ్చిమ ప్రవేశ ద్వారాన్ని ‘వరాహ ద్వారం’ అని పిలుస్తారు. సాధారణ యాత్రికులను దక్షిణమున గల వరాహ ద్వారం నుండి ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. సందర్శకులు ప్రవేశ రుసుం చెల్లించాలి మరియు చెప్పులతో సందర్శకులను అనుమతించరు (చెప్పులు భద్ర పరుచుటకు అవకాశం ఉంది).





ప్యాలెస్‌లో ప్రవేశించిన సందర్శకులు ప్యాలెస్ అందాన్ని చూసి మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మూడు అంతస్తుల కల ఈ ప్యాలెస్ నిర్మాణం‌లో మూడు గోపురాలకు గ్రే గ్రానైట్ ఉపయోగించారు. ప్యాలెస్ పైకప్పులు, స్తంభాలను ముడి ఇనుము ఉపయోగించారు. ప్యాలెస్ నిర్మాణం‌లో ఉపయోగించిన అద్దాలు, మార్బుల్ గ్రానైట్‌లు మరింత శోభను చేకూర్చాయి. ప్యాలెస్‌లో మైసూరు మహారాజుల కుటుంబ సభ్యుల చిత్ర పటాలు, వారు వాడిన దుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, వారు సేకరించిన అందమైన పెయిం‌టింగ్స్, అరుదైన కళాఖండాలు వీక్షించవచ్చు. ప్యాలెస్‌లో దర్బార్ హాలు, అంబా విలాస్, 84 కిలోల స్వర్ణ అంబారీ, కళ్యాణ మండపం సందర్శకులను ఆకట్టుకుంటాయి. అలాగే దసరా ఉత్సవాల సందర్బంగా దర్బార్ హాలులో 200 కిలోల బంగారు సింహాసనాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. ఈ సింహాసనాన్ని పాండవులు ఉపయోగించిన సింహాసనం‌గా చెపుతారు.



ప్యాలెస్‌లో 14 - 20 శతబ్దాల మధ్యలో నిర్మించిన దేవాలయాలు కలవు. వీటిల్లో శ్రీ శ్వేత వరాహ స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శ్రీ త్రినాయనేశ్వర స్వామి ఆలయం, శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి ఆలయం, శ్రీ కొడి బైరవ స్వామి ఆలయం, కిల్లి వెంకటరమణ స్వామి ఆలయం, శ్రీ భవనేశ్వరి దేవి ఆలయం, శ్రీ గాయత్రి దేవి ఆలయాలు ముఖ్యమైనవి.



దసరా ఉత్సవాల సందర్బంగా ఈ ప్యాలెస్ దీపపు కాంతులతో వెలిగిపోతుంది. ఈ ఉత్సవ ప్రారంభంలో బలరామద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫిరంగులను పేలుస్తారు. ప్రతి ఏటా అంబా విలాస్‌లోని బలరామద్వారం వద్ద ఉన్న నంది ధ్వజానికి పూజలు నిర్వహించడం ద్వారా జంబూ సవారీని అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు. జంబూ సవారీని వీక్షించెందుకు దేశ విదేశాల నుండి లక్షలాది పర్యాటకులు వస్తారు.



సందర్శన సమయం:

  • ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5:30 వరకు సందర్శకులను అనుమతిస్తారు. సందర్శకులు ప్రవేశ రుసుం చెల్లించాలి. (నేను వెళ్ళినప్పుడు రూ 50/- గా ఉన్నది). 
  • సందర్శకులకు గైడ్ సౌకర్యం ఉంది.
  • ప్రతి ఆదివారం, దసరా ఉత్సవాలు మరియు మరియు ముఖ్య పర్వదినాల సందర్బంగా ఈ ప్యాలెస్ 97000 విద్యుత్ దీపపు కాంతులతో వెలిగిపోతుంది.

లైట్ షో ప్రదర్శన:

  • ప్రతి రోజు మైసూరు రాజుల చరిత్ర గురించి సౌండ్ మరియు లైట్ షో ప్రదర్శన కలదు.
  • సోమవారం నుంచి బుధవారం వరకు రాత్రి 7 నుంచి 8 వరకు మరియు శనివారం రాత్రి 8.15 నుంచి 9.15 వరకు కన్నడ బాషలో ఉంటుంది.
  • గురువారం నుంచి శనివారం వరకు రాత్రి 7 నుంచి 8 వరకు ఇంగ్లీష్ బాషలో ఉంటుంది.
  • సౌండ్ మరియు లైట్ షో ప్రదర్శన వీక్షించెందుకు ప్రత్యేక రుసుం చెల్లించాలి. ప్యాలెస్ దక్షిణ ద్వారం వరాహ గేట్ కౌంటర్ వద్ద సాయింత్రం 6.30 నుండి టికెట్టులు ఇస్తారు.



ఎలా వెళ్ళాలి?

  • రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలచే ఈ నగరం అనుసంధానించబడి ఉన్నది.
  • ఈ ప్యాలెస్ మైసూరు సిటి బస్టాండ్‌కు వెనుక సుమారు 300 మీటర్ల దూరంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం