న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్

Photo by Manish Sharma from Pexels

లోటస్ టెంపుల్ అనేది భారత రాజధాని నగరమైన న్యూఢిల్లీలోని బహపూర్‌లో గల ప్రఖ్యాత అపురూపమైన ప్రార్ధనా మందిరం. చూడడానికి పెద్ద తామర పువ్వు ఆకారంలో నిర్మితమై ఉండటం వలన ఈ మందిరానికి లోటస్ టెంపుల్ (కమల మందిరం)అనే పేరు వచ్చింది. అధునిక కాలం‌లో మన దేశం‌లోని అద్భుత నిర్మాణాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు.

ఈ ఆలయం‌ బహాయి మతానికి చెందినది. మానవ జాతి ఏకత్వాన్ని విశ్వసించే బహాయి మత సిద్ధాంతం ప్రకారం దేవుడు నిరాకారుడు. అందువలన ఈ ఆలయం‌లో ప్రత్యేకించి ఏ దేవుడు ఉండడు. ఇక్కడ ఏ మతాన్ని అవలంబించేవారైనా సరే వారి మత గ్రంధాలను వారి బాషలో జపించుకోవచ్చు లేదా చదువుకోవచ్చు కాని వాటిపై ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుమతించరు.

ప్రత్యేకమైన ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతాన్ని హైదరాబాద్‌కు చెందిన అర్దిషీర్ రుస్తం‌పూర్ (Ardishr Rustampur) విరాళంగా ఇచ్చారు. ఈ నిర్మాణం కోసం తన యావదాస్థిని ఇచ్చారు. ఇరానీ శిల్పకారుడు ఫరీబోజ్‌ సహ్‌బా (Fariborz Sahba) సారధ్యం‌లో ఈ ఆలయ నిర్మాణం ఆరేళ్లపాటు కొనసాగి నవంబర్ 13, 1986 న పూర్తయింది. యు.కె.కు చెందిన ఫ్లిం‌‌‌‌ట్ అం‌డ్ నీల్ అనే సంస్థ ఈ నిర్మాణానికి స్టృక్చరల్ డిజైన్ ఇవ్వగా, ఇ.సి.సి. కన్‌స్ట్రక్షన్ గ్రూప్ నిర్మాణాన్ని చేపట్టింది.

Photo by Sandeep Gusain from Pexels

లోటస్ టెంపుల్ నిర్మాణం:

ప్రత్యేకమైన ఈ ఆలయానికి ప్రేరణగా హిందు, బౌద్ధ, జైన మరియు ఇస్లాం మతాల వారు పవిత్రంగా భావించే తామర ఆకారం‌‌ను ఎంచుకున్నారు. 26 ఎకరాల విస్తీర్‌ంజలో నిర్మించిన ఈ ఆలయాన్ని 9 వైపుల మొత్తం 27 రేకులతో కూడిన వికసించే తామర ఆకారంలో 131 అడుగులు ఎత్తులో ఉండి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి కనిపిస్తూ ఉంటుంది. తొమ్మిది ద్వారాలతో ఈ ఆలయం లోపల 2500 మంది కూర్చోగలిగినంత విశాలమైన ధ్యానమందిరం ఉంటుంది. ఈ నిర్మాణం చుట్టూ ఏర్పరిచిన జలాశయాల మధ్య నీటిలో తేలియాడుతున్నట్టు కనిపిస్తుంది. గ్రీస్ దేశం‌లోని పెంటెలి పర్వతం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాతితో నిర్మించారు. సౌర శక్తి ఉపయోగించిన ఢిల్లీలోని మొట్టమొదటి ఆలయాలలో ఇది ఒకటి.

లోటస్ టెంపుల్ ప్రత్యేకతలు:

ఈ సుందర కట్టడాన్ని ప్రతి రోజు సగటున 8000 నుండి 10000 మంది సందర్శకులు వీక్షించుటకు ఇక్కడకి వస్తుంటారు. ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించిన భవనాలలో ఇది ఒకటి. దీని శిల్ప కళా వైభవానికి ప్రపంచవ్యాప్తం‌గా అనేక అవార్డులతో పాటు ప్రశంసలు వచ్చాయి. ఈ భవనాన్ని తాజ్‌మహల్‌లాగే పాలరాతితో నిర్మించడం వలన ఉత్తర అమెరికా ఇంజినీరింగ్‌ సంఘం 20వ శతాబ్దపు తాజ్‌మహల్‌గా బిరుదిచ్చింది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానియా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వంటి అనేక ప్రచురణలలో గుర్తింపు పొందింది. భారత దేశ ప్రభుత్వం ఈ కట్టడం చిహ్నం‌గా ఒక తపాలా బిళ్ళ కూడా విడుదల చేసింది.

లోటస్ టెంపుల్ సందర్శన సమయం:

  • శీతాకాలం‌లో లోటస్ టెంపుల్‌‌‌ను ఉదయం 09:30 నుండి సాయంత్రం 05:30 వరకు సందర్శించవచ్చును.
  • వేసవికాలం‌లో లోటస్ టెంపుల్‌‌‌ను ఉదయం 09:00 నుండి సాయంత్రం 07:00 వరకు సందర్శించవచ్చును.
  • లోటస్ టెంపుల్‌‌‌‌లో ప్రవేశం ఉచితం.
Photo by Swapnil Deshpandey from Pexels

లోటస్ టెంపుల్‌‌కు ఎలా వెళ్ళాలి?

లోటస్ టెంపుల్ ఢిల్లీలోని బహపూర్ ప్రాంతం‌లో ఉంది. బస్సులు, టాక్సీలు, ఆటోలు, ఆన్‌లైన్ క్యాబ్ మరియు మెట్రో రైలు ద్వారా చేరుకోవచ్చు. లోటస్ టెంపుల్‌కు సమీపం‌లో గల Kalkaji Mandir మెట్రో స్టేషన్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆధ్యాత్మిక నగరి అరుణాచలం (తిరువణ్ణామలై)

గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం

ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం